మే 25, 2010

ముఖాముఖీ మే 23, 2010

Posted in ముఖాముఖీ at 1:06 ఉద. by వసుంధర

గొప్పవాళ్లని కలిసినప్పుడు మనకి వారు పరిచితులైనా మనం వారికి అపరిచితులమే.  ఐతే మామూలు మనిషికి వారి జ్ఞాపకాలు నిశ్చల నదీజలం లాంటివి.  దోసిలి పడితే దాహం తీర్చగలవు. చిన్న బెడ్డ వేసినా కలకలం సృష్టించగలవు. మే 22 రాత్రి 9.30కి శ్రీ వేటూరి సుందరరామమూర్తి దివిజ కవివరుల గుండెలు దిగ్గురనిపింవడానికి వెళ్లారని తెలిసినప్పుడు- మాకు అనిపించినదిది.
తెలుగునాట సంచలనం సృష్టించిన అడవిరాముడు (ఆరేసుకోబోయి పారేసుకున్నాను). తెలుగుతనాన్ని మూగబోనివ్వని సిరిసిరిమువ్వ (ఝుమ్మంది నాదం). తెలుగు సినిమా పాటకు త్యాగయ్య యోగం కలిగించిన శంకరాభరణం (ఓంకారనాదాను సంధానమౌ గానమే). త్యాగయ్యను ఆధునికంగా చూడాలని ఉంది (యమహా నగరి కలకత్తాపురి). ప్రవాహంలో గోదావరి (ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి).
సామాన్యుడినుంచి అసామాన్యుడిదాకా అసమానంగా ప్రభావితంచేయగల ఆయన పదజాలానికి అదుపు, ఎల్లలు లేవని తెలియనిదెవరికి?
1982-83లో పొగబండిలో భువనేశ్వర్ నుంచి మద్రాసు వెడుతున్నాం. ఎల్టీసీ కాబట్టి మొదటి తరగతిలో ప్రయాణం. విశాఖపట్నంలో ఎక్కారు జుత్తు పండిన ఒక భారీకాయుడు, ముఖంమీద స్పష్టంగా బొల్లి మచ్చలు కనబడే ఒక అభారీకాయుడు. భారీకాయుణ్ణి ఎక్కడో చూసినట్లే అనిపించి మా కుటుంబమంతా కొట్టుకుపోయాం. రెండో ఆయన తన్ను తాను రమేష్‌నాయుడుగా పరిచయం చేసుకున్నారు.  రెండుజెళ్ల సీత సినిమా షూటింగుకి వచ్చి వెనక్కి వెడుతున్నామనీ, టికెట్సు confirm కాలేదనీ, తనతో వస్తున్న వేటూరి సుందర రామ్మూర్తి అనారోగ్యంతో ఉన్నారనీ చెప్పి మా కూపేలో కూర్చునేందుకు అనుమతి కోరారు. ఒకరు “స్వయంప్రభ” కాలంనుంచీ మేమభిమానించే రమేష్‌నాయుడు, మరొకరు దేవాంశ సంభూతులనిపించే కవివరేణ్యులు. అనుమతి ప్రస్తావన ఎక్కడుంది- ఆరాధనాభావంతో వారికి పూర్తిగా చోటిచ్చి మేము సద్దుకున్నాం. వారు మాత్రం తమదికాని చోటన్నట్లు సద్దుకొవడంవల్ల కూపేలో మరికొందరెక్కినా చోటుండేలా తోచింది. విద్య యొసగును వినయంబు, వినయమున్నచోటు అగును పుష్పకంబు అనిపించింది. సాహితీ సరస్వతిని సంగీత సరస్వతి సేవించుకునే అద్భుత దృశ్యం కలిగించిన అనుభూతిని ఆస్వాదించేందుకు అడ్డు కాకూడదని మమ్మల్ని మేము అభిమానులుగానేతప్ప కథా-సినీ రచయితలుగా వారికి పరిచయం చేసుకోలేదు. విజయవాడ తర్వాత వారికి సముచితమైన స్థానం లభించి స్థలం మారినప్పుడు కానీ మాకు తెలియలేదు- ఆ మహానుభావుల సమక్షం కోల్పోవడం మా మిగతా ప్రయాణానికి పెద్ద లోటని.
2006లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మాకు నవలాసాహిత్యరంగానికి కానూ ధర్మనిధి పురస్కారం ఇచ్చినప్పుడు వేదికమీద ఉన్న ప్రముఖుల్లో వేటూరి ఒకరు. అనుక్షణం తెలుగు భాష గురించి ఆలోచించే ఆ అసలుసిసలు తెలుగు మనిషి ప్రసంగం- ప్రొద్దుటూరులో పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహానికి కలుగనున్న స్థానభ్రంశం, తెలుగు భాషకు ప్రాచీనహోదా అంశాలచుట్టూ ఆవేదనను ఆవేశంగా స్పృశించింది.
పాండిత్యమే కాదు- భాషకోసం నిర్ద్వంద్వంగా కొనసాగించే పోరాటపటిమకూ పేరెన్నికగన్న ఆ సరస్వతీపుత్రుడు మనమందరం గర్వించతగ్గ తెలుగుబిడ్డ. ఆయనకు లభించిన బిరుదులు, సత్కారాలూ తమకు విలువను సంతరించుకుంటే- లభించనివి ఆ మేరకు చిన్నబోయాయి. వారికి అక్షరజాలం నివాళులు.

వసుంధర

Leave a Reply

%d bloggers like this: