Site icon వసుంధర అక్షరజాలం

ఈటీవీ కార్యక్రమాలు

ఝుమ్మంది నాదం-2: సినిమా సంగీతానికి సంబంధించిన ఈ కార్యక్రమం రెండవ విడతలో బాలమురళీకృష్ణ వంటి అసమాన వాగ్గేయకారులను, బాలసుబ్రహ్మణ్యం వంటి విశిష్ట సినీగాయకులను పరిచయం చేయడం మెచ్చుకోతగ్గ విషయం. స్వరబద్ధమైన చక్కని గొంతుతోపాటు, అందమైన ముఖానికి చెరగని చిరునవ్వుని అద్దిన సునీత సమక్షం ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చింది. ఐతే యాంకరుకుండవలసిన సమయస్ఫూర్తి లోపించడం, సందర్భానుసారం కాని చిరునవ్వు, భావప్రకటనలో కృత్రిమత్వం, సృజనాత్మకత లేక మూసలో కొనసాగిన సంభాషణలు- వేరెవరైనా యాంకరు ఉంటే కార్యక్రమానికీ, అతిథులుగా విచ్చేసిన సినీ సంగీత ప్రముఖులకీ మరింత న్యాయం  చేకూరేదనిపించింది. ఈ సందర్భంగా సంగీత కార్యక్రమాలకి హిందీలో సోనూ నిగమ్, సచిన్- తెలుగులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రభృతులు పెట్టిన ఒరవడి గమనార్హం. చివరి అతిథి సునీత కావడంవల్ల యాంకరుగా వచ్చిన ఎస్పీ శైలజ- కార్యక్రమాన్ని సహజంగా రక్తి కట్టించిన తీరు హృద్యంగా ఉంది. ఏది ఏమైనా ఈ కార్యక్రమం రూపొందించిన సునీత, ప్రసారం చేసిన ఈటీవీ అభినందనీయులు.
పాడుతా తీయగా: గతంలో ఈటీవీ ద్వారా ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమానికి కొనసాగింపుగా నవంబరు 23 నుంచి ఝుమ్మందినాదం స్థానంలో ప్రారంభమైన పాడుతా తీయగా కార్యక్రమం కేవలం యంకరింగుకోసం కూడా చూడొచ్చు. ఈ కార్యక్రమం నిర్వహించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బహుముఇఖ ప్రజ్ఞల్లో యాంకరింగూ ఒకటి.

Exit mobile version