ఏప్రిల్ 11, 2010

ముఖాముఖీ -ఏప్రిల్ 10, 2010

Posted in ముఖాముఖీ at 4:54 ఉద. by వసుంధర

ఋణానుబంధం అన్నది ఎంతో అర్థవంతమైన పదం అనడానికి ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎన్నో ఉదాహరణలుంటాయి.
శ్రీ వద్దిపర్తి గంగరాజు సామర్లకోట వాస్తవ్యులు. నా బాబాయికి స్వయానా బావగారు కావడంవల్ల చాలా దగ్గిర బంధువులు. కలుసుకోవడం అరుదు కాబట్టి మాది చాలా దూరపు పరిచయం. గత సంవత్సరం- ఒక అఫిడవిట్‌కి నాకంటే కనీసం పదేళ్లు పెద్ద వయసున్న బంధువులిద్దరి సంతకాలు అవసరపడితే- నా బాబాయి, ఆయన ఆ సంతకాలు చేసారు. అప్పుడే ఆయనతో నాకు దగ్గిర పరిచయమైంది. ఎనభయ్యో పడికి దగ్గిర్లో ఉన్న ఆయన్ని ఆ తర్వాత కొద్ది మాసాలకే అనాయాసమరణం వరించినట్లు తెలిసి- మనసదోలా ఐపోయింది. నాకు సంబంధించిన అఫిడవిట్‌పై ఆయన సంతకం ఋణానుబంధమే అనిపించింది.
మా రచనల్లో నచ్చిన అంశాల్ని అభిమానంగానూ, నచ్చనివాటిని నిస్సంకోచంగానూ ప్రకటిస్తూండే అభిమానుల్లో శ్రీ గెడా రంగారావు ఒకరు. మా రచనల్ని సేకరించి దాచుకునే ఆయననుంచి- పోగొట్టుకున్న మా రచనలు కొన్నింటి కాపీలు సంపాదించుకున్నాం. మాదీ ఋణానుబంధమే. ఆయన రంగనాయకమ్మకు కూడా వీరాభిమాని.
రచనావ్యాసంగంలో 45 ఏళ్లు దాటినా- సాహితీపరులతో మా వ్యక్తిగత పరిచయాలు ఇప్పటికీ అంతంతమాత్రం. మేము అభిమానించే కథకుల్లో ముఖ్యంగా చెప్పుకోతగ్గ రంగనాయకమ్మ-మా రచనలు చదవాలని మనసులో కొరిక ఉంది. ఆ విషయం మేము చెప్పకపోయినా- మా రచనలు కొన్నింటిని బలవంతంగా రంగనాయకమ్మ చేత చదివించిన ఘనుడు శ్రీ గెడా రంగారావు. మార్క్సిస్టు దృక్పథంతో నిస్సంకోచంగా వాటిని చీల్చి చెండాడినా- తన అభిప్రాయాల్ని స్వదస్తూరీతో ఉత్తరంగా మాకు పంపడం ఆమె నిబద్ధతను తెలియజేస్తుంది. మా రచనలపై మాకు ఖచ్చితమైన అభిప్రాయాలుండడంవల్ల- ఆమె వాటిని శ్రద్ధగా చదివారన్న సంతోషమేతప్ప- నిందించారన్న అసంతృప్తి మాకు కలుగలేదు. రామాయణాన్ని కల్పవృక్షంగా భావించే బాపు- విషవృక్షం పుస్తకానికి గౌరవంగా ముఖచిత్రం వేసినట్లు మేమామె విమర్శను మావద్ద దాచుకున్నాం. ఎంత విమర్శించినా మా రచనల ప్రభావం ఆమెపై ఉంటుందనే మా నమ్మకం. ఒక తరహా ఋణానుబంధంగా భావించే ఆ విమర్శ- నచ్చినవారు వస్తువునీ, నచ్చనివారు శైలినీ మెచ్చుకునేలా ఉంటుంది. వీలువెంబడి అక్షరజాలంలో ప్రచురించగలం. 
భరాగో అన్న పేరుతో సుప్రసిద్ధులైన శ్రీ భమిడిపాటి రామగోపాలం మా దృష్టిలో సాధారణ రచయిత. అందుకు కారణం మేము పత్రికల్లో చదివిన ఒకటి రెండు కథలు. డెబ్బయ్యో పడిలో- కీళ్ల నొప్పులతో  మంచం దిగలేని స్థితిలో- తెలుగు సినీ సంగీతానికి ఆయన తలపెట్టిన సేవ అపూర్వం. ఆ సందర్భంగా ఆయనతో పరిచయమైంది శ్రీ గెడా రంగారావుకి. ఒకరోజు రంగారావు మా ఇంట్లో ఉండగా భరాగో ఆయనతో సెల్‌లో మాట్లాడి ఆయన చెప్పగా మాతో కూడా మాట్లాడి- తన పుస్తకమొకటి మాకు పంపుతానన్నారు. యధాలాపంగా అనుకున్నాం కానీ వారం తిరక్కుండా నిజంగానే మాకు అందింది వారి “ఇట్లు మీ విధేయుడు” కథాసంపుటి. సాహిత్య అకాడెమీ అవార్డు పొందిందని కాక- రచనలో పుస్తక పరిచయం కోసం ఆ పుస్తకం చదివితే- అప్పుడు తెలిసింది- అది అవార్డుకే గౌరవాన్నిచ్చిందనీ-భరాగో అసాధారణ రచయిత అనీ. పుస్తక పరిచయాన్ని రచన మాసపత్రికలో చదివిన భరాగో మాకు వ్రాసిన పెద్ద ఉత్తరం కేవలం ఋణానుబంధాన్ని గుర్తు చేస్తుంది. ఒక రచన గురించి మనసుకు తొచిన మంచిమాట చెప్పడం- అది ఉన్న మాటే ఐనా- భరాగోవంటి లబ్దప్రతిష్ఠులలో కూడా అంతటి స్పందన కలిగించిందంటే- అలా చెప్పనివారు అపరాధభావానికి గురికాక తప్పదు. ఆ ఉత్తరాన్ని వీలువెంబడి అక్షరజాలంలో అందించగలం. ఈ ఏప్రిల్ 7న తన 78వ ఏట భరాగో కన్ను మూసారన్న వార్త హృదయాన్ని కలచి వేసింది. ఆ మహా రచయితకు అక్షరజాలం నివాళులు. త్వరలో శ్రీ భరాగో పుస్తక పరిచయం అందించగలం. 
పరిచయాలు ఋణానుబంధమనడానికి మా విషయంలో మరో నిదర్శనం శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం. తన 88వ ఏట ఈ జనవరి 27న కన్ను మూసిన ఆయన సంస్మరణతో వస్తోంది మే నెల రచన మాసపత్రిక. ఆయన గురించిన కుతూహల విషయాలెన్నో తెలియబర్చే ఈ సంచికలో- మా సాహితీవైద్యం ఆయన్నే అనుసరిస్తూ ఆయన విశ్వరూపాన్ని సూచించడం గమనించగలరు.
అక్షరజాలం తెలుగు సాహితి భూత భవిష్యద్వర్తమానాలకు ఋణానుబంధంగా కొనసాగడానికి మా వంతు కృషిని హామీ ఇస్తూ, మీ సహకారాన్ని ఆశిస్తూ-
ప్రస్తుతానికి శలవా మరి!
వసుంధర

Leave a Reply

%d bloggers like this: