మే 26, 2010

ముఖాముఖీ మే 25, 2010

Posted in ముఖాముఖీ at 3:28 ఉద. by వసుంధర

తీరాన సముద్రపుటలలు చేసే ఘోష బలమంతా అనంత సాగర జలాల నిశ్శబ్దంలో ఉంది. భూమ్మీద మనగలుగుతున్న ప్రతి ప్రక్రియ వెనుకా అటువంటి నిశ్శబ్ద కృషి ఉంది. సాహిత్యంలో అలా నిశ్శబ్ద కృషి చేస్తున్న ఎందరో మహానుభావుల్లో త్రివిక్రమ్ ఒకరు. మాకు వీరితో తొలుత ఈమెయిల్సు ద్వారా పరిచయం. ముఖపరిచయం ధర్మనిధి పురస్కారం అందుకుంటున్నప్పుడు జరిగింది. ఆ రోజున మాకు వారందించిన కరపత్రం- ప్రొద్దుటూరులో పుట్టపర్తి వారి విగ్రహానికి స్థానభ్రంశం ప్రతిపాదనకు వ్యతిరేక నినాదం. వారొకసారి మా ఇంటికొచ్చి “తెలుగులో బ్లాగులు వ్రాయడం ఎలా” అన్న సమాచార వ్యాసంతో చిరు పొత్తాన్నిచ్చారు. సులభగ్రాహ్యమైన ఆ చిరుపొత్తం కాపీలని మేము ఎందరికో అందజేసాం కాబట్టి అవి ఎందరో వ్యక్తులకూ, ఎన్నో బ్లాగులకూ ప్రేరణ అని చెప్పగలం. శ్రీ త్రివిక్రమ్ నిర్వహణలో వస్తున్న “పొద్దు” వెబ్ పత్రిక చేస్తున్న సాహితీ సేవను తెలుసుకునేందుకు ఆ సైటుకు వెళ్లి చూసి తెలుసుకోవలసిందే! శ్రీ వేటూరి గురించి మే 23న మేమందించిన వ్యాసం చదివి వారిలా స్పందించారు: ఈరోజు మీరు రాసిన బ్లాగుటపాలో ఒక చిన్న పొరబాటు దొర్లింది. తాళ్లపాకలో అన్నమయ్య విగ్రహానికి కలుగనున్న స్థానభ్రంశం- అని మీరు రాశారు. కానీ నిజానికి అది ప్రొద్దుటూరులో పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహానికి కలిగిన స్థానభ్రంశం. మాన్యుల నుంచి సామాన్యుల దాకా వెల్లువెత్తిన నిరసనల తీవ్రత గమనించి తర్వాత అక్కడే పునఃప్రతిష్ఠించారు

దానికి మేమిలా బదులిచ్చాం: బ్లాగును పోస్టు చేసేముందు మా ఇద్దరికీ కూడా అది అన్నమయ్యకు సంబందించినది కాదనీ, పుట్టపర్తి వారిది కావచ్చుననీ అనుమానమొచ్చింది కానీ మీకు వ్రాయాలని తోచలేదు. అక్కడ fact కంటే content కే ప్రధానమని తాత్కాలికంగా సరిపెట్టుకున్నాం. మీరు వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు. ఆ మేరకు వెంటనే సవరణ చేస్తున్నాము.
పై విషయమై మరిన్ని వివరాలకు 2 లింకులు http://avee-ivee.blogspot.com/2006/09/blog-post_09.html;
http://avee-ivee.blogspot.com/2006/09/blog-post_13.html
ఈ ఆధునిక యుగంలో కూడా ఇంకా తెలుగు వంటకాల్నే అభిమానించేవారిలో మేమూ ఉన్నాం. మన మజ్జిగట్టుకి దగ్గిరగా ఉంటుందని అందరూ బలవంతపెట్టినా- అటు హైదరాబాదులోనూ, ఇటు అమెరికాలోనూ కూడా పీజా మాకు రుచించలేదు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం: ఇటీవలే విడుదలైన Kites చిత్రం. నిర్మాతగా అపజయమెరుగని రాకేష్‌రోషన్, నటుడిగా తిరుగులేని హృతిక్‌రోషన్, నటిగా విశ్వవిఖ్యాతి గాంచిన హాలీవుడ్ నటి బార్బారా మోరే- ఈ చిత్రానికి కాసులపంట అవుతారనుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ- ఈ చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తున్నాయిట కానీ భారతీయులు పెదవి విరిచారట. ఈ సినిమాలో హీరో అమెరికాలో పుట్టాడు కాబట్టి హిందీ రాదుట. హీరోయిన్ మెక్సికన్ కాబట్టి ఇంగ్లీషు రాదట. అందుకని ఆ పాత్రలు వేరే భాషలో మాట్లాడితే- హిందీలో సబ్‌టైటిల్సు వేసారట. లైలా మజ్‌నూలు, కరుణామయులు, పురాణపురుషులు అవలీలగా ప్రాంతీయ భాషలు మాట్లాడితే అసహజమనుకోని భారతీయులు- థియేటర్లో సబ్‌టైటిల్స్ చూడగల స్థాయికి ఇంకా ఎదగలేదని Kites బృందం బాధ పడుతున్నారు. తమ చిత్రం బిర్యానీ కాదనీ, మనవాళ్లు పాస్తాకు అలవాటుపడాలనీ హృతిక్ నొచ్చుకున్నాడట. చలనచిత్రాలద్వారా- అభిరుచితో పాటు రుచినీ శాసించడం సాధ్యపడి- త్వరలోనే పాస్తా అందరికీ రుచిస్తుందేమో మరి. మేమింకా Kites చూడలేదు. మజ్జిగట్టు-పీజా సామ్యం ఈ విషయంలో వర్తించదేమో వేచి చూడాలి.
మళ్లీ కలుద్దాం.
వసుంధర

Leave a Reply

%d bloggers like this: