మే 28, 2010

ఈటీవీ సీరియల్ “చంద్రముఖి” మే 27 2010

Posted in టీవీ సీరియల్స్, బుల్లితెర-వెండితెర, Uncategorized at 6:30 ఉద. by వసుంధర

1975లో విడుదలైన షోలే- హిందీ చలనచిత్రరంగంలో సృష్టించిన సంచలనం- నిన్నమొన్నటి త్రీ ఇడియట్స్ వరకూ గుర్తుండిపోయేటంత గొప్పది. జంజీర్ చిత్రంతో తారాపథం అందుకున్న అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంతో సూపర్ స్టార్‌గా స్థిరపడ్డాడు. ఈ చిత్రంలో గబ్బర్‌సింగ్ పాత్రతో తొలిసారిగా వెండితెరకు పరిచితుడైన అంజాద్‌ఖాన్- వెనువెంటనే సూపర్ విలన్ స్థానం పొందడం విశేషం. ఆ తర్వాత ఆయన ప్రతి పాత్రలోనూ తనదైన శైలిలో జీవించినా- జనం ఆయన్ను గబ్బర్‌సింగ్‌గా మాత్రమే గుర్తుంచుకుంటే అది ఆ పాత్ర గొప్పతనం. ఆయన సంగతి అటుంచితే- అప్పటికే తారాపథంలో దూసుకు వెడుతున్న హేమమాలిని కూడా ఇప్పటికీ చాలామందికి ఆ చిత్రంలో పాత్ర బసంతిగా గుర్తుండిపోవడం- కథ-మాటల రచయితలు సలీం-జావేద్‌ల ప్రతిభకు నిదర్శనం. సంవత్సరాల తరబడి విసుగూ విరామం లేకుండా జనం చూసేలా రూపొందిన ఆ చిత్రంపై హింసను ప్రబోధించి, ప్రదర్శించిందన్న ఒక అపప్రథ ఉండేది. అది అపప్రథ అనడానికి మచ్చుకో రెండు ఉదాహరణలు:
ఒక దృశ్యంలో- భుజాల చుట్టూ శాలువా కప్పుకున్న ఠాకూర్- నేలమీదున్న రివాల్వర్ తీసి అందించకపోవడంవల్ల హీరో ప్రమాదంలో పడతాడు. తప్పించుకున్నాక హీరో ఠాకూర్‌మీద మండిపడితే ఆయన ద్వారా ఫ్లాష్‌బాక్. గబ్బర్‌సింగ్ ఆయన రెండు చేతులూ నరకడానికి కత్తులు ఎత్తడం దగ్గిర ఫ్లాష్‌బాక్ ఐపోతుంది. వర్తమానంలో శాలువా ఎగిరిపడి ఠాకూర్ మొండిచేతుల్ని బయటపెడుతుంది. సినిమాలో ఇది గుండెలదిరే గొప్ప సస్పెన్సు కూడా. ఊహకే భీబత్సమనిపించే ఈ దృశ్యంలో ఒక్క రక్తపు బొట్టు కూడా చిందలేదు.
మరో దృశ్యంలో ఒక అమాయక యువకుడు ఉద్యోగంకోసం పట్నం బయల్దేరితే- గబ్బర్‌సింగ్ తన స్థావరంలో చేతిమీద పాకుతున్న చీమను దీక్షగా చూస్తూ- ఉన్నట్లుండి రెండోచేత్తో గట్టిగా అణచివేస్తాడు. తరువాతి దృశ్యంలో ఇల్లు చేరిన యువకుడి శవం. ఒక దారుణ హత్యలో రక్తపు బొట్టు మాట అటుంచి- చీమ నలగడం కూడా ఊహకే విడిచిపెట్టాడు దర్శకుడు సిప్పీ.
షోలే చిత్రం హింసాత్మకమే. మాటలు, దృశ్యాలు మహా పదునై ప్రేక్షకులను జలదరింపజేసినా- రక్తసిక్తమైన నేటి చిత్రాల్లోలా ఆ హింస జుగుప్సను కలిగించదు.
మేము వ్రాసిన క్రైమ్ సాహిత్యం ఈ పంథానే అనుసరించింది.
ఈ నేపధ్యంలో చంద్రముఖి సీరియల్‌ని పరిశీలిస్తే-
ఒక యశోధర. ఆమెకు చంద్రముఖిపై పగ. ఒక కార్తీక్. అతడికి చంద్రముఖిపై ప్రేమ. యశోధర కూతురు పూజ- కార్తీక్‌ని ప్రేమించింది.  యశోధర, పూజ- కార్తీక్, చంద్రముఖిలను వేధించడం కథాంశం. యశోధర పాత్ర ఎటువంటిదంటే- ఆమె మన దేశ ప్రధాని అయుంటే- అమెరికా, చైనాలు కూడా అవలీలగా చిత్తఏవి అనుకోవాలి.
2007లో సీదా సాదాగా, కాస్త హుందాగా కూడా ప్రారంభమైన ఈ సీరియల్- కొంతకాలంవరకూ ఆసక్తికరంగా కొనసాగింది.  సుమారు సంవత్సరంనుంచి- కాబోలు పూర్తిగా హింసాత్మకమైంది. కళ్లముందే తలలు బద్దలౌతాయి. పీకె పిసకడం, చర్మం చిట్లేలా కొట్టడం, రక్తం చిమ్మేలా కత్తిపోట్లు సర్వసాధారణం. పూజ, యశోధరవంటి నాజూకైన యువతులు కూడా నిస్సంకోచంగా నడి బజార్లో నిండు మనిషిని నిలువునా చీల్చగలరు. కొద్ది నెలలుగా ఈ సీరియల్ సమయంలో 3-10 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్ని దూరంగా ఉంచడమో- అది కుదరకపోతే సీరియల్ చూడ్డం మానేయడమో తప్పనిసరి ఔతోంది.
ఈ సీరియల్ చూస్తుంటే “అధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే” అనడానికి యశోధర ఉద్భవించినట్లు తొస్తుంది. మంచిపై చెడు సాధిస్తున్న విజయ పరంపరలను చూస్తుంటే- ఒక శాడిస్టు నడిపిస్తున్న కథలా అనిపిస్తుంది. ఎత్తుకి పైఎత్తు వేయడంలో మంచి-చెడు సమ్ఉజ్జీలౌతాయన్న ఆశ నానాటికీ అడుగంటిపోతోంది. మధ్యలో కార్తీక్ పాత్రకి కాస్త తెలివి అతికించినా- కందుకమువోలె దుర్జనుడు (సుజనుడు కాదు) పైకి రావడమే ముఖ్యాంశం. ఇదే తరహాలో కొనసాగడం- అటు సీరియల్ సాహిత్యానికీ, ఇటు ప్రేక్షకుల మానసిక ఆరోగ్యానికీ ప్రమాదకరం. కథనం జనరంజకంగా, ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా మలచబడానికి అనువైన పాత్రలున్న ఈ సీరియల్లో మున్ముందైనా సృజనాత్మకత చోటు చేసుకోగలదని ఆశిద్దాం.
ఆరంభంలో పూజ రాహుల్‌కి చెల్లి అని గుర్తు. ఇప్పుడు అక్కగా కొనసాగుతోంది. ఆరంభంలో రాహుల్ చంద్రముఖిని కూడా ఆశించాడు. అప్పుడామె అతడికంటే పెద్దదో చిన్నదో కానీ- ప్రస్తుతం అక్కగా కొనసాగుతోంది. ఆదిలో పూజ మెడిసిన్ చదువుతోంది. ఇప్పుడామె డాక్టరని తనే మర్చిపోయినట్లు తోస్తుంది. ఇలాంటివి వందలాది ఎపిసోడ్లు నడిచే సీరియల్సులో సాధారణం. ఐతే కోర్టులో objection sustained, objection overruled వంటి మాటలని- ఒకదానికి బదులు మరొకటి వాడడం- జ్ఞాపకలోపంగా కాక పరిజ్ఞానలోపంగా పరిగణించక తప్పదు. ఇక ఇటీవల మొదలైన కోర్టు దృశ్యాలు అత్యంత పేలవంగా ఉంటే ఆశ్చర్యమేముంది?
అసహజం కాకపోయినా, అర్థవంతంగా అనిపించని యశోధర పాత్రలో ప్రీతి నిగమ్ ఎంతలా జీవిస్తోందంటే- ఆమెనిప్పుడు ప్రేక్షకులు యశోధరగానే గుర్తుంచుకుంటున్నారు. ఆ పాత్రకి ఆమె సృష్టించుకుని maintain చేస్తున్న mannerisms అద్భుతం. యశోధరపై ఎత్తుకి పైఎత్తులు వేసిన చిరు సమయంలో నటుడిగా విశ్వరూపం చూపిన కార్తీక్ పాత్రధారి మిగతా భాగమంతా పేలవంగా ఉండడం- నటనకు పాత్రచిత్రణ కూడా అవసరమనిపింపజేస్తుంది. “తొణకని బెణకని వెనకడుగెరగని ధీరవనిత”గా టైటిల్ సాంగ్‌లో పరిచయం చేయబడ్డ చంద్రముఖి క్రమంగా మూర్తీభవించిన శోకదేవతగా మారిపోయి- ఇటీవల భోరుభోరున ఏడ్వడం మినహా మరేమీ చెయ్యకపోవడంతో బుల్లితెరమీద ఆమె ముఖం repulsiveగా అనిపిస్తోంది- అదామె తప్పు కాకపోయినా. చూడాలంటేనే విసుగనిపించే భగ్నప్రేమికురాలిగా సహజ నటనతో అలరించిన పూజ పాత్రధారి- కౄరత్వంలో కృతకంగా ఉంది. పాత్రచిత్రనలో కథకులు, దర్శకులు నిర్లిప్తంగా ఉన్నా- అవధులమేరకు తమతమ పాత్రలకు ప్రాణం పోస్తున్న ఇతర నటీనటుల ప్రతిభ ప్రశంసనీయం. నారాయణ పాత్రతో సీరియల్‌కి అదనపు జీవాన్నిస్తున్న చలపతిరాజు- ప్రీతి నిగమ్‌లాగే ఈ సీరియల్‌కి హైలైట్.
రుద్దబడుతున్నా, అర్థహీనమైనా జనం టీవీ సీరియల్స్ చూస్తున్నారు. వాటివల్ల ఎందరో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఉపాధి లభిస్తోంది. ఈ సీరియల్స్ నాణ్యత సామాన్య ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కథ-కథనంలో నాణ్యత పెరగడానికి అవసరమైన సృజనాత్మకతకు వాటిలో అవకాశం లభించడం అవసరం. విమర్శకులు నిర్లిప్తత వదిలి- తమ స్పందనతో ముందుకు రావాలి. ఆ లక్ష్యంతో అక్షరజాలం తన వంతు కృషి ప్రారంభించింది. నిబద్ధతతో, అర్థవంతమైన స్పందనతో- ఈ లక్ష్యసాధనకు పలువురు ముందుకు రాగలరు. ఈ సీరియల్‌లో- చంద్రముఖి త్వరలో నిజంగా ధీరవనితగా మారుతుందనీ- మంచిపై చెడు పొందే పరాజయాన్ని మేధావంతంగా చిత్రీకరించబడుతుందనీ ఆశిద్దాం.

5 వ్యాఖ్యలు »

  1. sharada said,

    తెలుగులో వస్తున్న భయానక సీరియల్స్ చాలవనో ఏమో అంతకన్నా భయంకర హిందీ సీరియల్సును కూడా డబ్ చేసి ప్రేక్షకుల నెత్తి మీద రుద్దటం ఏమంత సమంజసం? ఆ సీరియల్స్ లో వాళ్ళు కట్టే చీరలు నగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. అట్లాంటి వేషధారణ మనకు ఎబ్బెట్టుగా వుంటుందని తోచలేదా? నిద్రలేచేటప్పుడు కూడా ఏ మాత్రమూ చెక్కు చెదరని మేకప్, భారీ చీరలు, అంతకన్నా భారీనగలు చూడటానికే ఎబ్బెట్టుగా వుంటున్నయి. అంతగా కథ నచ్చితే అదే మన వాతావరణానికి అనుగుణంగా తీసి చూపిస్తే బాగుంటుంది.


Leave a Reply

%d bloggers like this: