మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు

By | February 7, 2018

గూగుల్ గ్రూప్ తెలుగు మాట సౌజన్యంతో

నమస్కారం,
మన కర్ణాటక సంగీత ప్రపంచంలో త్రిమూర్తులగా వెలుగొందుతున్న శ్రీ త్యాగరాజ స్వామీ, శ్యామశాస్త్రీ, ముత్తుస్వామీ దీక్షితారు గారల కాలమునకు ఇంచుమించు 50 సంవత్సరముల తరువాత , మన తెలుగునేలపై మరొక భక్తి సంగీత అచార్య త్రయం విలసిల్లినది. వారే  తెలుగు సాహిత్యలోకంలో పాలమూరు దాసత్రయంగా ప్రసిద్ధినొందిన “మన్నెంకొండ హనుమద్దాసు”, “వేపూరు హనుమద్దాసు” , “రాకమచర్ల వేంకటదాసు”. వీరందరు  19వ శతాబ్ధములో జీవించియున్న పాలమూరు జిల్లాకు (మహబూబునగరు) చెందిన వాగ్గేయకారులు. వీరిలో మన్నెంకొండ హనుమద్దాసు గారు మరియు వేపూరు హనుమద్దాసు గారు  భద్రాద్రి రాములవారిపై భక్తిరస ప్రధానమయిన కీర్తనలు రచించగా, వెంకటదాసు గారు లక్ష్మీ నృసింహ స్వామిపై  కీర్తనలు రచించిరి. మన భక్త రామదాసు వారి కీర్తనల వలె వీరి కీర్తనలు కూడా సులభశైలిలో యుండి పండిత పామరుల మెప్పు పొంది, సామాన్య జనులను సైతం భక్తి మార్గములో నడిపించెడి శక్తి కలవని ప్రతీతి . వారు తమ సంగీత ప్రతిభనుగూడా భక్తిరసములో  ఇనుమడింపచేసి సంగీతకళకు ఒక పరమార్థమును కలిగించిరి.       
ఇంతటి ప్రాశస్త్యం కల ఈ వాగ్గేయకారుల గురించి కానీ, వీరి రచనల గురించి కానీ (అనేక  కారణముల వలన) కర్ణాటక సంగీత లోకములో ఎందుకో అంతగా ప్రాచుర్యం లభించలేదు. సాహిత్య ప్రపంచంలోనూ అతికొద్దిమందికి మాత్రమే వీరి గురించి తెలుసును (ఈ వాగ్గేయకారుల కాలమున, వీరు నివసించియున్న తెలుగునేలలో భాగమయిన తెలంగాణ అత్యంత నిరంకుశ పాలనలో యుండుట వలన, వీరి గురించి బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియకపోవుటకు  ప్రధాన కారణములలో ఒకటని అనుకోవచ్చును).  అయితే, మన ఆకాశవాణి వారు చాలా సంవత్సరములకు పూర్వం  మన్నెంకొండ హనుమద్దాసు గారి కీర్తనల్లో కొన్ని ప్రసిద్ధమయినవి రికార్డు చేసి, భక్తిరంజని కార్యక్రమములో ప్రసారము చేసియుండెను, కాని తరువాత  ఎందులకో వీరి కీర్తనలు పరంపరగా కొనసాగలేదు.  నాకు కూడా ఈ గొప్ప వగ్గేయకారుల గూర్చి చాలా అలస్యముగా తెలిసినది. ఆకశవాణి వారు అప్పుడు చేసిన కొన్ని రికార్డులను విని , వీరి కృతులలోని  సంగీత  సాహిత్య మాధుర్యమును ఆస్వాదించితిని.

 ఈ క్రింద లంకెలలో (లింకుల్లో) దాసత్రయము గూర్చి  సమాచారము.

మన్నెంకొండ హనుమద్దాసు గారి కీర్తనలు మరియూ ఈ దాస త్రయము వారి లభ్యముగా నున్న కీర్తనలు మన కర్ణాటక సంగీతమునకు మరో అమృతవర్షిణివలె కొత్త శక్తిని ప్రసాదించి, సంగీత కచేరీలలో  వీరి కృతులను విరివిగా ఆలపించే రోజులు రావలెనని ఆశిస్తూ,  సెలవు.

 ధన్యవాదములు,
                                                                                                                                                                                                      ఇట్లు, 
తెలుగు మాట-పాట యొక్క అభిమాని,
                                                                                                                                                                                                     ప్రశాంతం     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield