జూన్ 3, 2010

నమో వెంకటేశా

Posted in వెండి తెర ముచ్చట్లు at 4:42 ఉద. by వసుంధర

ఈ సంవత్సరం జనవరి 14న విడుదలైన ఈ చిత్రాన్ని ఇటీవలే డివిడిలో చూసాము. హీరో వెంకటేష్ చిత్రమనే కాక, ప్రేక్షకుల ఆదరణ ఘనంగా లభించినట్లు వార్తల్లో చదవడంవల్ల కూడా- ఈ చిత్రంపై అభిమానం, ఆసక్తి హెచ్చుగా ఉండడం సహజం. ఇక మా అభిప్రాయాన్ని మీ ముందుంచుతున్నాం.
కథ: ఈ రోజుల్లో నిజాయితీనే నమ్ముకున్న భోళా మనిషి వెంకటరమణ (వెంకటేష్). అతడికి కోట్ల ఆస్తి లేదు కానీ కోటి విద్యలున్నాయి. ఆ విద్యల్ని ఇండియాలో కూడు పెట్టేలా చేయగల లౌక్యం లేదు కానీ, పారిస్‌లో ప్రదర్శనలకు పిలుపందుకునేలా చేయగల అదృష్టముంది. నేల విడిచి సాము చేయడు కానీ పెళ్లికి త్రిష అంతటి ఊహాసుందరికి ఫిక్సైపోయే మనస్తత్వముంది. పారిస్‌లో తటస్థపడ్డ పూజని (త్రిష) అతడు ప్రేమిస్తాడు. ఎదుటివాళ్లని బాధపెట్టి వినోదించే మనస్తత్వమున్న పారిస్‌ప్రసాద్ (బ్రహ్మానందం) అతడి ఆశకు ప్రాణం పోస్తాడు. ఆదిలో పూజ కూడా ఈ వినోదంలో పాలు పంచుకుని తనూ వెంకటరమణని ప్రేమిస్తున్నట్లు నాటకమాడి వినోదిస్తుంది. తర్వాత వెంకటరమణ ప్రేమలో సిన్సియారిటీని గుర్తించి- అప్పటికే తను అజయ్‌ని (ఆకాశ్) ప్రేమిస్తున్న విషయం చెప్పేయాలనుకుంటుంది. సినీ పరిస్థితుల ప్రభావంతో ఆమె ప్రేమ నాటకం చిత్రాంతం వరకూ కొనసాగుతుంది. మధ్యలో ఫాక్షనిస్టులు, ఓ ఫాక్షనిస్టు పెళ్లికొడుకు భద్రప్ప (సుబ్బరాజు)- పాత సారాని పాత సీసాలో పోయడానికీ, హీరోకి ఫైటింగులివ్వడానికీ సహకరిస్తారు. కథ సుఖాంతమైతే- కథ అంతమవడమే సుఖమనే తీరులో ముగుస్తుంది.
తారాగణం: చింతకాయల రవిగా రాణించిన వెంకటేశ్ పాత చింతకాయ పచ్చడిగానూ రాణిస్తే అదాయన ప్రతిభ. నటుడిగా సవాలెదురయ్యే పరిస్థితి ఈ చిత్రంలో ఆయనకే కాదు, ఏ నటుడికీ రాలేదు. త్రిష అందంగా ఉన్నా ఈ చిత్రానికి అలంకారప్రాయమని కూడా అనిపించదు. ప్రేమ నాటకం తప్పన్న సందిగ్ధం నటనలో ప్రదర్శించాల్సిన సందర్భాలు ఎదురు కాకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. “ఆకాశమంత” నటనాప్రతిభ ఉన్న త్రిషను కాసేపు ఆకాశ్ పక్కన చూపెడితే చాలునని దర్శకుడు భావించి ఉండొచ్చు. బ్రహ్మానందం పాత్ర వాస్తవికమైనదైనా- రాణించడానికి దర్శకుడికంటే నటుడి ప్రతిభకే పట్టం కట్టాలనిపిస్తుంది. ధర్మవరపు-కాశీవిశ్వనాడ్‌ల జంట- పాత్రల అవధులమించి నవ్వించగలిగారు. మాస్టర్ భరత్ పాత్ర ఇంటర్వల్ తర్వాత ఆసక్తికరమైన వినోదాన్నందిస్తుందనుకుంటే- అంతంతమాత్రమే అయింది. నటీనటుల్లో పెదవి విరిచేలా ఒక్కరూ నటించకపోవడం మెచ్చుకోతగ్గ విశేషం. విలన్ సుబ్బరాజు మిగతా ఇద్దరు హీరోలకంటే అందంగా, ఆకర్షణీయంగా అనిపించడం- పాత హిందీ సినిమాల్లో ప్రాణ్‌ని గుర్తు చేసినా- ఆయనకి నటనలో అలాంటి అవకాశం లభించలేదు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్ వరసలు వినసొంపుగా లేవు. పాటల చిత్రీకరణ కూడా డివిడిలో చూసేవారికి ఫాస్ట్ ఫార్వర్డ్ సౌకర్యమనిపించేలా ఉంది. నేపధ్య సంగీతం బాగుండే ఉంటుంది.
దర్శకత్వం: ఆరంభంలో వెంకటేశ్ in & as నమో వెంకటేశా అని చూపించారు. as వెంకటేశా అంటే ఏమో కానీ as నమో వెంకటేశా అంటే గజిబిజి. అదే గజిబిజి- చిత్రం ఆరంభంలో వినిపించిన సందేశంలోనూ ఉంది. నిజాయితీని నమ్ముకున్న ఓ భోళా మనిషి- ఈ 21వ శతాబ్దంలో ఎలా బ్రతుకుతాడో చెప్పదల్చుకున్నారట. చిత్రం చూసేక- ఎంత నిజాయితీపరుడైనా, అంతస్థుకి మించి ప్రేమించాలనీ, ఒక్కడూ నిరాయుధుడై వందమంది సాయుధుల్ని మట్టి కరిపించాలనీ- అలాంటివారికి మాత్రమే వెంకటేశుని దీవెనలుంటాయనీ తోచి నిస్పృహ కలుగుతుంది. ఇక చిత్రీకరణ- పత్రికలో రొటీన్ సీరియల్ చదువుతున్నప్పుడు- మధ్యలో బాక్సు కట్టి వేసే కార్టూన్సు, జోక్సులా ఉంది చిత్రంలో హాస్యం. మొదటి భాగం ఏదో ఉందనిపించినా- ఇంటర్వల్ ముందు రెండవభాగంపై చెప్పలేనంత ఆసక్తినీ, ఆశనీ కలిగిస్తుంది. రెండవ భాగం మాకైతే- ఆడువారి మాటలకూ అర్థాలె వేరులే చిత్రాన్ని మరోసారి చూస్తున్నామా అనిపించింది- చిత్రీకరణ అంత బలంగా లేకపోయినా.
మా మాట: మా నవల “అతడు భారతనారి”లో కొన్ని అంశాలు ఈ చిత్రంలో చోటు చేసుకోవడం విశేషం. ఐతే ఈ చిత్రం మా నవలకు ఏ మాత్రమూ అనుసరణ కాదని ముందే నొక్కి వక్కాణిస్తున్నాం. ఆ నవల్లో నారి అంటే నారాయణకి ముద్దు పేరు. బాధ్యతల బరువు మోసే చిరుద్యోగి నారి. తాహతుకి మించిన కలలు కనే అలవాటు లేని అతణ్ణి- ఓ శాడిస్టు మిత్రబృందం తమ వినోదానికి ఉపయోగించుకున్న తీరే ఆ కథ. ఒక యువతి అతడితో ప్రేమ నాటకమాడ్డం కూడా ఆ వినోదంలో భాగం. అతణ్ణి ఆకాశానికి ఎత్తేసాక- ఆ మిత్రబృందం- నారి హావభావాల్ని తల్చుకుని తల్చుకుని వినోదిస్తూంటారు. పాఠకులకి వినోదానందిస్తూనే, మనసు కలుక్కుమనిపించగల సన్నివేశాల్ని సృష్టించడంలో కృతకృత్యులమయ్యామనే మా భావన. ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకంటే- మన సినీ దర్శకులు- కథలకు, సన్నివేశాలకు- హాలీవుడ్ చిత్రాలపైనా, ఆంగ్ల నవలలపైనా ఆధారపడడంలో తప్పు లేదు కానీ- తెలుగులో వస్తున్న నవలల్ని విరివిగా చదవడం కూడా అవసరం. డీ, రెడీ చిత్రాలతో అలరించిన శ్రీను వైట్ల- సృజనాత్మక ప్రతిభలో తెలుగుతనం కలకాలం కొనసాగడానికి ఆ తరహా కృషి ప్రాధాన్యాన్ని గుర్తించాలి.
ఆశావాదం: సకుటుంబంగా చూడ్డానికి అవకాశమున్న ఈ చిత్రం తీరు ప్రశంసనీయం. కొత్తదనానికీ సృజనకీ ప్రాధాన్యాన్నిస్తే చాలు- మరి ఈ చిత్రం జట్టు గొప్పదే. ప్రేక్షకులు కలకాలం ఇలాంటివారి జట్టే ఉంటారని హమీ. ఈ చిత్రవిజయం ప్రేక్షకుల సహృదయత, సుహృద్భావం. వారి సహనాన్ని పరీక్షించవద్దని ఈ జట్టుకి మనవి.

Leave a Reply

%d bloggers like this: