జనవరి 22, 2010

జీవనమే సాహసం

Posted in సాంఘికం-రాజకీయాలు at 4:23 ఉద. by వసుంధర

అతడిది ముంబై. పేరు ప్రకాష్ కరేకర్. 1977లో అనగా తన 18వ ఏట మొదటిసారి పదవ తరగతి పరీక్ష వ్రాసి అన్ని సబ్జక్ట్సులోనూ ఫెయిలయ్యాడు. ఐనా పట్టు వదలని విక్రమార్కుడిలా అదే పనిగా ప్రయత్నిస్తూ ముందు మరాఠీలో ప్యాసై, క్రమంగా హిందీ, ఇంగ్లీషు, సైన్సు సబ్జక్ట్సులోనూ ప్యాసయ్యాడు. అన్నింటికంటే  కష్టమనిపించిన లెక్కల్లో కూడా ప్యాసయ్యేసరికి 44 ప్రయత్నాలు పూర్తై 2003 సంవత్సరం వచ్చింది. తన ప్రయత్నం తాను చేస్తూ ఫలితానికి దేవుడిమీద భారమేసిన అతడెప్పుడూ నిరుత్సాహానికి గురి కాలేదు. 9వ తరగతి మార్కులతో సంపాదించుకున్న ప్యూను ఉద్యోగంలో 29 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రకాష్‌కి ఈ సత్ఫలితంవల్ల క్లర్కు ఉద్యోగానికి ప్రమోషన్ రావచ్చు.
అసహనంతో పరీక్షలు, ఉద్యోగాలు, ఉద్యమాలు వగైరాల పేరు చెప్పి మొదటి అపజయానికే కృంగిపోయి ఆత్మహత్యలకి పాల్పడేవారికి ప్రకాష్ సహనం ఒక గొప్ప సందేశం. మనిషికి అన్నింటికన్నా విలువైనది ప్రాణం. జీవితం జీవించడానికి. ప్రాణాలు తీసుకుందుకు కాదు. తాత్కాలికావేశంలో ప్రాణాలు తీసుకునేవారు అమాయకులు, దురదృష్టవంతులు. వారి చావును గొప్పదిగా అభివర్ణించడంవల్ల మరికొందరు అమాయకులు చావుకి ప్రేరణ పొందడం జరుగుతుంది. తర్వాత అనుకున్నది సాధించబడినా పోయిన ప్రాణాలు తిరిగి రావు.
ఎంత గొప్ప ఆశయానికైనా ఆత్మహత్య సరికాదని- మన మహాత్ముడు- ఆమరణ నిరాహారదీక్షను ప్రతిపాదించాడు. అది ఆలోచనకూ, ప్రాణరక్షణకూ అవకాశమున్న ఆత్మహత్యా ప్రక్రియ. ఆత్మహత్యకుకంటే ఎక్కువ ధైర్యం అవసరమైన గొప్ప ప్రక్రియ. ఆత్మహత్యని సాహసమనుకునేవారికి- “courage, which we consider to be a great virtue, is just another hormonal dysfunction” (Times of India jan 21 p12) అన్న ప్రసేన్‌జిత్ చౌదరి వ్యాఖ్య వర్తిస్తుంది.
ఆశయంలో బలముంటే ఆలస్యమైనా సాధన తథ్యం. ప్రాణత్యాగానికి మించిన సహనం అవసరం. లభించిన జీవితాన్ని ఆయువు తీరేదాకా కొనసాగించడమే అసలు సిసలు ధైర్యవంతుల లక్షణం.
సాహసమే జీవితం కాదు, జీవనమే సాహసమన్న గొప్ప సందేశాన్నిచ్చిన ప్రకాష్ కరేకర్‌కి అక్షరజాలం జోహార్లు.

Leave a Reply

%d bloggers like this: