జనవరి 6, 2010

కథ-నవల

Posted in సాహితీవైద్యం at 7:30 సా. by kailash

సాహితీ వ్యవసాయంలో నవల అనే మహావృక్షానికి- విత్తనం కథ. రైతు- పండిన పంటలో ఎక్కువ భాగాన్ని ఆహారపు దినుసుగా ఉపయోగించి తక్కువ భాగాన్ని విత్తనాలుగా వాడినట్లే- రచయితలు ఇతివృత్తాల్ని ఎక్కువగా కథలుగానూ, తక్కువగా  నవలలుగానూ మలచుకోవడం జరుగుతుంది.
కథ వ్రాసినా, నవల వ్రాసినా- రచయితకి తన రచనలోని పాత్రల, సన్నివేశాల నేపధ్యంపట్ల సమగ్రమైన అవగాహన అవసరం. అప్పుడా రచన- కథా, నవలా అన్న విచక్షణకి- అనుభవం తోడ్పడుతుంది. ఐనా ఒకోసారి తలలు పండినవారు కూడా తప్పటడుగు వేయడం కద్దు. అలాంటి సందర్భం
మాకెలా వచ్చిందో చెప్పేముందు మన సినీ దర్శకుల ప్రస్తావన కొంత అవసరం.
మా అభిప్రాయంలో సినీ దర్శకుడంటే- చిన్న కథను విని- దాన్ని చలనచిత్ర కావ్యంగా సందర్శించగల సృజనాత్మకత ఉన్నవాడు. మా అనుభవంలో మన సినీ దర్శకుల్లో ఎక్కువమంది- రచయిత సినీ సన్నివేశపరంగా చెబితే తప్ప కథని ఆస్వాదించలేనివారే! అందుకే మనకి కథా రచయితలు, సినీ కథా రచయితలు వేరుగా ఉండడం- వేలాది మంచి కథలు పుట్టుకొస్తున్నా- తగిన కథ దొరకడం లేదని సినీ దర్శకులు వాపోతూండడం- సినీ నట-దర్శక-నిర్మాతలే సినీ కథా రచయితలుగా భాసిల్లుతూ- హిట్ సినిమాలనే తప్ప మంచి కథాచిత్రాలనందించలేకపోవడం మామూలైంది. 
కథలోని బలమైన అంశాన్ని కొందరు ప్రముఖ దర్శకులకి క్లుప్తంగా వినిపించి- వారు పెదవి విరిస్తే ఆశ్చర్యపడి- ఆ కథని నవలగా మలచాక- కొందరు సినీ నిర్మాతలు తమకి తాముగా అడిగి తీసుకోవడం మాకు స్వానుభవం.
ఊహలోని సన్నివేశాలని కుదించి సూటిగా క్లుప్తంగా చెప్పే ప్రక్రియకి అలవటు పడ్డ మేము- బహు పాత్రలున్న ఓ కథాంశాన్ని- “ఎవరి జీవితం వారిది” అనే కథగా వ్రాసి ఓ ప్రముఖ పత్రిక నిర్వహించిన కథల పోటీకి పంపితే- అది సాధారణ ప్రచురణకి కూడా నోచుకోకుండా వెనక్కి వచ్చింది. సన్నివేశాలపట్ల పూర్తి అవగాహన ఉండడంవల్ల మాకా కథలో ఏ లోపమూ కనిపించకపోయినా- పత్రిక నిర్ణయంపట్ల గౌరవముండడంవల్ల కథని తిరగ వ్రాయాలని సంకల్పించాం. ఆ ప్రయత్నంలో మా తప్పటడుగు అర్థమైంది. అది కథ కాదు, నవల. “కట్టె, కొట్టె, తెచ్చె” లో రామాయణ సారాంశం ఉండొచ్చు కానీ- రామాయణ సౌందర్యం ఇమడదు. అలా ఆ కథనుంచి “శ్రీరాముని దయచేతను” నవల ఉద్భవించింది. అది మాకు ఎంత తృప్తినిచ్చిందంటే- ఒకరిద్దరు ప్రచురణకి నిరాకరించినా- మరి మార్పులు, చేర్పులకి కూడా ప్రయత్నించలేదు. ఆ నవల రచన మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి పలువురి ప్రశంసలందుకుంది. వాహినీ పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపం ధరించి ఎన్టీ రామారావు ట్రస్టు వారి పురస్కారం పొందింది.  ఈ నవల “కథ వెనుక కథ” డిసెంబరు (2009) చతుర మాసపత్రిక ప్రచురించింది. చిన్న ఇతివృత్తమ్నుంచి పెద్ద నవల ఎలా పుడుతుందో తెలుసుకోగోరే వారి సౌకర్యార్థం- ఇక్కడ ఆ కథకూ (ఎవరి జీవితం వారిది), కథ వెనుక కథ కూ లింకులు ఇస్తున్నాం. 
kathavenuka
evari jeevitam varidi

1 వ్యాఖ్య »

 1. ramaraju M said,

  మీ ఇద్దరికీ అభినందనలు!
  చక్కటి పోస్టుకి మళ్ళీ అభినందనలు 🙂

  ఒక్క విషయం స్ప్షష్టంగా అర్ధం కాలేదు…
  చతురలో వచ్చిన “కధ వెనుక కధ ” నవల, “శ్రీ రాముని దయ చేతను” నవల ఒకటేనా?
  ఆ పాయింటు సరిగ్గా అర్ధం కాలేదు.

  స్వాతి వార పత్రికలో, సరసమైన కధల పోటీ పడింది.
  ఆఖరి తేదీ Feb 20 2010 దయచేసి పాటకులకి ఈ వివరాలు తెలియచేయండి


Leave a Reply

%d bloggers like this: