ఏప్రిల్ 18, 2010
రచన- శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం స్మృతి సంచిక
బాల సాహిత్యంలో చందమామ పత్రికది ఒక విశిష్ట స్థానం అని అందరికీ తెలుసు.. ఆ చందమామలో శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంది ఒక విశిష్ట స్థానమని కొందరికే తెలుసు. అందరికోసం ఆ కొందరిలో కొందరి స్పందనతో మే నెల రచన మాసపత్రిక ప్రత్యేకంగా రూపు దిద్దుకోవడం మరో విశిష్టత అనే- చందమామ అభిమాని శ్రీ దాసరి వెంకటరమణకి- ఇంటిపేరు ఒకటి కావడం మినహాయిస్తే- సుబ్రహ్మణ్యం గారితో- అంతగా పూర్వ పరిచయమూ లేదు, సాహితీ బంధుత్వం మినహా ఇతరత్రా బంధుత్వమూ లేదు. వారు ఈ మెయిల్లో పంపిన లేఖనిక్కడ ప్రచురిస్తున్నాం:
సాహితి మిత్రులకు నమస్కారం!
తెలుగు చందమామ చదవకుండా తెలుగు పిల్లలు పెద్దవాళ్ళు కారు అన్నది ఒక నానుడి. అది కాస్త అతిశయోక్తిగా అనిపించినా నిర్వివాద మైన వాస్తవం. చందమామలో 1954 నుండి 1980 వరకు తోకచుక్క మొదలుకొని భల్లూక మాంత్రికుడు వరకు 12 అద్భుతమైన సీరియల్స్ ను రాసిన దాసరి సుబ్రహ్మణ్యం గారికి నివాళి గా రచన మే సంచిక ప్రత్యేకంగా రూపుదిద్దుకొని వెలువడుతోంది..
ఇది చందమామ అభిమానులందరూ తప్పక చదివి తీరవలసిన, అపురూపంగా దాచుకోదగ్గ సంచిక. వివరాలు కింద అటాచ్మెంట్ లో వున్నవి.
ఒక విషయం గుర్తు పెట్టుకోండి. రచన తీరిగ్గా బజారులో కొనుక్కోవచ్చు అనుకొంటే మీరు ఆశాభంగం చెందవలసిందే. ఈ నెల అనగా ఏప్రిల్ 25 వ తేది లోగా వచ్చిన ఆర్డర్లను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ ను బట్టి కాపీలు ప్రింట్ చేయ బడతవి. మీ స్పందన పోస్ట్ కార్డ్ ద్వారా మెయిల్ ద్వారా వెంటనే తెలియ చేయండి. త్వరగా ఆర్డర్ చేయండి.
మీరు ఈ మెయిల్ ను మీకు తెలిసిన సాహితి అభిమానులందరికీ ఫార్వార్డ్ చేయండి. చిన్నప్పుడు మీరు చదివిన చందమామ స్మృతులను పంచుకోండి.
భవదీయ
దాసరి వెంకట రమణ
బ్రహ్మానందం said,
ఏప్రిల్ 18, 2010 at 2:03 ఉద.
దాసరి గారు బ్రతికుండగా బాల సాహిత్యానికి తన వంతు సాయంగా చేసిన రచనలపై ఒక ప్రత్యేక సంచిక వేసుంటే ఆయనా సంతోషించి ఉండేవారు. గత రెండేళ్ళ క్రితం వరకూ చాలా మందికి ఆయన చందమామ వెలుగు వెనుక నీడన్నదే తెలీదు. మనిషి పోయిన తరువాత గుర్తించడం తెలుగువారికి మామూలే!
బ్రతికుండగా ఈ పేరు చెప్పి ఒక సన్మానమయినా చేసుండాల్సింది. మనిషి కాలం చేసాక ఇవన్నీ ఎవరికోసం?
-బ్రహ్మానందం గొర్తి
వసుంధర said,
ఏప్రిల్ 27, 2010 at 1:20 ఉద.
మీ సూచన సబబైనదే. ఐతే రచన తీసుకువస్తున్న దాసరి స్మృతి సంచికకు మీ వ్యాఖ్య వర్తించదు. ఆ విషయం “ముఖాముఖీ” లో ప్రస్తావిస్తున్నాం.