Site icon వసుంధర అక్షరజాలం

కీర్తిశిఖరంపై సచిన్

క్రికెట్ ఆటని ప్రేక్షకులకి మరింత రసవత్తరం చేసేందుకు 39 సంవత్సరాలక్రితం ఆవిర్భవించాయి వన్‌డే ఇంటర్నేషనల్స్. ఆదిలో అవి 60-60 ఓవర్లుండేవి. తర్వాత 55-55కి మారి చివరికి 50-50కి సద్దుకున్నాయి. 1983లో కపిల్‌దేవ్ సారధ్యంలో ప్రపంచకప్పు సాధించేదాకా- 5 రోజుల టెస్టులకే తప్ప ఈ తరహా ఆటకి మన దేశంలో ప్రాచుర్యం లభించలేదు. ఆ తర్వాతనుంచి మాత్రం భారతీయులకి వన్‌డే ఆట పిచ్చిగా మారింది. 1989లో సచిన్ రమేష్ తెండూల్కర్ రంగప్రవేశం చేసాక ఆ పిచ్చి సచిన్ పిచ్చిగా ముదిరింది. అతడు క్రీజులోకి రాగానే  ఉత్సాహం. అతడు ఔటవగానే నీరసం. అందులోనూ చాలాకాలం వరకూ మన జట్టు జయాపజయాలు పూర్తిగా సచిన్ మీదనే ఆధారపడి ఉండేవి.
సచిన్ రమేష్ తెండూల్కర్ గురించిన వివరాలు ఇంటర్నెట్లో  ఏ సెర్చింజన్లోనైనా లభిస్తాయి.  
5 రోజుల టెస్టుల్లో బాటింగ్ వరుసక్రమంలో సచిన్ నంబరు 4. అక్కడ సమయం సమస్య కాదు కాబట్టి 1990లోనే తొలి సెంచరీ సాధించి తన సత్తా చాటుకున్నాడు సచిన్. కానీ వన్‌డేలలోనూ అదే వరుసక్రమం పాటించడంవల్ల చాలా పర్యాయాలు అతడి ప్రతిభకు న్యాయం చేకూరలేదు. ఆ విషయం కాస్త ఆలస్యంగా గుర్తించి అతణ్ణి ఓపెనర్‌గా పంపాలన్న నిర్ణయం తీసుకునే సమయానికి 1992 ప్రపంచకప్పు వచ్చేసింది. సచిన్ తన తొలి వన్‌డే సెంచరీని సాధించడానికి (1994లో) సుమారు 80 మ్యాచిలు ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంతవరకూ అతడాడిన మొత్తం 442 మ్యాచిలలో సాధించిన 17594 పరుగుల్ల్లో 46 సెంచరీలున్నాయి. ప్రపంచంలో అతడి పరుగులకూ, సెంచరీలకూ దరిదాపుల్లో ఉన్నవారు కానరారు. ఐతే ఈ ఫిబ్రవరి 24న గ్వాలియర్లో జరిగిన 2962వ వన్‌డేలో ప్రపంచంలోనే అత్యుత్తమ బోలర్సున్న దక్షిణాఫ్రికామీద కేవలం 147 బంతుల్లో అతడు సాధించిన 200 పరుగులు- వన్‌డేలకే తొలి డబల్ సెంచరీ కావడం విశేషం. దానికి అతడు చేసిన 25 బౌండరీలు కూడా వండేలకు రికార్డు కావడం మరో విశేషం.         
సచిన్ ఎన్నిసార్లు ఎంత బాగా ఆడినా గట్టిగా 2-3 మ్యాచిల్లో సరిగ్గా ఆడకపోతే- విమర్శకులు విరుచుకు పడతారు. అది వారి తప్పు కాదు. అతడు మానవమాత్రుడని ఎవరికీ తోచదు. ఆ విషయం గ్రహించిన సచిన్ జట్టు నాయకత్వానికి స్వస్తి పలికాడు- ఆ ఒత్తిడి తన ఆటపై ప్రభావం చూపుతుందన్న భయంతో. కొత్తవారికి అవకాశమివ్వడానికి పాతవారు తప్పుకోవాలన్న తప్పుడు అభిప్రాయాన్న్ని- నోటిమాటతో కాక తన బాట్‌తో ఖండించడం అతడి పద్ధతి. ప్రతి మ్యాచీ కొత్తగా అవకాశమొచ్చినవాడికిలా అమిత శ్రద్ధ చూపే అతణ్ణి ఆదర్శంగా తీసుకుంటేనే కొత్తవారు జట్టులో తమ స్థానాన్ని సుస్థిరపర్చుకోగలరు. ఎవర్నీ నొప్పించని సాధుస్వభావానికీ, పెద్దమనిషి తరహాకీ పేరుపడ్డ ఆతడు స్వార్థపరుడనీ, తన రికార్డులకోసమే ఆడతాడనీ అపవాదు వేసేవారున్నారు. రికార్డు స్థ్హాయిలో అతడు సాధించే పరుగులు జట్టుకికాక మరెవరికి ఉపయోగపడతాయన్న ప్రశ్న వారికి స్ఫురించదేమో!    
చాలామంది క్రికెటర్లకి 35 సంవత్సరాల వయసులో ఆటనుంచి రిటైర్మెంటు తీసుకోవడం సాధారణం. 40 ఏళ్ళ వయసులో కూడా కొనసాగించినవారుంటే వారు ఆలస్యంగా రంగప్రవేశం చేసి ఉంటారు. 17వ ఏట రంగప్రవేశం చేసి 37వ ఏట కూదా ఆటగాడుగా కొనసాగుతూ ఇంకా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సచిన్ క్రికెట్లో ఒక అద్భుతం.  
సచిన్ మహారాష్ట్రీయుడన్న విషయం భారతీయులెవ్వరికీ స్ఫురించదు. ఆ స్పృహేలేని సచిన్ తాను భారతీయుణ్ణని మాత్రమే చెబుతాడు. సచిన్ అందుకున్న కీర్తిశిఖరాలకు అసలు కారణమదే! దేశాన్ని దేశంకోసం ప్రేమిస్తూ- కులం, మతం, భాష, ప్రాంతం వగైరాలకు అతీతంగా ఆలోచించి- కేవలం ప్రతిభను సానబెట్టడమే ధ్యేయంగా కృషి చేసేవారికి- అసలు సిసలు కీర్తి శిఖరాలు అందుబాటులో ఉండే అవకాశమున్నదన్నదే సచిన్ జీవితం మనకిచ్చే సందేశం. సచిన్‌కి అక్షరజాలం అభివందనాలు.

Exit mobile version