ఫిబ్రవరి 23, 2010

ఈటీవీ సీరియల్ “అభిషేకం”

Posted in టీవీ సీరియల్స్, బుల్లితెర "కోతికొమ్మచ్చి", బుల్లితెర-వెండితెర, Uncategorized at 4:15 ఉద. by వసుంధర

నేపధ్యం
దారిఖర్చులు పెట్టుకుని, అవసరమైతే బ్లాకులోనైనా టికెట్లు కొనుక్కుని, పాప్‌కార్న్‌కీ, కూల్‌డ్రింక్సుకీ రెట్టింపు ధర ఇచ్చుకుని హాల్లో సినిమా చూసామనుకోండి. అక్కడ  తెలిసిన కథే మళ్లీ మళ్లీ. చూసిన దృశ్యాలే మళ్లీ మళ్లీ. విన్న మాటలే మళ్లీ మళ్లీ.  పాడిన పాటలే మళ్లీ మళ్లీ. 
ఆమాత్రం దానికి సినిమా ఎందుకూ- హాయిగా ఇంట్లో కూర్చుని ఇంటి వంటలు రుచి చూస్తూ టీవీ చూస్తే పోలా- అనుకునేవారి సంఖ్య పెరగడంవల్ల- డెయిలీ సీరియల్సు ప్రాచుర్యం పెరిగిందని ఓ థియరీ. ఆ నేపధ్యంలో కొన్ని టీవీ సీరియల్సుని విశ్లేషిస్తే:
అభిషేకం: అభిషేకం అన్న పదాన్ని హాస్యాస్పదం చేయడానికి మాత్రమేననిపించే టైటిల్ సాంగ్‌ని ప్రతిరోజూ భరించడం కష్టమనిపించే- ఈ సీరియల్  ప్రస్తుతానికి ఓ రెండు జంటల కథ. 
ఒక జంటలో కిరణ్ పరమ కిరాతకుడు. అతడి భార్య స్వాతి అష్టైశ్వర్యాలూ ఉన్న మహాసాధ్వి. ఆమె మంచితనం కిరణ్‌కి వరం. ఆమెకి శాపం. తను కిరణ్‌ని ఉపేక్షించడంవల్ల- తన కొడుకు ప్రాణాలకీ, తన కంపెనీల మనుగడకీ ప్రమాదమని తెలిసినా పట్టించుకోదు.
రెండో జంటలో వినయ్ అతి మంచి భర్త. అతడి భార్య రేఖ మహాస్వార్ధి, పరమ మూర్ఖురాలు. తప్పిపోయిన స్వాతి బిడ్డ కమల్ రేఖవద్ద పెరుగుతున్నాడు. కమల్ స్వాతి బిడ్డ అని రేఖకీ, స్వాతికీ కూడా తెలియదు. కమల్ స్వాతిని జాయింట్ మమ్మీ అంటూ దగ్గిరవడం రేఖకి నచ్చదు. ప్రస్తుతం కిరణ్ మనుషులు కమల్‌నీ, రేఖనీ వేటాడుతున్నారు.  
సీరియల్లో మిగతా పాత్రలన్నీ తెలిసో తెలియకో- మహాస్వార్ధికీ, పరమ కిరాతకుడికీ మాత్రమే సహకరిస్తూ- మహాసాధ్వినీ, అతి మంచివాణ్ణీ నానా ఇబ్బందులకూ గురిచేయడం ఇతివృత్తం.
సన్నివేశాలు అసందర్భంగా అనిపించినా, సంఘటనలు తర్కానికి అతీతమైనా, ఉన్నఫళంగా ఈ సీరియల్ ఆగిపోతే మిస్సయేదేమీ లేదనిపించినా కూడా ఏ రోజుకారోజు ఆసక్తికరంగా ఉండడం మెచ్చుకోతగ్గ విషయం.
ఈ కథలో తప్పిపోయిన తన ఏడాది బిడ్డ చనిపోయాడనుకుని స్పృహతప్పి నాలుగేళ్లు కోమాలో ఉండిపోతుంది స్వాతి. ఆమెకు స్పృహ వచ్చాక- ఆమె పనిమనిషి రత్తమ్మ ఒక సందర్భంలో- నాలుగేళ్లుగా నీ కొడుకు ప్రతి పుట్టిన రోజుకీ ఇలాగే దిగులుగా ఐపోతున్నావని వాపోతుంది. నాలుగేళ్లుగా ఆమె కోమాలో ఉన్న విషయం ఆ క్షణంలో సంభాషణల రచయిత, దర్శకుడు విస్మరించాలనుకోవాలి. లేదా ఈ సీరియల్‌ని ఇన్ని వందల ఎపిసోడ్సు తర్వాత కూడా ఇంకా ఇంత శ్రద్ధగా చూస్తారా అన్న ఉపేక్షాభావం కూడా ఉండి ఉండొచ్చు. కథపట్ల చిత్తశుద్ధి, కథనంపట్ల శ్రద్ధ ఉంటే వెయ్యి ఎపిసోడ్సు వచ్చినా పొరపాట్లు దొర్లకుండా చూసుకోవచ్చునని స్వాభిప్రాయం.  ఎందుకంటే “అభిషేకం” సత్తా ఉన్న కథ. సమర్పిస్తున్నవారికి నిబద్ధత అవసరం. 
ఇక నటీనటులు చాలా గొప్పగా నటిస్తున్నారు. ఏ రోజుకారోజు ఉత్కంఠభరితంగా నడుస్తోంది. అక్కడక్కడ సంభాషణలు కూడా గొప్పగా అనిపిస్తున్నాయి. ఖర్చు లేకుండా రొటీన్ సినిమా కంటే మెరుగైన అనుభూతినిస్తోంది.
ప్రతిభ ఉన్న నటులకీ, సాంకేతిక నిపుణులకీ- అవకాశం, ఉపాధి కల్పిస్తున్నందుకు ఈటీవీ, దాసరి అభినందనీయులు.

Leave a Reply

%d bloggers like this: