మే 31, 2010

పాడుతా తీయగా (ఈ టీవీ)- ఏప్రిల్ 5- మే 24

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 8:16 సా. by వసుంధర

ప్రతి సోమవారం రాత్రి 9.30-10.30 వస్తున్న ఈ కార్యక్రమం తొలి 8 భాగాల గురించీ ఇంతవరకూ చర్చించాం. మిగతావి ఇక్కడ…
తొమ్మిదవ భాగం: భారతీయ చలనచిత్ర నిర్మాణంలో విశిష్ట స్థానం సంపాదించుకున్నది సురేష్ ప్రొడక్షన్స్.  ఆ సంస్థ నిర్మించిన తెలుగు చిత్రాల పాటలను- పోటీకి నిర్దేశించారు.  సురేష్ సంస్థ అధినేత డా. డి. రామానాయుడు, వారి తనయుడు వెంకటేష్ (ప్రముఖ హీరో) తెలుగువారికి సుపరిచితులు. ప్రస్తుతం సంస్థను ముందుకు నడిపిస్తున్నది రామానాయుడి పెద్ద కొడుకు సురేష్ బాబు. అపరిచితుడు కానివారిని సుపరిచితుడు చేయడానికా అన్నట్లు- మొదటివారం ముఖ్య అతిథిగా ఆయన్ను ఆహ్వానించారు. అందంలో అగ్ర హీరోలా, చందంలో అగ్రనిర్మాతలా- హుందాగా కొనసాగిన ఆయన వైఖరి వీక్షకుల్ని అలరించింది. రెండవవారం ముఖ్య అతిథులుగా వచ్చిన రామానాయుడు, వెంకటేష్- వేదికకు చక్కని అలంకారమయ్యరు. పోటీ అనంతరం ఒకరిని తప్పించగా 14గురు అభ్యర్ధులు మిగిలారు.
పదవ భాగం: సినీ సంగీతమనగానే చప్పున స్ఫురించే సంగీత దర్శకుల్లో సోదరద్వయం రాజన్-నాగేంద్రలు ఉన్నారని మాకు తోచదు. వారు ఆదిలో ఎక్కువగా విఠలాచార్య సినిమాలకు పని చేయడం- 1968 తర్వాత మేము ఉద్యోగరీత్యా భువనేశ్వర్ వెళ్లి- అక్కడే 2003వరకూ ఉండిపోవడం అందుక్కారణం కావచ్చు. ప్రస్తుతం నాగేంద్ర జీవించి లేరు. రాజన్-నాగేంద్రలు స్వరపర్చిన తెలుగు సినీ గీతాలను ఈ పోటీకి నిర్దేశించి శ్రీ రాజన్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం నిర్వాహకుల ఔచిత్యం. శాస్త్ర్రీయ సంగీతంలో నిష్ణాతులైన రాజన్ సూచనలు, సలహాలు- ఈ కార్యక్రమానికి హైలైట్ అనిపించాయి. కార్యక్రమం పూర్తయ్యేక- ఎంతగానో పరిచితమైన అంత గొప్ప పాటలను సంగీత దర్శకుడి పేరుతో ముడిపెట్టి  గుర్తుంచుకోనందుకు అపరాధభావం లాంటిది కలిగింది. మానసవీణ మధుగీతం అన్న పాట- విశ్వరూపాన్ని తెలుసుకోవడంలో- రాజన్, ఎస్పీబీ, ఖమ్మం గాయని లిప్సికల సమిష్టి కృషి ప్రశంసనీయం. కన్నడిగుడై తెలుగుతనం ఉట్టిపడే చిరస్మరణీయ సినీగీతాల్ని అందించిన రాజన్‌కి జోహార్లు. వారిని పరిచయం చేసిన ఎస్పీబీకి అభినందనలు. పోటీ అనంతరం ఒక్క అభ్యర్ధి తగ్గి 13గురు అభ్యర్ధులు మిగిలారు.
పదకొండవ భాగం: ముఖ్య అతిథి నేటి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ. పోటీకి నిర్దేశించిన పాటలు ఆయన చిత్రాలలోనివి. అభ్యర్ధుల ఎన్నికలోపమో ఏమో కానీ- పాటలు బహుళ ప్రచారం పొందినవే ఐనా- అంత గొప్పగా అనిపించకపోవడం విశేషం. యమహా నగరి పాట చాలా బాగున్నా- వరస అనుకరణ కావడంవల్ల- ప్రతిభ వ్రాసిన వేటూరిదే అనిపిస్తుంది. అచ్చ తెలుగువాడైన మణిశర్మ పాటల్లో తెలుగుతనం తక్కువ అనిపించడానికి- ఆధునిక పోకడలు కూడా కొంత కారణం కావచ్చు. అభ్యర్ధులకు ప్రయోజనకరమైన సూచనలు లభించినట్లు తోచని ఈ భాగంలో- మణిశర్మ-ఎస్పీబీల interactionలో కృత్రిమత్వం గోచరించింది. ఆశించిన సంతృప్తి లభించని ఈ భాగం ముగిసేక- 12గురు అభ్యర్ధులు మిగిలారు.
పన్నెండవ భాగం: మొదటి క్వార్టర్ ఫైనల్సుగా అభివర్ణించబడిన ఈ భాగంలో ఒకో అభ్యర్ధికి రెండేసి పాటలు పాడే అవకాశం వచ్చింది. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ ముఖ్య అతిథులు. సీనియర్, జూనియర్ ఎన్‌టీఆర్‌లతో  వారికున్న సాన్నిహిత్యమూ, అనుబంధమూ దృష్ట్యా- ఆ నటుల చిత్రాల్లోని పాటల్ని పోటీకి ఎంపిక చేసారు. మొదటివారం డా. పరుచూరి గోపాలకృష్ణ, రెండవవారం శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. మొదటి వారం సీనియర్ ఎన్‌టీఆర్ పాటలు పాడినవారు రెండవ వారం జూనియర్ ఎన్‌టీఆర్ పాటలు పాడారు. మొదటివారం జూనియర్‌వి పాడినవారు రెండవవారం సీనియర్‌వి పాడారు. గోపాలకృష్ణ కలుపుగోరుతనంతోనూ, వెంకటేశ్వరరావు మితభాషిగాగానూ- విభిన్నంగా ఉన్నా- ఇద్దరూ సినీ పరిశ్రమకు సంబంధించిన ఆసక్తికరమైన ఎన్నో విశేషాల్ని వీక్షకులతో పంచుకున్నారు. అభ్యర్ధుల్ని సమంగా ప్రభావితం చేసారు. ఐతే వేదికపై మనిషి ప్రతిభకు దైవత్వాన్ని ఆపాదిస్తూ అసాధారణంగా ప్రస్తుతించే సంప్రదాయం సినీరంగంలో సర్వసాధారణమే ఐనా- మనిషిని మనిషిగానే అంచనా వేయాలనుకునే వాస్తవ దృక్పథమున్నవారికి జీర్ణించుకోవడం కొంచెం కష్టం.  పోటీ అనంతరం 11గురు అభ్యర్ధులు మిగిలారు.
సూచన: గాయకులు పాడే ప్రతి పాటకూ- చిత్రం, సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు పేర్లను ప్రకటించి అక్షరాలలో వ్యాఖ్యగా చూపితే వీలు. ఒకోసారి మాటలు సరిగ్గా వినబడ్డంలేదు. ఆరంభంలో ఎస్పీబీ అందరికీ తెలిసిన సినీ గీతాలకు బదులు- ఓ కొత్త పాటను ఎన్నుకుని పాడితే ఆసక్తికరంగా ఉంటుంది.
అసంతృప్తి: పోటీ క్వార్టర్ ఫైనల్స్‌కి చేరుకున్నా జిల్లాకి ఒకరు అంటే వీళ్లేనా అనిపించే స్థాయిలోనే ఉన్నారు ఇంచుమించు అభ్యర్ధులందరూ. పది లక్షల రూపాయల బహుమతి వీళ్లలో ఒకరికా అనే ఇప్పటికీ అనిపిస్తోంది.
మెచ్చుకోతగ్గ విశేషం: ఔత్సాహిక గాయకులకు అందుతున్న సూచనలు, సలహాలు. సినీరంగంలో అసాధారణ ప్రజ్ఞావంతుల నేపధ్యంతో పరిచయం. నిర్వహణలో హుందాతనం.

Leave a Reply

%d bloggers like this: