బాహుబలిః ది కంక్లూజన్ – చిత్రసమీక్ష

By | May 27, 2017

బొమ్మకు లంకె

ఈ చిత్రం బాహుబలి – ది బిగినింగ్ చిత్రానికి కొనసాగింపు. మరి కొనసాగింపులు ఉండవనడానికి సూచనగా దీనికి బాహుబలి – ది కంక్లూజన్ అని పేరు పెట్టి ఈ ఏప్రిల్ 28న విడుదల చేశారు. 

కొంచెం ప్రేమ, కొంచెం హాస్యం, చాలా యుద్ధాలు, చెప్పలేనంత హింస – ఈ అంశాలతో నడిచే ఈ కథని – అప్పుడే కలం పట్టిన ఏ రచయిత అయినా క్షణాలమీద తయారుచెయ్యగలడు. కానీ ఈ చిత్రం బడ్జెట్ 250 కోట్లు. అందులో ప్రతిపైస విలువా ప్రేక్షకుడికి కనిపించేటంత అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. అందుకు అంత అద్భుతంగానూ సహకరించారు ఇతర సాంకేతిక నిపుణులు.

బాహుబలి పాత్ర తనకోసమే పుట్టిందనిపించేలా ఉన్నాడు ప్రభాస్. ఇలాంటి పాత్రలను అనితరసాధ్యంగా పోషించిన అలనాటి ఎన్టీఆర్‍ని గుర్తు చేసుకుంటే – శరీర సౌష్టవంలో ఆయనకంటే గొప్పగానూ,  డైలాగ్సు డెలివరీలో కొంచెం తీసికట్టుగానూ – అందంలో, హవభావాల్లో ఆయనకు దీటు వచ్చేలాగానూ ఉన్నాడు. భల్లాలదేవుడిగా రానా డైలాగ్ డెలివరీతో సహా తనకి తానే సాటి అనిపించాడు. శివగామిగా రమ్యకృష్ణకి   ఈ పాత్ర ఆమె నటజీవితంలో ఒక మైలురాయి. బిజ్జలదేవుడిగా నాజర్ విశిష్టంగా అనిపించాడు. కట్టప్ప పాత్రకి సత్యరాజ్ ప్రాణం పోశాడు. కానీ హాస్య సన్నివేశాల్లో కూడా నటనలో రాణించినా – చిత్రంలో ఆ సన్నివేశాలు అంతగా ఇమడక కంటిలోని నలుసు అనిపించొచ్చు. అటు హాస్యం, ఇటు రౌద్రం చూపిన కుమారవర్మ పాత్రలో సుబ్బరాజు హుందాగా ఉన్నాడు. అందంలో, రాజసంలో తనకి తనే సాటి అనిపించే దేవసేన పాత్రకి అనుష్క అద్భుతంగా రూపకల్పన చేసింది. బాహుబలి మొదటి భాగంలో అవంతికగా విలక్షణ పాత్రని పోషించిన తమన్నా  – తనూ ఉన్నాననడానికి ప్రేక్షకుల గుర్తింపుకి నోచుకోని తరహాలో చివర్లో కాసేపు కనిపిస్తుంది.

సంభాషణలు చిత్రానికి తగిన రీతిలో ఉన్నాయి. పాటల్లో అలనాటి జానపద ధోరణి ఉంటే బాగుండేది. ఐతే వినడానికి బాగున్నాయి. చిత్రీకరణలో అద్భుతం అనిపిస్తాయి. నేపథ్య సంగీతం హాలీవుడ్ చిత్రాల్ని గుర్తు చేస్తుంది.

ఈ చిత్రంలో దృశ్యాలు చూస్తున్నప్పుడు గతంలో వచ్చిన చందమామ పిల్లల కథల మాసపత్రికలో – సీరియల్సుకి – చిత్రకారుడు చిత్ర వేసిన అద్భుత చిత్రాలు ప్రేరణ అనిపిస్తుంది. చాలాచోట్ల దృశ్యాలు పాత చందమామలో సీరియల్ బొమ్మలు చూస్తున్న అనుభూతినిస్తాయి. చాలా దృశ్యాలు – ముందుగా స్టిల్సు వేసుకుని – ఆ ప్రకారం చిత్రీకరించినట్లు అనిపిస్తుంది. మచ్చుకి – కట్టప్ప బాహుబలిని పొడిచిన దృశ్యం.

హాలీవుడ్ చిత్రాల్ని మించిపోయేలా చిత్రీకరించబడ్డ ఈ చిత్రంలో లోపమంటూ ఉంటే అది కథ ఒక్కటే!  అద్భుతమైన పాత్రల్ని సృష్టించిన రచయిత – వాటి చుట్టూ అల్లిన కథ చాలా పేలవంగా అనిపిస్తుంది. కథలో లోపాలు కూడా ఎన్నో కనిపిస్తాయి. చిత్రీకరణలో ఘనవైభవం లేకపోతే – ఈ చిత్ర కథ అలనాటి విఠలాచార్య చిత్రకథలకు సాటి రాదు. మన చిత్ర నిర్మాత, దర్శకులకు కథంటే ఉన్న చిన్నచూపుకి ఈ చిత్రం మరో ఉదాహరణగా నిలచిపోతుంది. హాలీవుడ్ వారు కథకిచ్చే ప్రాధాన్యం గురించి ఇక్కడ వేరే ప్రస్తావించనవసరం లేదు.

ఆ విషయం పక్కన పెడితే-

ఆదినుంచి అంతందాకా ఇది కనులకు పండుగ చేసే ఒక అద్భుత దృశ్యకావ్యం. మరో ప్రపంచంలోకి తీసుకుపోయి మరిపించే మాయాజాలం. భారతీయ చిత్రనిర్మాణంలోనే అపూర్వమనిపించేలా యుద్ధదృశ్యాల్ని  తెరకెక్కించి, ప్రేక్షకుల్ని దిగ్భ్రాంతుల్ని చేసిన చిత్రమిది. ఈ చిత్రం చూడ్డం ఓ గొప్ప అనుభవం.

సృజనకంటే ప్రతిభకు పెద్దపీట వేస్తారు మన దర్శకులు. 250 కోట్ల ఖర్చులోని ప్రతి రూపాయీ తెరమీద కనిపించేలా ప్రేక్షకులకు కనువిందు చేసిన రాజమౌళి దర్శకత్వ ప్రతిభ అనితరసాధ్యం. అందుకేనేమో ఇప్పటికే ఈ చిత్రం వసూళ్లు 1600 కోట్లు దాటి మన దేశంలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది.

‘నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడల పేర్లు చెబితే మనకు మహాభారతం గుర్తుకొస్తుంది. మహాభారతం వారి స్వంతం కాదు. వేదవ్యాసుని ‘జయం’కు అనుసరణ. వారి తెలుగుసేత- అది వారి రచనే అన్నంత గొప్పగా, ప్రత్యేకంగా ఉంది. అలాగే పోతన భాగవతం. మన తెలుగువారు స్వయంప్రతిభకంటే- అనుకరణ, అనువాదాలలోనే ఎక్కువ రాణిస్తారు. అలాంటి అనుకరణ, చిత్రానువాదాల్లో- రాజమౌళి పూర్వకవుల స్థాయికి చేరుకున్నారు’ ఆని బాహుబలి – ది బిగినింగ్ చిత్రసమీక్షలో అన్నాం. ఈ చిత్రానికీ అది వర్తిస్తుంది. మున్ముందు వారినుంచి పూర్తి స్వతంత్ర దృశ్యకావ్యాల్ని ఆశిద్దాం.

సమీక్ష

3 thoughts on “బాహుబలిః ది కంక్లూజన్ – చిత్రసమీక్ష

 1. Ramana Rao (Electron)  0  0

  Respected Vasumdharas,

  Your review on Bahubali-2(The conclusion) is really fantastic and true in all aspects. Recent adaptation of an already old cinematographic technology of Hollywood put director Rajamouli on a high Indian pedestal.

  Reply
  1. వసుంధర Post author   0   0

   Thanks for your opinion. please send your valuable feedback via email in case the comments portion is not functioning properly.

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield