జనవరి 26, 2010

పాడుతా తీయగా (ఈ టీవీ)

Posted in టీవీ సీరియల్స్ at 5:31 ఉద. by వసుంధర

ఈ కార్యక్రమం ప్రతి సోమవారం రాత్రి 9.30కి వస్తోంది. 10.30కి ఐపోవాలని నిర్దేశించినా సాధారణంగా మరో 15-20 నిముషాలు అదనంగా కొనసాగుతుంది. ఇంతసేపా అని కాకుండా- అప్పుడే ఐపోయిందా అనిపించేలా దీన్ని నడిపిస్తున్నారు- ఈ తరహా కార్యక్రమాల నిర్వహణలో మహోన్నత శిఖరం చేరుకున్న పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
ప్రసుతానికింకా అంధ్రప్రదేశ్ అనిపించుకుంటున్న రాష్ట్రంలో 23 జిల్లాలనుంచి- జిల్లాకి ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన గాయకులు పోటీ పడుతున్న ఈ కార్యక్రమం ప్రారంభానికి ఒక ప్రత్యేకత ఉంది. అది గతంలో పాడుతా తీయగా ద్వారా వెలుగులోకి వచ్చిన సంగీత తారల పరిచయం. ప్రారంభ కార్యక్రమం అనంతరం జిల్లాకి ఒక్కరు చొప్పున 23గురు మిగిలారు. ఆ తర్వాత ఇప్పటికి ఒకొక్కటి రెండు వారాల చొప్పున మూడు భాగాలు పూర్తయ్యాయి. వాటిని పరిశీలిస్తే-
మొదటి భాగం: దీనికి కళాతపస్వి కె. విశ్వనాధ్ ముఖ్య అతిథి. వారి సినిమాల్లోని పాటలనే పోటీకి ఎంచుకోవడం ముదావహం. పోటీ అనంతరం ఒకరిని మాత్రం తప్పించగా 22మంది మిగిలారు. ఆయా పాటలకు సంబంధించిన ఎన్నో కుతూహల విశేషాలతో వీక్షకులను రంజింపజేసారు.
రెండవ భాగం: 20వ శతాబ్దంలో చివరి రెండు దశాబ్దాలనూ నిరవధికంగా ఏలిన మహా సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల్ని పోటీకి నిర్దేశించడం అభినందనీయం. ముఖ్య అతిథిగా ఆయన సోదరుడు గంగై అమరన్‌ని పిలవడం సబబే కానీ ఆయనకు తెలుగు రాకపోవడంవల్ల కొంత రసాభాస అనిపించింది. ఆయన అరవంలో మాట్లాడుతుంటే ఎస్పీబీ తెలుగులో అనువదించి చెప్పడం- వారానికి గంట చొప్పున రెండు వారాలు చూస్తున్నప్పుడు- తమిళ్ ఛానెల్ కామోసనిపించిన సందర్భాలున్నాయి.  ఐతే గంగై అమరన్ ద్వారా బయటపడ్డ ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు, ఆయన వ్యవహరించిన తీరు- ఆయనకు ఎందరో అభిమానుల్ని సంపాదించి పెడతాయి. పోటీ అనంతరం ఒక్క అభ్యర్ధి మాత్రం తప్పించబడి 21 మంది మిగిలారు.
మూడవ భాగం: ఇందులో పాటలన్నీ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ చిత్రాలలోనివి. తెలుగు వెలుగై విరజిల్లుతున్న ప్రముఖ సంగీత దర్శకుదు కీరవాణితో పాటు- ఎన్టీఆర్ వీరాభిమాని, ప్రముఖ నిర్మాత వైవియెస్ చౌదరి కూడా ముఖ్య అతిథి. మళ్లీ ఎన్నో కుతూహల విశేషాలు వీక్షకులని రంజింపజేసాయి. పోటీ అనంతరం 20 మంది మిగిలారు.
మెచ్చుకోతగ్గ విశేషం: ఔత్సాహిక గాయకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే సూచనలు- ప్రముఖ సంగీత దర్శకుల ద్వారా అందడం.
సూచన: కార్యక్రమం పొడుగునా ఎస్పీబీ గొంతు వినబడుతూనే ఉంటుంది కాబట్టి- ఆరంభంలోని పరిచయగీతం ఆయన ఎంపిక చేసిన ఇతర గాయకులచేత పాడిస్తే బాగుంటుంది. అందుకు ఇబ్బంది ఉంటే- ఆయనే శ్రోతలకంతగా పరిచయం లేని లలిత గీతాలను ఎంపిక చేసుకుని పాడితే బాగుంటుంది.
అసంతృప్తి: జిల్లాకి ఒకరు చొప్పున ఎన్నికైన గాయనీ గాయకులెవరూ ఇంతవరకూ- సాధారణ శ్రోతలకు ఆహా ఓహో అనిపించేటంత గొప్పగా వినిపించలేదు. సంగీతపరంగా ఆ మేరకు భవిష్యత్తుపై నిరాశ కూడా కలగొచ్చు. గతంలో కార్యక్రమాల్లో ఇలా అనిపించలేదు కాబట్టి- ఈసారి ఎంపిక హడావుడిగా జరిగిందా, లేదా ప్రతిభావంతులు ఇటువంటి పోటీలకు దూరంగా ఉంటున్నారా అన్న అనుమానం వస్తుంది. ఐతే- ఈ గాయకులే మున్ముందు విజృంభిస్తారేమో వేచి చూద్దాం.
ఆశావాదం: ఈ రోజే ఈ కార్యక్రమం 4వ్ భాగం మొదలు కనుంది. నిర్వాహకులతోపాటు గాయకులూ ఆసక్తి కలిగించడం ఈ రోజునుంచే ప్రారంభం కాగలదని ఆశిద్దాం.

3 వ్యాఖ్యలు »

  1. zulu said,

    The way he finds the mistakes of any song is amazing. 🙂 But he is very encouraging the participants unlike the other programs.
    Really an amazing job by SPB. Salutes sir.

  2. subhadra said,

    మీరు రాసిన విషయాలన్నీ నిజమే. కార్యక్రమాన్ని ఆద్యంతమూ ఆసక్తి తగ్గకుండా నిర్వహించడంలో బాలూ గారిని మించినవారు లేరు. గాయనీ గాయకుల ఎంపికలో నాకూ కొంత నిరాశే ఎదురయింది, మునుముందు ఎలా ఉంటుందో మరి??? బాలూ గారు చెప్పే విశేషాలూ, ప్రముఖులనందరినీ పేరుపేరునా ఆయన తలచుకునే తీరూ, ఎప్పటెప్పటివో పాటలు ఆయన పాడే తీరూ మాత్రం నాకు చాలా చాలా ఇష్టం.

    • 2-3 వారాలక్రితం కాబోలు- ఈ కార్యక్రమంలో ఓ సందర్భంలో బాలు గారు ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మహమ్మద్ పాడే తీరును వినిపించారు. సింప్లీ సుపర్బ్ & హేట్సాఫ్!


Leave a Reply

%d bloggers like this: