జనవరి 27, 2010

అయ్యో తెలుగు సినిమా…

Posted in బుల్లితెర-వెండితెర, వెండి తెర ముచ్చట్లు at 2:36 ఉద. by వసుంధర

సినిమాలు ప్రబోధానికి కాదు- వినోదానికి. వినోదం ప్రజాసేవ కాదు- వ్యాపారం. ఈ నిజాల్ని గ్రహించి వంటబట్టించుకున్న వారిలో అగ్రగణ్యులు మన తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు.
వారికి కళ అంటే హింస, ఆడదాని వంటిసొంపులు. సాహిత్యమంటే బూతు. భాషంటే పామరులు మాత్రమే మాట్లాడేది. సంగీతమంటే రణగొణ ధ్వని. నటులంటే సినీప్రముఖుల ముద్దుబిడ్డలు. హీరోయిన్లంటే మోడల్సు. గొప్ప చిత్రమంటే కోట్లకొద్దీ పెట్టుబడి. ఘనవిజయమంటే జనమున్నా లేకపోయినా వందలకొద్దీ రోజులు నడిపించడం. విమర్శ అంటే కేవలం పొగడ్డం. 
ఈ నేపధ్యంలో వచ్చే తెలుగు సినిమాల స్థాయి ఊహించడం కష్టం కాదు. గత సంవత్సరం విడుదలైన నూటపాతిక సినిమాల్లో హిట్ అనిపించుకున్నవి: పెద్ద బడ్జెట్‌వి- అరుంధతి, కిక్, మగధీర. చిన్న బడ్జెట్‌వి- ప్రయాణం, రైడ్, అష్టా చెమ్మా. ఈ హిట్ చిత్రాల స్థాయి ఎలాంటిదంటే- ఒక్కటీ జాతీయ అవార్డుకి అర్హం కాలేదు. 
మన జాతీయ అవార్డులు గొప్పతనానికి గీటురాయి అన్న దురభిప్రాయం మాకు లేదు కానీ- భాషాభిమానం అన్యాయం జరిగిందని ఆక్రోశించమన్నా నిజాయితీ మనస్కరించనివ్వదు. ఐతే దర్శకుడు నరసింహ నంది తీసిన “1940లో ఒక గ్రామం” తెలుగు చిత్రానికి ప్రాంతీయ బహుమతి రావడం కొంతలో కొంత ఊరట. అందుకు ఆయన్ను అభినందిద్దామంటే- పాపం ఇంతవరకూ ఆ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకొచ్చిన డిస్ట్రిబ్యూటర్లు లేరట. అర్థవంతమైన తెలుగు చిత్రాలకి ఆదరణ లేదని వాపోయే ఆయనమీద జాలి పడదామా అంటే- ఆయన తీయబోయే తదుపరి చిత్రం వ్యాపారాత్మకమట. దానికి ప్రేరణ “మలేనా” అనే ఇటాలియన్ చిత్రమనీ- దానికి బంగారం పండించే సత్తా ఉన్నదనీ ఆయన అన్నారు. అంటే ఆయనకు బంగారం పండించే సినీ కథలు తెలుగు సాహిత్యంలో లభిస్తాయని తోచలేదు. దీన్నిబట్టి తెలుస్తున్నదేమిటంటే- తెలుగు సినిమా లోకానికి తెలుగు సాహిత్యంతో పరిచయం తక్కువ. విదేశీ వంటకాల్ని స్వదేశీ పోపుతో ప్రేక్షకులకు వడ్డించడమే దర్శకత్వపు ప్రతిభ అనుకుంటూ- అర్థవంతమైన స్వభాషా సాహిత్యాన్ని విస్మరించేవారికి- “అర్థవంతమైన” చిత్రాలకు ఆదరణ లేదని వాపోయే అర్హత ఉన్నదా?
వాపోవాల్సింది- తెలుగు కథ, తెలుగుతనం.

4 వ్యాఖ్యలు »

  1. అగ్రశ్రేణి దర్శకులు ఉత్తమ అభిరుచితో ముందుకు వచ్చి మంచి చిత్రాలు తీస్తే ప్రేక్షలుకు ఎందుకు అభిమానించరు. ఒకటి, రెండు ఫ్లాప్ అయినంత మాత్రాన నిరాశపడనవసరం లేదు. ప్రేక్షకులని క్లాస్, మాస్ అని విడగొట్టి అడ్డమైన చిత్రాలు తీస్తున్నారు. స్వాతికిరణం, స్వాతిముత్యం వంటి చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులు చూశారు, ఆదరించారు. వీళ్ళ బుద్ది ఎలాంటిదంటే అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాలలో కూడా వెకిలి హాస్యం, శృంగారభరిత పాటలు లేకుండా తీయలేకపోయారు. కప్పకి బావే లోకమన్నట్టు వీళ్ళు గిరి గీసుకుని ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలే చూస్తారని తీర్మానించేసుకున్నంత కాలం ఉత్తమ చిత్రాలు రావడం కష్టం. ఉత్తమ చిత్రమంటే 100 రోజులు ఆడడం ప్రామాణికం కాదు ప్రేక్షక హృదయాలలో చెరగని ముద్ర వేయాలి మాయాబజార్ లాగా.


Leave a Reply

%d bloggers like this: