నవంబర్ 17, 2009

మగధీర

Posted in వెండి తెర ముచ్చట్లు at 3:49 సా. by వసుంధర

చారిత్రాత్మక విశేషాల్ని కళ్లకి కట్టించడానికో, రచయితల ఊహకి దీటైన రూపకల్పన చేయడానికో- చలనచిత్ర నిర్మాతలు భారీ వ్యయంతో చిత్రనిర్మాణానికి పూనుకోవడం హాలీవుడ్ పద్ధతి. అలనాటి టెన్ కమాండ్‌మెంట్ఫ్స్, బెన్‌హర్- ఈ మధ్యకాలపు టైటానిక్, గ్లాడియేటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వగైరాలు అలాంటివే. అలాంటి చిత్రాలు మనకి అరుదు. మనం ఎక్కువగా పాశ్చాత్య చిత్రాలలో కొన్ని దృశ్యాలను సంగ్రహించి కేవలం జనరంజనే ప్రధానోద్దేశ్యంగా చిత్రనిర్మాణం చేస్తూంటాము. కథకి ప్రాధాన్యమున్నప్పుడు (ఉదా: షోలే) అటువంటి చిత్రాలు అర్థవంతమనిపించుకుంటాయి. కథతో నిమిత్తం లేకుండా భారీ వ్యయానికి ప్రాధాన్యమిచ్చిన ఇటీవలి దేవదాసు (హిందీ) నిర్మాతలకి కాసులార్జించినా- విమర్శకుల చేత ఆర్థరహితమైన చిత్రమనిపించుకుంది. ఈ నేపధ్యంలో ఇటీవల తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం “మగధీర” ని పరిశీలిద్దాం.
ఉద్దేశ్యం: కథ చారిత్రాత్మకం కాదు. తెలుగునాట బహుళ ప్రచారం పొందినది కాదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాం చరణ్ తేజని మరో మెగా స్టార్‌గా రూపొందించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో భారీ వ్యయానికి సిద్ధపడ్డ చిత్రమిది. ఇది గర్వపడాల్సిన విషయమో కాదో కానీ అపూర్వమే!
కథ: కాలభైరవ ఉదయఘర్ రాజ్యంలో- రాజు, ప్రజల అభిమానం చూరగొన్న అసమాన వీరుడు. రాజ సైనికుల  శిక్షణ, రాజకుమారి మిత్రవిందకు అంగరక్షణ అతడి విధులు. మిత్రవింద కాలభైరవని ప్రేమించింది. రాజు మేనల్లుడు బిల్లా మిత్రవిందను పెళ్లి చేసుకుని ఉదయఘర్‌కి ఏలిక కావాలని కలలు కంటున్న బిల్లా- షేర్ ఖాన్ అనే శత్రురాజుతో చేతులు కలిపాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో కాలభైరవ రాజ్యాన్ని రక్షించడంకోసం ప్రాణత్యాగం చేసాడు. మిత్రవింద కూడా చనిపోతుంది. ఆ తర్వాత 400 ఏళ్లకి- కాలభైరవ, మిత్రవింద, బిల్లా, షేర్ ఖాన్ పునర్జన్మించారు. పాత తప్పులు దిద్దుకోవడం, పగలు తీరడం, ప్రేమ ఫలించడం- మిగతా కథ. హీరో చుట్టూ తిరగడం తప్ప కథలో కొత్తదనం కానీ ప్రత్యేకంగా చెప్పుకోతగ్గ అంశాలు కానీ లేవు.
కథనం: 2009లో మొదలై 400 ఏళ్లు వెనక్కి వెళ్లి మళ్లీ 2009లోకి వచ్చిన ఈ కథని ఎక్కడా గజిబిజి లేకుండా కొనసాగించిన కథనం మెచ్చుకోతగ్గది. మొదట్నించి చివరిదాకా ఎప్పటికప్పుడు సన్నివేశాలు ఊహకందేలాగే ఉన్నప్పటికీ- ఎక్కడా విసుగు పుట్టనివ్వని, ఆసక్తి తగ్గనివ్వని కథనం అద్భుతం.
దర్శకత్వం: డాన్సులు, ఫైట్సు, బైక్ రేసులు, గుర్రపు స్వారీలు- మునుపెన్నడూ ఎరుగనంత గొప్పగా చిత్రీకరించడం ఈ చిత్రానికి ప్రత్యేకం. భారీ వ్యయాన్నీ, ఇతర సాంకేతిక నిపుణుల్నీ- ఇంత గొప్పగా, సమర్ధవంతంగా తెరకి అన్వయించిన దర్శకుడికి హేట్సాఫ్. అందువల్ల ఈ చిత్రం గొప్పతనం దర్శకత్వానికే పరిమితం అనక తప్పదు. ఇంత సమర్ధతనీ, దక్షతనీ- కేవలం ఒక హీరోని ప్రొజెక్ట్ చేయడానికి కాక- రాయల వైభవం, రాణి రుద్రమ ప్రతాపం వంటి ఆర్థవంతమైన ప్రోజెక్ట్స్‌కి ఉపయోగిస్తే- ఈ దర్శకుడు హిట్స్ మాత్రమే కాక  అంతర్జాతీయ స్థాయి కథాచిత్రాలు తీయగలడు. గ్లాడియేటర్ తరహా చరిత్రాత్మక సన్నివేశాలని అనుకరించినప్పుడు అంత బలమైన కథ కూడా ఉంటేనే సన్నివేశం చిత్రం పాతబడినా గుర్తుండిపోతుంది. ఆ మేరకి ఈ చిత్రంలోని పెక్కు అద్భుతాలు క్షణికాలే కాగలవు. ఈ విషయంలో శ్రద్ధ వహించకపొతే- ఇతర ప్రముఖ దర్శకుల లాగే- దర్శకుడు రాజమౌళికీ ఫ్లాప్స్ శకం మొదల్య్యే అవకాశముంది.
హీరో: రాం చరణ్ తేజ చూడ్డానికి బాగున్నాదు. ఫైట్సు, డాన్సులు, గుర్రపు స్వారీ- వగైరాల్లో శిక్షణకోసం అతడెంతో శ్రమించినట్లు వినికిడి. ఆ శ్రమ సత్ఫలితం ఈ చిత్రంలో సుస్పష్టం. అదే కృషి భాషోచ్ఛారణ విషయంలో కూడా తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది. తెలుగు నటుడికి తెలుగు భాషపై పట్టు అవసరం. నటనలో కూడా పరిణతి కనిపించకపోవడంవల్ల- ఇది రాజమౌళి చిత్రమే తప్ప రాం చరణ్ చిత్రమనిపించదు. చిత్రం ఆదిలోనే తండ్రి చిరంజీవితో పోలిక పెట్టినప్పుడు- నాట్యంలో కొడుకు వేగం కాస్త తక్కువేననిపించింది. ఏ పోలికా లేకపోతే- ‘బంగారు కోడిపెట్టా పాటకి అతడి స్టెప్సు సింప్లీ సుపర్బ్. 
హీరోయిన్: ఈ చిత్రానికి కాజల్ పెద్ద ప్లస్ పాయింటు. అందం, ఆకర్షణ, నటన అన్నీ గొప్పగా అనిపించిన- ఈమె స్వంతంగా డైలాగ్సు చెప్పుకోవడం అవసరమనిపించింది.
ఇతర నటీనటులు: బంగారు కోడిపెట్ట- డాన్సులో డిస్కో శాంతిని మరిపించేసింది ముమైత్ ఖాన్. అర్థం లేని పాత్రల్లో అద్భుతంగా రాణించారు శ్రీహరి, రావు రమేష్. శరత్‌బాబు, సూర్య పేలవమనిపించారు. హాస్యం చప్పగా ఉంది. హాస్యనటులు బ్రహ్మానందం, సునీల్, హేమ- ఈ చిత్రంలో గాప్ ఫిల్లింగ్‌కి మాత్రం అక్కరకొచ్చారు. 
సంగీతం: గొప్పగా ఉంది. పాటల గొప్పతనానికి  గీత రచయితలు, స్వరకర్త కీరవాణి సమంగా కృషి చేసారు. పంచదార చిలకమ్మ- పాటకి ముందొచ్చే సంగీతం- ‘ఆప్ జైసా కోయీ’ (గతంలో ఫిరోజ్ ఖాన్ తీసిన ఖుర్బానీ చిత్రంలోది) పాటని గుర్తు చేసినా కాపీ అనిపించదు. ఆ సంగీతం సినిమా ఐపోయేక కూడా ప్రేక్షకుల్ని వెంటాడుతూనే ఉంటుంది.
ప్రేక్షకులు: ఈ చిత్రం జూలై 31ని విడుదలై తెలుగునాట అఖండ విజయం సాధించింది. ఈ రోజుతో 110 రోజులు పూర్తి చేసుకుని ఇంకా జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఈ సినిమా చూసేక నటుడు చిరంజీవి అభిమానులందరూ- సినిమా విజయం కంటే కూడా అతడి వారసత్వం నిలబడినందుకు ఎక్కువ సంతోషిస్తారు. ప్రేక్షకులకు టికెట్ డబ్బుకంటే ఎక్కువ తృప్తినీ, వినోదాన్నీ ఇచ్చే ఈ సినిమా- తెలుగు సినిమా అభిమానులని మాత్రం- మనం సినిమాలు తీసేదెందుకు- అన్న ప్రశ్నని స్ఫురింపజేసి  కొంత మనోవ్యధకి గురి చేస్తుంది.

5 వ్యాఖ్యలు »

 1. sushmallik said,

  “ప్రేక్షకులకు టికెట్ డబ్బుకంటే ఎక్కువ తృప్తినీ, వినోదాన్నీ ఇచ్చే ఈ సినిమా- తెలుగు సినిమా అభిమానులని మాత్రం- మనం సినిమాలు తీసేదెందుకు- అన్న ప్రశ్నని స్ఫురింపజేసి కొంత మనోవ్యధకి గురి చేస్తుంది.”

  vasundhara gaaru mimmalni entha manovyadhaku gurichisindi aevidangaano telusukovachaaa….

 2. అజ్ఞాత said,

  తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం “మగధీర” ని పరిశీలిద్దాం.
  అని అన్నారు కాని నిజంగా మీరు పరిశీలించలేదు అని అనుకుంటున్నాను .
  కీడు ఎంచి మంచి ఎంచు అన్నది మన సామెత .కాని మగధీర లోని తప్పులను కూడా వ్రాసి ఉంటె భాగుండేది.

  • ఏ నేపధ్యంలో మగధీర చిత్రాన్ని పరిశీలించనున్నదీ ఆరంభంలో చెప్పాం. మా పరిసీలనలో తప్పొప్పులు ఆ మేరకి పరిమితం. గ్రహించగలరు.


Leave a Reply

%d bloggers like this: