మే 4, 2009
భావాలు పంచుకుందాం
దినవార్తలు తెలుసుకున్నా, ఓ కథ చదివినా, టీవీ/సినిమా చూసినా- ఈ బ్లాగులో మీ భావాలు పంచుకోండి. ఒకరితో పంచుకున్నప్పుడే మన అభిప్రాయాలకు ఆలోచన అవసరపడుతుంది. మనకు ఆలోచించడం అలవాటైతే ఒకటా, రెండా- ఎన్నో ప్రయోజనాలు. గుడ్డిగా IIT కోసమే చదవం. పెళ్ళికి కట్నాలు ఇవ్వం, తీసుకోం. దేవుణ్ణి ప్రేమించడమంటే పరమతాన్ని ద్వేషించడమే అనుకోం. ట్రాఫిక్ రూల్స్ పాటించరాదనుకోం. రోడ్లమీద చెత్త, చెదారం, ఉమ్ము వేయం. భాషలోకి బూతుల్ని రానివ్వం. ఓటేసేటప్పుడూ, ఓటేసాకా కూడా నిర్లిప్తత పాటించం.
ఆలోచిస్తే మనం సరదాగా షికారుకెళ్ళినా అది బాధ్యత ఔతుంది. ఆలోచించకుండా వ్యవహరించడం బాధ్యతారాహిత్యం.
మనం ఆలోచించడం లేదు. ఐనా మనదేశం ప్రగతిపథంలోకి దూసుకెడుతోంది. మరి మనం ఆలోచిస్తే?
ఏమౌతుందో మీకు తెలుసు. మరి ఆలస్యం దేనికి?
మా ఆలోచనలు మీ ముందుంచుతున్నాం. ఒప్పనిపిస్తే అనుసరించండి. తప్పనిపిస్తే సరిచేయండి. తప్పొప్పుల నిర్ణయాన్ని తర్కానికే తప్ప అహానికి వదలొద్దు. దేనికైనా కావలసిందొక్కటే- ఆలోచన!
రండి, వసుంధర అక్షరజాలంలో భావాలు పంచుకోండి. మీకు తెలిసినవి నేర్పండి. తెలియనివి నేర్చుకోండి.
మీ స్పందనకోసం ఎదురు చూస్తున్నాం.
radhika said,
మే 5, 2009 at 3:01 ఉద.
“మనం ఆలోచించడం లేదు. ఐనా మనదేశం ప్రగతిపథంలోకి దూసుకెడుతోంది. మరి మనం ఆలోచిస్తే”…మీరు చెప్పింది నిజమే.బ్లాగుల్లో జరిగిన కొన్ని చర్చలు చాలా మంచి విషయాల్ని వెలుగులోకి తీసుకు వచ్చాయి.కానీ అవి అందాల్సిన వాళ్ళకి అందట్లేదు.
వసుంధర said,
మే 6, 2009 at 6:50 ఉద.
బ్లాగులు అందరికీ అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్నవారు చర్చల్లో పాల్గొని వాటి సారాంశాన్ని ఇతరులకు చేరవేయవచ్చు. ఇతరులలో మనకు మించిన విజ్ఞత చూడగలగడం, మన భావాలను ఆ విజ్ఞులతో పంచుకోవడం ముందు మన వ్యక్తిత్వాలకు ప్రయోజనం. మీ స్పందనకు ధన్యవాదాలు.
వసుంధర