తెలుగు మాట వ్యాసాలు

By | February 1, 2017

ఇవి ‘తెలుగు మాట’ గూగుల్ గ్రూప్ ద్వారా అందినవి

అచ్చ తెలుగు, అనువాద తెలుగు, ఆంధ్రప్రదేశ్‌ తెలుగు, తెలంగాణ తెలుగు, సంస్కృత  భూయిష్టమైన తెలుగు… ఇన్ని తెలుగుల మధ్య ఇప్పుడు పెనుగులాట తీవ్రంగా నడుస్తోంది. ఈ మధ్య ఇంటర్నెట్‌లో ఐరనీ అన్న ఆంగ్ల పదానికి సమానార్థకమైన తెలుగుపదం ఏమిటని తెగ పెనుగులాడుతున్నారు. రకరకాల మెసేజ్‌లు నడుస్తున్నాయి. అదే ఐరనీ! మన భాషలో చెప్పుకోవాలంటే ‘విచిత్రం’. ఒక ప్రముఖ పత్రిక ప్రతి దాన్నీ తెలుగులోనే రాస్తానని కంకణం కట్టుకుని కొత్త కొత్త లేదా అతి పాత పదాలను వదులుతుంది. దాన్నుంచి ఉత్తేజం పొందిన కొందరు ఆ పదాలను వాడేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలైన తర్వాత కూడా తెలుగైతే ఒకటే కనుక, దాన్ని తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేకంగా అన్వయించడంలో ఇంకొందరు తమదైన సృజనాత్మకత చాటుకోవడం మూడో కోణం. ఎప్పట్లాగే ఈ తెలుగు గొడవ పట్టని కొందరు సంస్క ృత ప్రియులు పాత శ్లోకాలనే పట్టుకు ఊరేగుతున్నారు. 
వెయ్యేళ్లకు పైబడిన తెలుగు సాహిత్యం, అర్ధ శతాబ్ది మించిపోయిన ఆధునిక పాలనా వ్యవస్థ, హేమాహేమీల వంటి కవులు రచయితలు కళాకారులూ విద్యావేత్తలు విజ్ఞానవేత్తలు నేతల వారసత్వం తర్వాత కూడా భాషాభివృద్ధికి ఏది మార్గమో నిర్ణయించుకోలేని గజిబిజి ఎందుకు వస్తున్నట్టు? 
ఉదాహరణకు ఐరనీ ఐరానికల్‌ అన్న ఇంగ్లీషు పదాలను తెలుగులో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా వాడతుంటాం. వ్యంగ్యం, వక్రోక్తి, అవహేళన అని కొందరు నిఘంటువుల్లో ఉండే అర్థం ఇచ్చారు గాని విచిత్రం, విడ్డూరం, విషాదం, విపరీతం, అనుకోని పరిణామం, అన్నిటికీ ఈ పదాన్ని తెస్తుంటారు. నిజం చెప్పాలంటే ఇంగ్లీషులో కూడా ఐరనీ అనే పదం వాడకంలో విపరీతమైన భిన్నాభిప్రాయాలున్నాయి. భారతీయ భాషల్లో మరీ ముఖ్యంగా తెలుగులో ఒకే అర్థానికి స్వల్ప తేడాతో రకరకాల పదాలు వాడుకలో ఉన్నాయి. వైశాల్యం, వైవిధ్యం, ప్రాచీనత, సమ్మేళనం వంటి అనేక కారణాలు ఈ పదాల సృష్టికి దారితీశాయి. మరికొన్ని జనం వాడుకలో ఉన్నాయి గాని కావ్యాల్లో ఉండవు. ఈ రెండు రకాల వాటిని సందర్భోచితంగా వాడుకోవడం అవసరం. అదేమీ జ్ఞానలోపం కాదు, తెలుగు భాషా సంపన్నతకు ఒక నిదర్శనం. ఉదాహరణకు ఫస్ట్‌ అంటే మొదటి, తొలి, ప్రథమ, ప్రారంభ, ఆది వంటి అనేక పదాలను ఉపయోగించినా అర్థం మారదు. సంస్క ృతం ప్రాకృతం, ఉర్దూ, పారశీకం, ఇంగ్లీషు వంటి భాషల నుంచి అనేక పదాలు తెలుగులో మిళితమై పోవడంవల్ల ఇంత వైవిధ్యం సాధ్యమైంది. మనం ఇంగ్లీషు మాట విని అర్థం చేసుకున్నట్టే తెలుగుపదం అనిపించకపోతే అది భాష తప్పు కాదు. మన అవగాహనా లోపమే! దీనికి పరిశీలన, అన్వయశీలత, లోకజ్ఞానం మాత్రమే గాని నిఘంటువులూ, కేవలం వ్యాకరణ సూత్రాలూ సరిపోవు. ఎప్పుడైనా భాషలోంచి సాహిత్యం వస్తుంది గాని సాహిత్యంలోంచి భాష రాదు. కాలానుగుణంగా మాటలూ మర్యాదలూ మారుతుంటాయంతే! సుప్రసిద్ధమైన విజయవారి మాయాబజార్‌ చిత్రం టైటిల్‌లో బజార్‌ ఏ భాషా పదం? ఒక పౌరాణిక చిత్రానికి పొసుగుతుందా అని ఎవరికి ఎన్నడూ సందేహం రానంతగా అమరిపోయింది. దానికన్నా ముందే పాతాళభైరవిలో ఎంత ఘాటు ప్రేమయో అన్నప్పుడు కూడా మధుర ప్రేమే తప్ప ఘాటేమిటని ఎవరికీ అభ్యంతరం కలగలేదు. అదో ప్రయోగంగా స్థిరపడిపోయింది. భావంతో ఆలోచిస్తే భాష వికసిస్తుంది, లేదంటే ముకుళిస్తుంది. 
మరో సమస్య… కొంతమంది మిత్రులు పాత్రికేయుల కృత్రిమ భాషాసృష్టి లేదా విశ్వామిత్ర సృష్టి. మొబైల్‌ పోన్‌ను చరవాణి అని రాస్తున్నారు. కాని అది కూడా తెలుగు కాదు. ఈ దేశంలో ఎవరైనా ఎప్పటికైనా చరవాణిలో మాట్లాడాను అనడాన్ని ఊహించలేము. ఎన్నడో కనిపెట్టిన ఫోన్‌కే దూరవాణి అన్న పదమున్నా వాడటం లేదు. తెలుగు మీడియంను తెలుగు మాధ్యమం, మీడియాను ప్రసార మాధ్యమాలు అని కొందరు పనిగట్టుకుని వాడటం తప్ప నిజంగా వినియోగంలోకి వచ్చే ప్రసక్తి ఉండదు. అలాటప్పుడు ఈ ఈ వ్యర్థ ప్రయాస ఎందుకు ? వాల్‌పోస్టరును గోడపత్రిక అని వాడటం భాషాపరంగా కానీ, సాంకేతికంగా కానీ పొసిగేది కాదు. ఆహ్వానపత్రిక, లగపత్రిక, దినపత్రిక వంటి పదాలతో పోల్చిచూస్తే పోస్టరు పత్రిక కానే కాదు. పాఠశాల, వైద్యశాల, కళాశాల, కార్యాలయం వంటి పదాలు చాలా ఉన్నా తెలుగువారెవరైనా ఎక్కడైనా రోజువారీ జీవితంలో వాడటం నేనైతే చూడలేదు. కొన్ని రాతకే పరిమితం. మరికొన్ని రాతలోనూ అంతంతమాత్రమే. పాఠశాలకు పంపించానని ఏ తెలుగు తల్లీ చెప్పదు కాని బడికి వెళ్లడం అని అప్పుడప్పుడూ అంటుంది. ద్విచక్రవాహనం, చాతుర్చక్రవాహనం అని ఎవరూ అనరు. (పోలీసు ప్రకటనల్లో తప్ప!) బండి అని మాత్రం అంటారు. వైద్యశాల అనం గాని తెలుగీకరించుకున్నా ఆస్పత్రి అంటాం. టీవీ చానల్‌ అన్న మాట తీసుకుంటే టీవీ అనే రెండక్షరాల మాటను ఎలక్ట్రానిక్‌ ప్రసార మాధ్యమం అనడం కన్నా ప్రహసనం ఏముంటుంది? మాధ్యమం అన్న మాటపై ఓటింగు పెడితే ఏ పది శాతమో తప్ప మిగిలిన వారికి అర్థం కాదు. ఓటింగుకూ తెలుగు లేదు. చానల్‌కు ఎలాగూ తెలుగు లేదు. హైదరాబాదులో సచివాలయం పక్కనే సెక్యూరిటీ ప్రెస్‌ ఉంటుంది. దానికి ప్రతిభూతి ముద్రణాలయం అని రాసి ఉంటుంది. ఇవన్నీ విచిత్రమైన ఉదాహరణలు. సందర్భం, సారాంశం అన్నిటినీ గమనంలో ఉంచుకుని అర్థవంతమైన పదాలు సృజించగలిగితే మంచిదే. అతకనివి కనిపెట్టి రుద్దితే అతుకుల బొంతే అవుతుంది. వాటినెవరూ ఇష్టపడరు. అవి చిరకాలం మన్నవు కూడా! 
గతంలో చాలాసార్లు చెప్పుకున్నట్టు మానవ సంబంధాలు, భావాలు, కుటుంబ బంధాలు, రాగద్వేషాలు, రాచరిక వ్యవస్థ వరకూ తెలుగులో పుష్కలంగా పదాలుంటాయి. ఆధునిక ప్రక్రియలకూ సాంకేతిక పరికరాలకు సంబంధించిన పదాలు ఉండవు. వాటిని ఎరువు తెచ్చుకోవడం పరువు తక్కువేమీ కాదు. గౌరవసూచకమైన ‘గారు’ అన్న మాట ఉర్దూనుంచి వచ్చి చేరిందని ఎందరికి తెలుసు? అటక అన్నది ఇంగ్లీషు మాట అని మరెందరికి గుర్తుంటుంది? ఇక ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమల్లో యాసను బట్టి కొన్నిచోట్ల తెలుగు గొప్పదని, కొన్నిచోట్ల కాదని, లేక మూడు చోట్ల వాడే తెలుగు వేరువేరని అనుకుంటే అంతకన్నా అశాస్త్రీయం, అచారిత్రికం మరొకటి ఉండదు. ఎవరో కొందరు దురభిమానులు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవనవసరం లేదు. తిక్కన, పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, తాళ్లపాక అన్నమయ్య, వేమన .. వీరందరివీ చక్కటి తెలుగులే! తిక్కనది నాటకీయత నిండిన అచ్చతెలుగు. పాల్కురికిది సంస్క ృతం మేళవించిన తెలుగు. పోతనది భక్తిపారవశ్యం పొంగి పొర్లిన తెలుగు. అన్నమయ్యది అన్నమంత సహజమైన తెలుగు. వేమనది వేయి వేటుల పదును గల తెలుగు. ఇక ఆధునిక రచయితలు, కవుల విషయంలోనూ పదంతో కదం తొక్కించిన శ్రీశ్రీ నుంచి తొలిపాటలోనే ‘పూలదండవోలె.. కర్పూరకళిక వోలె’ అని తెలుగు వారి హృదయాలు దోచిన సినారె వరకూ ఉద్యమ కవులది ప్రజా కవులూ రచయితలది మరో జాబితా. ఆకలి, అన్నం, విప్లవం, పోరాటం, చైతన్యం, ఉద్యమం వంటి మాటలకు తేడానే లేదు. కొన్ని మాటలు రాత వరకూ వాడొచ్చేమో గాని వాడుకలోకి రానేరావు. అప్పుడు వాటికి సార్థకత ఉండదు. 
దేశాల సరిహద్దులనే చరిత్ర చెరిపేసిన నేపథ్యంలోనూ భాషలు మారలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలయ్యాయి గనక కొత్త భాష వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే! గతంలో ఏవైనా చక్కని ప్రయోగాలుండి కూడా వినియోగంలోకి రాకపోతే తీసుకురావచ్చు. మరుగుపడిన అంశాలను వెలికి తీయొచ్చు. కానీ, ఆ ప్రయత్నం సహజంగా జరిగితేనే నిలుస్తుంది. ఇప్పటికి ఈ మూడు ప్రాంతాల్లోనూ నేను ఇంచుమించు సమానమైన కాలం ఉన్నాను గనక వాటి లోతుపాతులు, విశేషాలు, వివాదాలు చాలానే చూశాను. ఎవరి అభిమాన దురభిమానాలు ఎలా ఉన్నా ఏ ఒక్కరూ ఒక్క ప్రాంతం భాషలోనే మాట్లాడటం నేటి ప్రపంచంలో సాధ్యం కాని పని. రాతలో అసలే జరగదు. అలా అనుకోవడం ఆత్మతృప్తికి లేదా ప్రభుత్వ ధనం ఖర్చు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆయా చోట్ల గల ప్రత్యేకతలు కాపాడుకుంటూనే – కొత్త పదాలు సృష్టించుకుంటూ – ఉన్న భాషాపదాలు కూడా స్వీకరిస్తూనే తెలుగును సుసంపన్నం చేసుకోవాలి. ఇంగ్లీషే గొప్పది గనక మాతృభాషను వదిలేసి దానివెంట పరుగులు తీయనవసరం లేదు. బళ్లలో వసతులు లేని మీడియంలు రుద్దనవసరం లేదు. కాని ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులోకి అయ్యో అనే తెలుగుపదం ప్రవేశించింటే, ‘అయ్యో’ అనుకోకుండా భాషా లక్షణం తెలుసుకోవాలి. అసలు ప్రయోగాలు చూయకూడదని, ప్రాంతీయ ప్రత్యేకతలు విస్మరించాలని కాదు గాని మొత్తంగా వాస్తవిక దృక్పథం కాపాడుకోవాలి. సంస్క ృత ఛాందసం గాని లేక ఇంగ్లీషు వ్యామోహం గాని కాదంటే ప్రాంతీయ దురభిమానం గాని నిలిచేవి కావని ప్రతివారూ అర్థం చేసుకోవాలి. భాష అంటే ఒక ప్రవాహం. భాష సజీవంగా ఉండాలంటే ముందు సహజంగా ఉండాలి. శక్తివంతంగా పలకాలి. అంతే!

– తెర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield