ఆగస్ట్ 21, 2009

నడుస్తున్న ఈ టీవీ కార్యక్రమాలు

Posted in టీవీ సీరియల్స్ at 3:35 సా. by kailash

నడుస్తున్న ఈ టీవీ కార్యక్రమాలు
సోమవారంనుంచి శుక్రవారందాకా ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంటకి ప్రారంభమై గంటసేపు కొనసాగే సత్కాలక్షేపం “స్టార్ మహిళ“. యాంకర్ సుమ నిర్వహణలో ఈ కార్యక్రమం మహిళలకే కాక అన్ని వర్గాలకూ ఆసక్తికరంగా ఉంటోంది. ఈ వారంనుంచి ఈ కార్యక్రమం శనివారాలకు కూడా విస్తరించనుంది.

ప్రస్తుతం సోమ-శని వారాల్లో రాత్రి 7-7.30 మధ్య వచ్చే “అభిషేకం” సీరియల్- ప్రేమలు, త్యాగాలు, మోసాలు, అనుమానాలు పుష్కలంగా ఉన్న ఓ రొటీన్ కథ. దాసరి నారాయణరావు దీవెనలతో వస్తున్న ఈ సీరియల్- ఆరంభంలో “గోరింటాకు” సినిమానీ, తర్వాత “బలిపీఠం” సినిమానీ, ఆ తర్వాతనుంచి ఏదో ఒక పాత తెలుగు సినిమానీ గుర్తు చేస్తూ కొనసాగుతోంది.  సంభాషణలు ఆరంభంలో గొప్పగా అనిపించినా, ఇప్పుడు ఫరవాలేదనిపించేలా మాత్రం ఉన్నాయి. దర్శకత్వం (ఎం.ఎస్. కోటారెడ్డి) ఇప్పటికీ ప్రతిభావంతంగా ఉంది. నటీనటుల ఎన్నిక ప్రశంసనీయం. గతంలో రాధ-మధు (మా టీవీ) సీరియల్లో- మధులిక పాత్రని అద్భుతంగా పోషించిన మౌనిక ఈ సీరియల్ ఆరంభంలో నిరాశ కలిగించినా ఇప్పుడిప్పుడే పుంజుకుని తన పాత్రకి ప్రాణం పోస్తోంది. అందరూ బాగా నటిస్తున్నా చిన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక కిరణ్ పాత్రధారికి- కేవలం కంటి చూపు, హావభావాలతో- ప్రేక్షకులకి గుండెదడ పుట్టించగల విలన్ గా గొప్ప భవిష్యత్తుందనిపిస్తుంది. షోలే సినిమాలో అంజాద్‌ఖాన్‌లా అతడి నటనలో నూతనత్వం, ఆకర్షణ ఉన్నాయి. చూడకపోతే మిస్సయ్యామనిపించకపోయినా- చూస్తే ఎందుకు చూసామా అనిపించని ఈ సీరియల్లో టైటిల్ సాంగ్‌లో తరచుగా వినపడే “అభిషేకం” పదం ఫన్నీగా అనిపిస్తుంది.
 
ప్రస్తుతం సోమ-శని వారాల్లో రాత్రి 7.30-8 మధ్య వచ్చే “తూర్పు వెళ్లే రైలు” సీరియల్ ఆరంభంలో రాధ అనే యువతి భర్త చనిపోతాడు. కానీ ఆమె అన్న ఆ విషయం ఆమెకి తెలియనివ్వడు- “శారద” సినిమాలోలా.  ఆ సినిమాలోలాగే అచ్చం ఆమె భర్తకిలాగే ఉన్న ఓ వివాహిత డాక్టరు ఇంటికి చేరుతుందామె.  ఆ సినిమాలో ‘జయంతి’ లా- ఆ డాక్టరు భార్య మానవత్వానికీ, త్యాగానికీ మధ్య ఊగిసలాడుతుంది. ఎటొచ్చీ అనుకోని పరిస్థితుల్లో రాధ ఆ డాక్టరు ద్వారా గర్భవతి కావడం కథకి కొత్త మలుపు. తర్వాత రాధ అసలు సంగతి తెలుసుకుని ఆ ఇల్లు వదిలిపెట్టి కష్టాలు కొనితెచ్చుకుంటుంది. ఈలోగా డాక్టరు కూతురు అకాలమరణం చెందడంతో- అతడిభార్యకి “జీవనజ్యోతి” సినిమాలోలా “ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు” పాట పాడే తరహా పిచ్చి పడుతుంది. అదలాగుంచితే సమానాంతరంగా సాగే మరో కథలో సంధ్య భర్త మోహన్ ఆర్మీ ఆఫీసరు. కొడుకు యుద్ధంలో చనిపోయాడనుకుని మోహన్ తలిదండ్రులు కోడల్ని బలవంతపెట్టి శాడిస్టు ఆనంద్‌తో పెళ్లి జరిపిస్తారు.  ఈలోగా “హందోనో”, “సిపాయి చిన్నయ్య” చిత్రాలలోలా- చనిపోయాడనుకున్న మోహన్ తిరిగొస్తాడు. అంతవరకూ ఆసక్తికరంగా నడిచిన ఈ కథ అక్కణ్ణించి నత్త నడక నడుస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. శాడిస్టు భార్యగా అసామాన్య వ్యక్తిత్వాన్ని ప్రదర్షించిన సంధ్య పాత్ర- భర్త మంచివాడుగా మారినా- ఏడ్పుకే పరిమితమై విసుగు పుట్టిస్తుంది. ఇప్పుడు కథ జీడిపాకంలా సాగుతోంది. ఓ నెల్లాళ్లపాటు వరుసగా చూడకపోయినా- కథలో ఎక్కడా వెనుకబడ్డామనిపించని ఈ సీరియల్లో- ఆసక్తికరమైన డైలాగ్సు కానీ, గుర్తుంచుకోతగ్గ సంభాషణలు కానీ లేవిప్పుడు. రాధ పాత్రధారిణి, ఆమెను నిస్వార్ధంగా ప్రేమిచిన ప్రియుడి పాత్రలో శ్రీరాజ్- ల నటన ఈ సీరియల్ కి హైలైట్.  ఇతర నటీనటులు కూడా ప్రశంసనీయంగా నటిస్తున్నారు. “బీస్ సాల్ బాద్” చిత్రంలో “కహి దీప్ చలే కహి దిల్” పాటని గుర్తు చేసే టైటిల్ సాంగ్ “నిన్న ఎదురు చూసా” బాగుంది.
ప్రస్తుతం సోమ-శని వారాల్లో రాత్రి 8-8.30 మధ్య వచ్చే “చంద్రముఖి” సీరియల్- కథని పట్టించుకోకపోతే ఏ రోజుకారోజు ఆసక్తికరం అనిపించేలా కొన’సాగుతోంది’. పాత్రధారులకి జిం అవసరం తప్పించే పరుగో పరుగు ఛేజ్ సీన్సు, స్పాన్సర్సుది గల్ఫ్ దేశమా అని అనుమానించేలా పెట్రోలు వాహనాల ఛేజింగులు- రోజుకి పది నిముషాలైనా కనిపిస్తూ- ప్రేక్షకులు సీరియల్ని ఆడుతూ పాడుతూ అటూ ఇటూ తిరుగుతూ కబుర్లాడుతూ చూసేందుకు వీలు కల్పిస్తున్నాయి.
ప్రస్తుతం సోమ-శుక్ర వారాల్లో రాత్రి 8.30-9 మధ్య వచ్చే “అక్షర” సీరియల్- ఆరంభానికి ముందొచ్చిన ప్రచారంలో నూతనత్వం ఎందరికో అనుసరించతగ్గది. దర్షకుడు- రాధ-మధు ఫేం గోపి కసిరెడ్డి కావడం ఈ సీరియల్‌కి అదనపు ఆకర్షణ.  టైటిల్సు, టైటిల్ సాంగ్ వినూత్నంగా ఉన్నాయి. టైటిల్స్ చివర అక్షరని చూపిన విధం బాపు, విశ్వనాధ్ లని మరిపిస్తుంది. ఐతే దర్షకత్వపు ప్రతిభకి దీటొచ్చే కథ లేకపోవడం, పేలవమైన సంభాషణలు ఆరంభంలోనే ప్రేక్షకుల్ని నిరాశకి గురి చేస్తాయి.  ప్రేమ, అవినీతి, నిజాయితీ, దర్పం, స్వయంకృషి, దుర్మార్గం వగైరా రొటీన్ కథాంశాల్ని రొటీన్ డైలాగ్సుతో అర్థవంతం చేయడం ఏ దర్శకుడికైనా దుస్సాహసమని ఋజువు చేసే సీరియల్ ఇది. ప్రతిభావంతులైన శివన్నారాయణ-వాసుల జంటకి న్యాయం చేకూర్చే సన్నివేశాలు లేకనేమో- ఇటీవల ఆ పాత్రలు అంతగా కనపడ్డం లేదు. రాధ-మధు లో అద్భుతమనిపించిన శివపార్వతి నటన ఈ సీరియల్లో ఇంతవరకూ అసంతృప్తికరం. విలన్‌గా హరి కంటిచూపుకంటే కనుగుడ్లమీద ఎక్కువ ఆధారపడ్డం బాగోలెదు. మిగతా నటీనటులు చాలావరకూ ఫరవాలేదనిపించినా- ఎక్కువ సన్నివేశాల చిత్రీకరణ- కొన్నిచోట్ల పేలవం, కొన్నిచోట్ల అపరిపక్వం. ఐతే ఆధునికత, విలక్షణత కారణంగానో ఏమో- చూస్తున్నంతసేపూ విసుగు పుట్టదు. గోపి కసిరెడ్డి స్థాయి ఏ క్షణంలోనైనా చేరుకోవచ్చునన్న ఆశ- ప్రేక్షకుల సహనానికి కారణం కావచ్చు.
మరికొన్ని ఇతర ఛానెల్సూ, సీరియల్సూ గురించిన విశేషాలతో త్వరలో మళ్లీ కలుసుకుందాం.

Leave a Reply

%d bloggers like this: