ఏప్రిల్ 27, 2010

ముఖాముఖీ- ఏప్రిల్ 26, 2010

Posted in ముఖాముఖీ, Uncategorized at 3:53 ఉద. by వసుంధర

అంతర్జాతీయంగా ఆడే క్రికెట్– ఐదు రోజులాడితే పరీక్షాత్మకమైన పోటీ. ఒక్క రోజు ఆడితే వినోదాత్మక పోటీ.  ఇక టి20- ఒక సర్కస్. అలాంటి సర్కస్‌లో 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ది (ఐపిఎల్)  అగ్రస్థానం. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఐపిఎల్-1లో విజేతలు షేన్ వార్న్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్. 2009లో నిర్వహించబడ్డ ఐపిఎల్-2లో విజేతలు ఆడమ్‌గిల్‌క్రిస్ట్ నాయకత్వంలో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్. ఇటీవల ముగిసిన ఐపిఎల్-3లో విజేతలు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్. విచిత్రమేమిటంటే  ద్వితీయ స్థానం లభించిన ముంబై ఇండియన్స్ సచిన్ తెండూల్కర్ నాయకత్వంలో పదహారింట పదకొండు మ్యాచిలు నెగ్గారు. ప్రథమస్థానం దక్కించుకున్న ధోనీ సేన- పదహారింట తొమ్మిది మ్యాచిలు మాత్రమే నెగ్గారు.  ఏడాది పొడుగునా తన సత్తా చూపిన విద్యార్ధి- ఫైనల్ పరీక్షలో చిన్న పొరపాటు చేస్తే అదే అతడి సత్తాకి గీటురాయి అవుతోంది. చదువుకైనా, ఆటలకైనా- ఆయా రంగాల పరిమితుల మేరకు ఈ పద్ధతి ఎంతవరకూ సబబో ఆలోచించాలేమో!
చందమామ మాసపత్రిక సంపాదకవర్గంలో ఉన్నవారి రచనలెన్నో ఆ పత్రికలో వచ్చి ప్రాచుర్యం పొందాయి. వారి పేర్లు అజ్ఞాతంగా ఉంచడం ఆ పత్రిక సంప్రదాయం కావడంవల్ల- దాసరి సుబ్రహ్మణ్యం వంటి అసాధారణ ప్రజ్ఞాశాలి తెర మరుగున ఉండిపోయారు. అది కొంతవరకూ ఆయన ఛాయిస్ కూడా అని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వివరాలకోసం మేమే గత 10-15 సంవత్సరాలుగా ఎన్నో ఉత్తరాలు వ్రాసి ఉన్నాం. ఆయన సరేనంటూనే దాటవేస్తూ వచ్చారు. నాలుగేళ్లక్రితం వయోభారంతో ఆయన చందమామను విడిచిపెట్టాక-  తెలిసినవారందరికీ ఆయన పేరు వెలుగులోకి తీసుకురావాలన్న తాపత్రయం మొదలైంది. ఆచార్య రామవరపు గణేశ్వరరావు, మేము వ్యాసరూపేణా పరిచయం చేస్తే- బాల సాహిత్య పరిషత్తు గత సంవత్సరం నవంబర్లో వారిని హైదరాబాదులో వేదికపై సన్మానించింది. ఇప్పుడు  రచన మాసపత్రిక  శ్రీ దాసరి సంస్మరణ సంచిక తీసుకు వస్తోంది.  ఆయన పోయాక ఈ సంస్మరణ ఎవరికోసమన్న శ్రీ గొర్తి బ్రహ్మానందం స్పందనలో ఆవేదనే తప్ప అవహేళన లేదని మేమనుకుంటున్నాం. ఎందుకంటే వారికి కలిగిన భావనే మాకూ కలిగి- ఆత్మవిమర్శ చేసుకుంటే వచ్చిన విశ్లేషణ కథారూపం ధరించి సాహితీవైద్యంలో ముందుమాటయింది (రచన మే సంచికలో చూడగలరు). వేల సంవత్సరాలక్రితం వ్యక్తుల గురించి పరిశోధనలు .చేసే సంప్రదాయం అభినందనీయమైనప్పుడు- సమకాలీనంగా అజ్ఞాతులైన  శ్రీ దాసరిని పరిశోధన, విశ్లేషణత్మక వ్యాసాలతో సంస్మరించడం- ఆవశ్యకమని స్వాభిప్రాయం. రచన మే సంచికలోని అంశాలని సూచనప్రాయంగా తెలుసుకుందుకు http://www.rachana.net/May_2010.pdf సందర్శించగలరు.
ప్రస్తుతం చందమామ పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్న శ్రీ రాజశేఖరరాజు ఈ ప్రత్యేక సంచికకు ప్రత్యేక అలంకారమనదగ్గ సంగతులెన్నో అందించారు. అన్నట్లు చందమామకు email ద్వారా రచనలు పంపాలనుకునేవారు rajasekhara.raju@chandamama.com; abiprayam@chandamama.comలకు పంపవచ్చు. శ్రీలిపిలో SHREE914, SHREE902 ఫాంట్స్‌లో కానీ, యూనికోడ్‌లో గౌతమి ఫాంట్‌లో కానీ ఐతే నేరుగానూ- మిగతావి పిడిఎఫ్ ఫార్మాట్‌లోనూ పంపాలి.
మరిన్ని చర్చనీయాంశాలతో మళ్లీ కలుద్దాం. ప్రసుతానికి శలవా మరి!
వసుంధర

1 వ్యాఖ్య »

 1. బ్రహ్మానందం said,

  వసుంధర గారూ,

  మీరన్నట్లు ఆవేదనే కానీ, ఎవర్నీ అవహేళన చేసే వుద్దేశ్యం నాకు లేదు.

  నిన్న దాసరి, మొన్న పతంజలి, ఆ మొన్న బాలగోపాల్…ఈ జాబితా వెనక్కి వెళితే చాలా పెద్దదే వుంది. నా బాధల్లా ఓకటే, అవార్డులయినా, అభినందనయినా మనిషి బ్రతికుండగా వస్తే, వరిస్తే, అందుకున్నవారికీ సంతోషమే కదా? తమ శ్రమనండి లేదా సృజననండి. ఏదైనా ఇతరులనీ అలరించిందికదా? అన్న చిన్న సంతోషం, అంతే. శ్రమకి గుర్తింపే కిరీటం. కాదంటారా చెప్పండి? పోయాకా పచ్చలహారం తొడిగినా, పూలహారం వేసినా అది మన తృప్తికోసమే!

  కారణాలు ఏమయినా – దాసరి గారు పిల్లల హృదయాల్లో చందమామే!

  -బ్రహ్మానందం


Leave a Reply

%d bloggers like this: