మార్చి 5, 2010

పత్రికల్లో పోటీలు- ఒక పరిశీలన

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 4:51 ఉద. by వసుంధర

వివిధ సంస్థలు, పత్రికలు నిర్వహించే చాలా పోటీల్లో ప్రథమ బహుమతికి అర్హమైన కథ రాలేదనడం గురించి అక్షరజాలం వ్యాఖ్యల్లో ప్రస్తావన వచ్చింది. ఈ విషయమై మా అనుభవాల్నీ, అభిప్రాయాల్నీ, అనుమానాల్నీ ఇక్కడ క్లుప్తంగా పొందుపర్చుతున్నాం.  
కొన్ని పోటీల్లో బహుమతికి ఎంపికైన రచనలు మాకు నచ్చలేదు. వాటిలో సాధారణ బహుంతికి కూడా నోచుకోని కొన్నింటిని మేము రచనలో “కథాపీఠం”కి అర్హమైనవిగా భావించి ప్రచురిస్తే- విమర్శకుల మన్ననలు పొందాయి. పోటీల్లో బహుమతులు పొందిన మా రచనలు కొన్నిటిని ఏ మాత్రం నచ్చలేదని అన్నవారు కూడా ఉన్నారు. దీన్నిబట్టి “లోకో భిన్న రుచి:” అన్న మాట సాహిత్యానికి మరింత ఎక్కువగా వర్తిస్తుందనిపిస్తుంది.
సాధారణంగా పోటీకి వచ్చిన రచనల్లో- బహుమతికి కొన్ని ప్రమాణాలు నిర్ణయించి- అలా ఎంపికైన వాటిలో- ఉత్తమమైనది ప్రథమ బహుమతికి అర్హం కావాలి. ప్రథమ బహుమతికంటూ వేరే ప్రమాణాలు అవసరం లేదని స్వాభిప్రాయం. పోనీ బహుమతి మొత్తానికి న్యాయం చేకూర్చడం అర్హతని నిర్ణయిస్తుందనుకుందామంటే- సాధారణంగా మన పోటీల్లో ప్రకటించే మొత్తాలు- మరీ అంత గొప్పవేమీ కాదు. కథారచన అభిరుచికే తప్ప, ఆర్జనకి పనికిరాని మన సమాజంలో- పోటీ నిర్వాహకులూ, రచయితలూ కూడా సాహితీసేవ చేస్తున్నారు. పోటీల ఉద్దేశ్యం నెరవేరాలంటే- న్యాయనిర్ణేతల సంఖ్య 5నుంచి 10 దాకా ఉండాలి. అది సాధ్యం కానప్పుడు- ఉన్న ఆ కొద్దిమందీ పదిమంది పెట్టై ఉండాలి. ఆ తర్వాత న్యాయనిర్ణేతలు- మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచించగల ఆధునిక దృక్పథం కలిగి ఉండాలి. ఇజాలకూ, ఉద్యమాలకూ మాత్రమే కట్టుబడని విశాల భావాలకు ప్రాధాన్యమివ్వాలి. ప్రథమ బహుమతికి అర్హమైన రచన లేదనే పరిస్థితి అప్పుడు ఏర్పడదు.
ఈ విషయమై గతంలో ఆంధ్ర సచిత్రవారపత్రిక ఓ పద్ధతి ననుసరించింది. కొన్ని కథలను బహుమతికి ఎంపిక చేసి ప్రచురించి- ప్రథమ, ద్వితీయ వగైరా స్థానాల నిర్ణయాన్ని పాఠకులకి వదిలి పెట్టింది. ఇది నేటి పత్రికలకు కూడా అనుసరణీయం.
లబ్దప్రతిష్టుల రచనలు పత్రికలు అడిగి మరీ వేసుకుంటాయి కాబట్టి- కొత్త రచయితలకి పోటీలే సరైన వేదిక. మేమలాగే వెలుగులోకి వచ్చాము. ఐతే ప్రస్తుతం పోటీల్లో లబ్దప్రతిష్టులే ఎక్కువగా బహుమతులు గెల్చుకుంటున్నారన్న మాటలో కొంత నిజముంది. గుర్తించతగ్గ కథల ప్రచురణకి పోటీలే ఆధారం కావడమూ, తెలుగు సాహిత్యం పట్ల యువతకు మక్కువ సన్నగిల్లిపోతూండడమూ, కథల ప్రచురణలో విలువలకంటే పరిచయాలకు ప్రాధాన్యం పెరగడమూ- అందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఐతే ఇప్పటికీ ఆంధ్రభూమి, నవ్య, స్వాతి, రచన, విపుల వగైరా ప్రముఖ పత్రికలూ- నది, స్వప్న, చిత్ర, చినుకు వగైరా కొత్త పత్రికలూ పాఠకులకు చిత్తశుద్ధితో మంచి సాహిత్యాన్ని అందిస్తున్నాయి. ఔత్సాహిక రచయితలకు పోటీల ద్వారా ప్రోత్సాహాన్నిస్తున్న నేటి పత్రికలన్నీ అభినందనీయం.
కథల పరిమాణం గురించి కూడా వాదోపవాదాలున్నాయి. కార్డు కథలు సాహిత్యమనిపించుకుంటాయా అని వాపోయేవారు కొందరైతే, పేజీల పరిమితులవల్ల 15 పేజీలు దాటిన పెద్ద కథలకు కాలం చెల్లిపోయిందా అని కలత చెందేవారు కొందరు. ఇటీవల రచన మాసపత్రిక పేజీల పరిమితులు లేని కథల పోటీ ప్రకటించింది. నవ్య వారపత్రిక 50 పేజీల నవలికల పోటీ ప్రకటించింది. ఆ రెండు పోటీల వివరాలూ అక్షరజాలంలో ఉన్నాయి. రచనకు ప్రతిభ ముఖ్యం- పేజీల పరిమితి కాదు. సమర్ధులైన కథకులకు- తమ ఇతివృత్తాల్ని కుదించడమూ, హెచ్చించడమూ, సవరించడమూ ఎక్కువ సందర్భాల్లో సాధ్యమేనని స్వాభిప్రాయం.  
మంచి రచనకు తగిన వ్యవధి కూడా ముఖ్యం. ఆమధ్య స్వాతి వారపత్రిక సిపి బ్రౌన్ అకాడెమీతో కలిసి ఒక నవలల పోటీని ప్రకటించింది. ప్రథమ బహుమతి అక్షరాలా లక్ష రూపాయలు. బహుమతికి అర్హమైన నవల రాకపోవడంవల్ల ఆ పోటీ  రద్దయింది. సుమారు 300-350 పేజీల నవలకు నిర్వాహకులు ఇచ్చిన గడువు చాలా తక్కువనిపించి మేమా పోటీలో పాల్గొనలేకపోయాము. అంత పెద్ద నవల కొత్తగా వ్రాయడానికి 8-10 నెలలు వ్యవధి ఉంటే బాగుండునని మాకు అనిపించింది. ఎందుకంటే తెలుగునాట కథారచన జీవనాధారం కానేరదు. రచనని హాబీగా కాక వ్యాపకంగా స్వీకరిస్తే తప్ప 2-3 నెలల వ్యవధిలో అంత పెద్ద నవల వ్రాయడం సాధ్యం కాదు. ఐతే ఇతరులెవరైనా పూనుకుంటారన్న అలసత్వంతో- మేమా విషయం నిర్వాహకులకు తెలియబర్చలేదు.  అదీకాక ఇంతవరకూ స్వాతి నిర్వహించిన కథ-నవలల పోటీల్లో దేనికీ గడువు తేదీ పొడిగింపు అవసరపడలేదు. 
పోటీలకైనా, ప్రచురణకైనా ఉత్తమ స్థాయి రచనని పంపేవారే మంచి కథకులు. రచన బాగోలేదని తెలిసి కూడా ప్రచురణకి పంపే కథకులకి ఎదుగుదల ఉండదు.
మాకు తెలిసి ప్రస్తుతం కథకులకు చెప్పుకోతగ్గ స్థాయి పారితోషికం అందిస్తున్న పత్రికలు స్వాతి, ఇండియా టుడే, చందమామ. మరికొన్ని పత్రికలు పారితోషికం పరంగా ఆ స్థాయికి చేరకున్నా- కథకులకి ప్రచురణే ప్రోత్సాహమన్న ధోరణి లేకపోవడం సంతోషం.
ప్రచురణ ద్వారా కథకులకి తగిన పారితోషికం అందాలంటే ఆ బాధ్యత కేవలం పత్రికలదే కాదు, పాఠకులది కూడా అని గ్రహించిన రోజున పత్రికలు, రచయితలు  వర్ధిల్లి తెలుగు కథ మరింత పుష్టిని సంతరించుకుంటుంది.

1 వ్యాఖ్య »

 1. vamsi krishna said,

  చాలా మంచి వ్యాసం…అందించినందుకు ధన్యవాదాలు.

  ఇంకో విషయం.
  స్వాతి మాసపత్రిక, అనీల్ అవార్డ్ కధల పోటీ నిర్వహిస్తోంది.
  కధ నివిడి పది అరఠవులు దాటి ఉందకూడదు.
  మొదటి బహుమతి పదివేలు. మిగితా కధలకి వెయ్యి రూపాయలు.
  ఆఖరి తేదీ 30 ఏప్రిల్ 2010


Leave a Reply

%d bloggers like this: