మే 20, 2010
ముఖాముఖీ- మే 19, 2010
భాష ప్రాతిపదికగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో- యాస ప్రాతిపదికగా విభజన కోరుతూ ప్రారంభమైన తెలంగాణా ఉద్యమం ఇటీవల ముమ్మరమైంది. తార్కికంగా విశ్లేషిస్తే ఈ విభజన అనవసరమనడానికున్నన్ని కారణాలు అవసరమనడానికీ లభించే పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. సాహితీపరంగా తెలుగువారందరూ ఎప్పటికీ ఒక్కటే ఐనా ప్రస్తుతం జరుగుతున్నది
రాజకీయ పోరాటం కాబట్టి- ఫలితాన్ని సామరస్యంతో అనుభవిద్దాం.
ఈ ఉద్యమాన్ని సమర్ధిస్తూ– వరంగల్ జిల్లాకు చెందిన ఓ గ్రామస్థులు- ప్రత్యేక తెలంగాణా వచ్చేదాకా తాగుడు అలవాటుకి స్వస్తి పలకాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి వారు తీసుకున్న నిర్ణయం వారికీ, వారి
కుటుంబాలకీ ఎంతో మేలు చేస్తుందనడంలో ఎవరికీ సందేహం లేదు. కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే- వారు తిరిగి మద్యపానం మొదలెడతారు. అందువల్ల వారికి జరిగేది మేలా, కీడా? శ్రీ కృష్ణ కమిషన్
సందిగ్ధాలకి ఇది కూడా జతపడదూ?
ఇండియాలో ఉంటున్న మా అమ్మాయి రెండు నెలలు మాతో సరదాగా గడపాలని మనసుపడింది. అమెరికావారు వీసా ఇచ్చి కరుణించారు. ఉద్యమాలు, కర్ఫ్యూలు జడిపించినా పిల్లల పరీక్షలు సకాలంలో ముగియడంతో- ఈ ఏప్రిల్ 15న హైదరాబాదులో బయల్దేరింది. ముంబై చేరుకునేసరికి ఐర్లాండులో అగ్నిపర్వతం బద్దలై భస్మాసురుణ్ణి సృష్టించింది. వరాలిచ్చే దేవుళ్లకి కూడా భక్తుల రాక్షసత్వానికి తలవంచక తప్పదు. వరాలివ్వగలమనుకునే మనుషులకీ ప్రకృతి వైపరీత్యానికి తలవంచక తప్పదని ఋజువు చేస్తూ- ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు ఆగిపోయాయి. ఇలాంటి సంకట పరిస్థితిలో చాలామంది రోజులతరబడి విమానాశ్రయాల్లో చిక్కడిపోయినా- పోరాటపటిమకు అదృష్టం కూడా కలిసిరాగా ఏప్రిల్ 19కే అమెరికా చేరుకోగలగడం మా అమ్మాయి అదృష్టం. ఇంతకీ అమ్మాయి ప్రయాణంవల్ల మాకు తెలిసింది కానీ ఐర్లాండు భస్మాసురుడి గురించి అధిక శాతం ప్రజలకు తెలియదు.
దినపత్రికల్లో కూడా ఈ వార్తకి తగిన ప్రాధాన్యం లభించలేదు. ప్రపంచం ఎంత దగ్గిరైపోతున్నా ప్రపంచప్రజల మధ్య దూరాన్ని శాసించేది స్వార్థమే కదా!
ఆంధ్రభూమి స్వర్ణోత్సవ నవలల పోటీల్లో– అక్షరజాలం అభిమానులు శ్రీయుతులు పసుపులేటి తాతారావు, ఆకునూరి మురళీకృష్ణ లకు ప్రథమ, ద్వితీయ బహుమతులు రావదం విశేషం. వారికి అబినందనలు. తక్కిన విజేతల గురించి ఎవరైనా సమాచారం అందజేస్తే ప్రచురించగలం. మా అమ్మాయి
ఇండియాకి తిరిగి వెళ్ళేవరకూ అంటే జూలై వరకూ వివిధ పత్రికల్లో వచ్చే పోటీలు, ఫలితాల వివరాలు కూడా వేరెవరైనా పంపితే అందజేయగలం.
అక్షరజాలం నిర్వహణలో సాంకేతికంగానూ, సమాచారంతోనూ సహకరిస్తున్న మా అమ్మాయి ఇక్కదకు రావడం- మాకెంతో ప్రయోజనకరం. ఐతే చాలా కాలం తర్వాత మా కుటుంబమంతా ఒకచోట చేరడంవల్ల- ఆ వేడుకల్లో కాస్త వెనుకబడిన వ్యాపకాల్లో అక్షరజాలం ఒకటి. ఆ లోటును త్వరత్వరగా భర్తీ చేయగలమని మనవి.
మరిన్ని చర్చనీయాంశాలతో మళ్లీ కలుద్దాం. ప్రసుతానికి శలవా మరి!
వసుంధర
Leave a Reply