ఏప్రిల్ 5, 2010

పాడుతా తీయగా (ఈ టీవీ)- జనవరి 25- మార్చి 29

Posted in టీవీ సీరియల్స్, బుల్లితెర-వెండితెర at 5:18 ఉద. by వసుంధర

ఈ కార్యక్రమం ప్రతి సోమవారం రాత్రి 9.30కి వస్తోంది. 10.30కి ఐపోవాలని నిర్దేశించినా సాధారణంగా మరో 15-20 నిముషాలు అదనంగా కొనసాగుతుంది. ఇంతసేపా అని కాకుండా- అప్పుడే ఐపోయిందా అనిపించేలా దీన్ని నడిపిస్తున్నారు- ఈ తరహా కార్యక్రమాల నిర్వహణలో మహోన్నత శిఖరం చేరుకున్న పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
ప్రస్తుతానికింకా అంధ్రప్రదేశ్ అనిపించుకుంటున్న రాష్ట్రంలో 23 జిల్లాలనుంచి- జిల్లాకి ఒక్కరు చొప్పున 23గురు గాయనీగాయకులు పోటీకి ఎన్నికయ్యారు. పాల్గొనువారికి తగినన్ని అవకాశాలు లభించేలా ఈ పోటీలకు విభిన్నమైన అనేక భాగాలను నిర్దేశించడం అభినందనీయం. విజేతల ఎన్నికలో శ్రీ ఎస్పీబీకి సహకరించడానికిగానూ- ప్రతి విభాగానికీ ఓ కొత్త న్యాయనిర్ణేత. ఒకో భాగం పూర్తికాగానే పోటీనుంచి ఒక అభ్యర్ధి తప్పుకోవలసి ఉంటుంది. అలా ఇప్పటికి ఎనిమిది భాగాలు పూర్తై- 8గురు అభ్యర్ధులు తప్పుకున్నారు. అభ్యర్ధుల సంఖ్య కారణంగా ప్రస్తుతానికి ఒకొక్కటి రెండు వారాల చొప్పున కొనసాగుతున్న ఈ భాగాల్లో మొదటి మూడింటి గురించీ క్లుప్తంగా పరిశీలించి ఉన్నాం. మిగతా ఐదు భాగాల గురించీ ఇప్పుడు-
నాల్గవ భాగం: భారతీయ చలనచిత్రాలకు నటుడుగా, నిర్మాతగా కొత్త దిశలు చూపి- భాష తనది కాకపోయినా ఎన్నో తెలుగు పాత్రలకు ప్రాణం పోసిన అపూర్వనటుడు కమలహాసన్ చిత్రాలలోని పాటలను పోటీకి నిర్దేశించారు. దీనికి కమలహాసన్‌తో ప్రత్యేక అనుబంధమున్న అపూర్వదర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ముఖ్య అతిథి కావడం సముచితం.  సింగీతం బహుముఖప్రజ్ఞల్లో సంగీతప్రతిభ ఒకటని మాత్రమే కాక- పుష్పకవిమానం, విచిత్రసోదరులు వగైరా అనేక చిత్రాలకు సంబంధించిన ఎన్నో విశేషాలు ఆశ్చర్యపర్చాయి. ఆయన నిర్మించిన ఘటోత్కచుడు (animation film)కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన భాషాతీతం కావడం- గమనార్హం. మహనీయుల చరిత్రలే కాదు- సినీ ప్రముఖుల అనుభవాలు కూడా జాతి ఐకమత్యానికి ఎంతగా దోహదం చేస్తాయో తెలుసుకుందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉదాహరణ. www.youtube.comలో ఈ కార్యక్రమం పాత భాగాలను చూడవచ్చు. పోటీ అనంతరం ఒకరిని తప్పించగా 19మంది అభ్యర్ధులు మిగిలారు.
ఐదవ భాగం: సినీ గీతాలకూ, సంగీతానికీ దశను మార్చి దిశను నిర్దేశించిన అసామాన్య గాయకుడు ఘంటసాల పాటలను ఈ పోటీకి నిర్దేశించి- ఆ శకానికే చెందిన మరో గాయకుడు పి.బి. శ్రీనివాస్‌ని  ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఈ భాగం ప్రత్యేకత. శ్రీనివాస్ బహుముఖప్రజ్ఞ గురించి నేటి ప్రసారమాధ్యమాలు చెప్పేదాకా చాలామందికి తెలియకపోవడం కళాకారులను ఆదరించడంలో తెలుగువారి తీరుకి నిదర్శనం. దక్షిణాదిలో తమిళ, కన్నడ భాషల్లో రాణించినంతగా తెలుగులో రాణించని ఆయన పాటలు విని ఆయనది మగతనమున్న గొంతుగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివారు అభినందించిన విషయం తెలియడం ముదావహం. ఘంటసాల పాడే రోజుల్లో ఆయనతోపాటు మరిన్ని మగ గొంతులు వినిపించేవి. వాటిలో మేటి హీరోలకు కూడా ఒప్పిన, నప్పిన శ్రీనివాస్ గొంతు విలక్షణమూ, విశిష్టమూ కూడా. తెలుగు పాటలకు బాలసుబ్రహ్మణ్యం శకంలో-  అన్ని చిత్రాలలో అన్ని పాత్రలకూ ఒక్కరిదే గొంతు వినిపించడం ఒక్కటే అసంతృప్తికరం. దానికి ఎస్పీబీయే బాధ్యులనేవారుంటే ఈ కార్యక్రమం నిర్వహణ దానికి సమాధానం. అసలు బాధ్యత సినీ నిర్మాతలదీ, దర్శకులదీ, నటులదీ, ప్రేక్షకులదీ అని స్వాభిప్రాయం. అప్పుడు ఒక్కరి ప్రతిభకే ప్రాధాన్యమివ్వడంవల్ల- ఇప్పుడు ఎన్నో గొంతులకు ప్రాధాన్యమున్నా ప్రతిభకు ప్రాధాన్యం లేకుండా పోయిందని మాకు అనిపిస్తుంది. పోటీ అనంతరం ఒక్క అభ్యర్ధి తగ్గి 18 మంది అభ్యర్ధులు మిగిలారు.
ఆరవ భాగం: ఇందులో పాటలన్నీ ఆస్కార్ బహుమతి అందుకుని- మన సినీ సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన అసమాన సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్‌వి కావడం విశేషం. డబ్బ్బింగు పాటలకు తెలుగు వన్నెలనద్దడంలో “రాజశ్రీ” అంతటి ప్రతిభ చూపిన “వెన్నెలకంటి” ముఖ్య అతిథి. ఆయన జీవిత విశేషాలు, అనుభవాలు ప్రేక్షకులు అవశ్యం తెసుకోతగ్గవి. ఐతే- ఆయనకు గొంతు పరంగా ఇబ్బంది ఉన్న సమయంలో ఈ కార్యక్రమం రికార్డింగు జరగడం దురదృష్టకరం. పాటలకు సంబంధించిన కార్యక్రమంలో మాటల గొంతుకీ ప్రాధాన్యమివ్వాలని నిర్వాహకులు గుర్తించకపోవదం- మనోరంజకంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో సవరించుకోతగ్గ లోపం. రెహమాన్ వరసలకు అంతర్జాతీయంగా ఎంత గొప్ప గుర్తింపు లభించినా- తెలుగుతనానికి న్యాయం చేయకపోవడంవల్ల- అవి వరసలే తప్ప పాటలు అనిపించుకోవనిపించింది. పోటీ అనంతరం 17గురు అభ్యర్ధులు మిగిలారు.
ఏడవ భాగం: ఇందులో పాటలన్నీ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లోనివి. జ్ఞానపీఠాన్నధిరోహించిన తెలుగు బిడ్డ మహాకవి సి. నారాయణరెడ్డి (సినారె) ముఖ్య అతిథి. ఆయన గురించిన పరిచయవాక్యాలు కొండను అద్దంలో చూపడంలో ఎస్పీబీకి ఉన్న కొండంత ప్రతిభకు నిదర్శనం. ఆయనను ఆంధ్ర కవిగా పరిచయం చేయడం- ఆంధ్ర శబ్దాన్ని- భాషకేతప్ప ప్రాంతానికి అన్వయించకూడదనే ఔచిత్యానికి సూచన. ఈ కార్యక్రమం నిర్వహణలో బయటపడ్డ ఎన్నో కుతూహల విశేషాలు చూసి తెలుసుకోతగ్గవి. తూర్పు-పడమర చిత్రంలో గోంగూర పద్యాలు విన్నవారు కూడా- ఈ కార్యక్రమం చూసి సినారెలోని గాయకుడికీ, గాత్రమాధుర్యానికీ మరోసారి అబ్బురపడతారు.    పోటీ అనంతరం 16గురు అభ్యర్ధులు మిగిలారు.
ఎనిమిదవ భాగం: ఇందులో పాటలన్నీ- స్వర రచనలో తెలుగువారి మనసుల్ని తమిళులతో సమంగా దోచుకున్న ఎం. ఎస్. విశ్వనాధన్ సంగీత దర్శకత్వంలోనివి.  తనకొచ్చిన తెలుగు అంతంతమాత్రమన్న మాట పాటల్లో స్ఫురించనివ్వక- తనదనే ఒక ప్రత్యేక శైలికి తనది మాత్రమే గొంతు కావాలని తెలుగువారు పట్టుబట్టేలా అలరించిన మహా గాయని ఎల్. ఆర్. ఈశ్వరి ముఖ్య అతిథి. కార్యక్రమం కొనసాగుతుండగా ఆమె “ఏస్కో కోకాకోలా” అంది. మసక మసక చీకటిలో ఓకే- యా- అంది. నా మనసే దోచేసిండు- అంటూ మన మనసులు దోచేసింది. కార్యక్రమాన్ని రసభరితం చేయడానికి పోటీపడేవారిని మించి తన గొంతునందించింది. అభ్యర్ధుల తప్పుల్ని చిన్నవి చేసి సుతారంగా మందలించింది. ఒప్పుల్ని పెద్ద చేసి గౌరవపురస్కరంగా ప్రోత్సహించింది. పోటీనుంచి తప్పుకోవాల్సి వచ్చిన అభ్యర్ధి కన్నీరు పెట్టడం తొలిసారిగా జరిగిందంటే- ఆమెవంటివారి సూచనలు తనకిక లభించవన్న గ్రహింపు కూడా కావచ్చుననిపించింది. కొన్ని పాటల్లో తమిళ పోకడలు కనిపించినా ఎక్కువ పాటలు తెలుగుతనాన్ని నింపుకోవడం ఎమ్ఎస్ ప్రతిభ. పోటీ అనంతరం 15గురు అభ్యర్ధులు మిగిలారు.
మెచ్చుకోతగ్గ విశేషం: ఈ కార్యక్రమంలో ఔత్సాహిక గాయకులకు అందుతున్న సూచనలు- అరుదైనవి, విలువైనవి.  గాయకులమనుకునేవారి అపోహలను తొలగిస్తూ, గాయకులు కాగలినవారికి సహకరిస్తూ, జనావళికి సంగీతంపట్ల సదవగాహన కలిగిస్తూ- అభిరుచిని పెంచే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఊహించి, రూపకల్పన చేసి అందిస్తున్నవారందరూ అభినందనీయులు.
సూచన: ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి పాటకూ- చిత్రం పేరు, సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు పేర్లను ప్రకటించడం సముచితం. ఎనిమిదవ భాగమ్‌నుంచి ఈ ప్రక్రియను మొదలు పెట్టినందుకు సంతోషం. ఐతే ఆయా పేర్లను అక్షరాలలో వ్యాఖ్యగా చూపితే వీలు. ఒకోసారి మాటలు సరిగ్గ వినబడ్డంలేదు.
మరో విషయం. కొత్త గాయకుల్ని సంగీత దర్శకులు తీవ్రంగా మందలించిన ఉదాహరణలు ఔత్సాహిక గాయకుల ఆత్మవిశ్వాసానికి చాలా ప్రయోజనం. ఐతే-  ఘంటసాల చివరి దశలో గొంతు సహకరించక, పాటలు పాడడానికి పడ్డ ఇబ్బంది, సహృదయంతో సంగీత దర్శకులు సద్దుబాటు చేసుకున్న విషయం ఈ వేదికకు అప్రస్తుతం అనిపించింది.
అసంతృప్తి: జిల్లాకి ఒకరు అంటే వీళ్లేనా అనిపించే స్థాయిలోనే ఉన్నారు అభ్యర్ధులందరూ. పది లక్షల రూపాయల బహుమతి వీళ్లలో ఒకరికా అనే ఇప్పటికీ అనిపిస్తోంది.
ఆశావాదం: ఈ కార్యక్రమం మట్టిలో మాణిక్యాలని వెలిదీయడానికి కాక, వజ్రాలను సానబెట్టడానికి అనుకుంటే మాత్రం అభ్యర్ధుల్లో ప్రతిభావంతులు చాలామందే ఉన్నారు. ఈ భాగాల్ని సానబెట్టే ప్రక్రియగా భావిస్తూ- కార్యక్రమం ముగిసే సమయానికి మనకు సానబెట్టిన వజ్రాలు కొన్ని అందగలవని ఆశిస్తూ- అసంతృప్తిని వాయిదా వేసుకోవడం సముచితమని ప్రస్తుతానికి అనిపిస్తోంది.

1 వ్యాఖ్య »

  1. vinaychakravarthi said,

    nice man…………


Leave a Reply

%d bloggers like this: