Site icon వసుంధర అక్షరజాలం

పద్మనాభం పరమపదం

తొలితరంలో స్వర్గీయ శివరావునుంచి నేటితరంలో బ్రహ్మానందం వరకూ- తెలుగువారిని వెండితెరపై అలరించిన ప్రముఖ హాస్యనటులందరికీ- నటనలో సమర్ధతతోపాటు సమగ్రత కూడా ఉండడం మన అదృష్టం. అందుకు శ్రీ బసవరాజు పద్మనాభం మినహాయింపు కాదు సరికదా- విశిష్టమైన ఉదాహరణగా నిలుస్తారు.
ఆయన జన్మస్థలం కడప జిల్లాలోని సింహాద్రిపురం. తెలుగువారికి ప్రీతిపాత్రమైన వినోదసాధనం సినిమా కాబట్టి- సినీ నటుడిగా 1950-2006 ల మధ్య సుమారు 500 చిత్రాల్లో ఓ వెలుగు వెలిగిన ఆయన నివాసస్థానం- అఖిలాంధ్రకోటి (తెలంగాణా ప్రాంతం వారితో సహా, తెలుగు మాట్లాడేవారందరూ  ఆంధ్రులే కాబట్టి ఈ పదం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అన్ని ప్రాంతాలవారికీ వర్తిస్తుంది) హృదయమందిరాల్లో.
ప్రేక్షకుడిగా నాకాయన తొలిచిత్రం పాతాళభైరవి. అందులో బాలకృష్ణ నాయకుడి అనుచరుడైతే, పద్మనాభం ప్రతినాయకుడి అనుచరుడు. అతి క్లిష్టమైన ఆ పాత్రలో హాస్యాన్నీ, దుర్మార్గాన్నీ ఆయన పోషించిన తీరు అనితరసాధ్యం.
ఆయన పొట్టివాడు కావడం- వెండితెరమీద రాణించడానికి అడ్డు కాకపోవడానికి బదులు పొట్టివాడైనా గట్టివాడన్న మెప్పుకి దారి తీసింది. ఆయన నటనా జీవితంలో ప్రదర్శించిన హాస్యం విలక్షణం, నవరసభరితం: పెళ్ళామంటే బెల్లమే ఐనా నాయనగారి మీసము చూస్తేనే సన్యాసము అనుకునే పిరికి భర్త (హాస్యం- ఇద్దరు మిత్రులు); హీరో కష్టసుఖాల్లో పాలు పంచుకునే మంచి మిత్రుడు (కారక్టర్ ఆక్టర్- లేత మనసులు); దుష్టుదు (భార్యాభర్తలు); మోసగాడు (చదువుకున్న అమ్మాయిలు); ప్రేమికుడు (కలవారి కోడలు, అసాధ్యుడు).
దాగుడుమూతలు చిత్రంలో తనకి మాత్రమే ప్రత్యేకమైన ముద్దు మాటల విశ్వరూపం ప్రదర్శించిన ఆయన, నారదుడివంటి పురాణప్రముఖుని పాత్రనీ తనకి తనే సాటి అనే రీతిలో పలు చిత్రాల్లో హుందాగా ప్రదర్శించడం విశేషం.  ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే!
రేఖా & మురళీ ఆర్ట్స్ పేరిట చిత్రనిర్మాణసంస్థని ప్రారంభించి దేవత చిత్రం ద్వారా సంచలనం సృష్టించారు.  అందులోని “ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి”, “బొమ్మను చేసి ప్రాణముపోసి” అన్న పాటలు ఆయన అభిరుచికి ప్రతీకలై ఇప్పటికీ పాటలపోటీల్లో ఔత్సాహిక గాయకుల ప్రతిభకు గీటురాళ్లుగా ఉపయోగపడుతున్నాయి. ఆ చిత్రంలో ఆయన స్వయంగా పాడిన “మా ఊరు మదరాసు నాపేరు రాందాసు” అన్న పాటను ఆయన గొంతు, పలుకు- మనోహరం చేసాయనిపిస్తుంది. తన చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న” ద్వారా ఆయన పరిచయం చేసిన ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మధురస్వరం- భారత చలనచిత్రసీమకు అపూర్వకానుక.
2001లో బాలసాహిత్యానికిగానూ మాకు కొలసాని-చక్రపాణి అవార్డు లభించినప్పుడు- అదే వేదికపై నటుడిగా ఆ అవార్డునందుకున్న పద్మనాభం మా పక్కనే ఉండడం విశేషం. ఆ వేదికమీద మా స్పందన అడిగినప్పుడు- మేము పద్మనాభ ప్రశస్తినే తప్ప మా గురించి ఏమీ చెప్పలేనంతగా ప్రభావితులమయ్యాం.
శ్రీ పద్మనాభం జన్మదినం 1931, ఆగస్టు 20. ఆయన ఫిబ్రవరి 20న భౌతిక దేహాన్ని చాలించారు. జాతస్య మరణం ధృవం అన్నది ఆర్యోక్తి. ఐతే ఇప్పటికీ ఎప్పటికీ తారగా ఆయన స్థానం మాత్రం సుస్థిరమన్నది కూడా ఆర్యోక్తియే!

Exit mobile version