బెజవాడ-బందరు రైల్వేస్టేషన్ల శ్లోకం

By | November 3, 2016

ఒకసారి దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారు బెజవాడ నుంచి బందరుకి రైల్లో వెడుతూ ఉండగా రెండు మూడు స్టేషన్లు దాటిన తర్వాత పక్కనున్నాయనని “తరువాత వచ్చే స్టేషన్ ఏమిటండీ?” అని అడిగారట. ఆయన “తరిగొప్పుల” అని చెప్పాడట. కొంచెం సేపయిన తర్వాత మళ్ళీ “వచ్చే స్టేషన్ పేరు?” అని అడిగితే పక్కనున్నాయన సమాధానం “ఇందుపల్లి” అని. కాస్సేపయిన తరువాత మళ్ళీ ఇప్పుడు వచ్చే స్టేషనేమిటి” అని అడగ్గానే పక్కాయనకి విసుగు పుట్టి , “ఏవండీ మీకు సంస్కృతం వచ్చునా?” అని అడిగారట. దువ్వూరివారు మహాపండితులు, అయినా “ఏదో కొద్దిగా వచ్చులెండి” అని అన్నారు. అప్పుడు ఆ పక్కనున్నాయన “అయితే ఈ శ్లోకం రాసుకోండి – స్టేషన్ల పేర్లన్నీ గుర్తుంటాయి” అని ఇలా చెప్పాడట –

“బెరాని ఉత ఇందోగు నూక 
వప్పెచిమాః క్రమాత్ 
స్టేషన్సు బెబం శాఖాయాం 
నూక్రాస్యాదితి నిర్ణయః” 
అప్పుడు శాస్త్రి గారు రాసుకుని చదువుకున్నారు 

బె = బెజవాడ 
రా = రామవరప్పాడు 
ని = నిడమానూరు 
ఉ = ఉప్పులూరు 
త = తరిగొప్పుల 
ఇం = ఇందుపల్లి 
దో = దోసపాడు 
గు – గుడ్లవల్లేరు 
నూ = నూజెళ్ళ 
క = కవుతరం 
వ = వడ్లమన్నాడు 
పె = పెడన 
చి = చిలకలపుడి 
మ = మచిలీపట్నం 
బెబం = బెజవాడ బందరు మధ్య స్టేషన్లు 
కానీ “నూక్రాస్యాత్” అనే పదం అర్థం కాక ఏమిటి అని ఆ పక్కాయన్ని కదిపితే వెంటనే ఆయన ” నూజెళ్ళలో క్రాసింగ్ అవుతుంది” అని చెప్పి దిగిపోయాట్ట. 

ఇంతకీ ఈ శ్లోకం చెప్పిన మహానుభావుడి నామధేయం మాత్రం తెలీదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield