జూన్ 28, 2010

పాడుతా తీయగా (ఈ టీవీ)- మే 31-జూన్ 21

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 5:27 ఉద. by వసుంధర

ప్రతి సోమవారం రాత్రి 9.30-10.30 వస్తున్న ఈ కార్యక్రమం తొలి 12 భాగాల గురించీ ఇంతవరకూ చర్చించాం. మిగతావి ఇక్కడ…
పదమూడవ భాగం: రెండవ క్వార్టర్ ఫైనల్స్‌గా అభివర్ణించబడిన రెండు విభాగాల కార్యక్రమమిది. ఈ స్పీడు యుగంలో భారతీయ శాస్త్రీయ, లలిత సంగీతానికి ప్రాధాన్యమిస్తూ మనగలగడమే కాక చెప్పుకోతగ్గ పేరూ కూడా ఆర్జించిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు కె. ఎం. రాధాక్రిష్ణన్ న్యాయనిర్ణేత. ఈ యువ సంగీత దర్శకుడు గతంలో పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని ఉండడంవల్ల- ప్రస్తుతం ఈ పోటీలో పాల్గొంటున్నవారందరికీ ప్రేరణగా- రాధాక్రిష్ణన్ సమక్షం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సముచితం.  గాయకుడిగా పోటీలో నెగ్గకపోయినా- సంగీత దర్శకుడిగా ఆయన ఎదుగుదల ఓటమి-గెలుపుల అవగాహనకూ, ఎదుగుదలకూ ఎందరికో ఆదర్శం. మొదటి విభాగంలో మగవారి పాటల్ని ఆడవారూ, ఆడవారి పాటల్ని మగవారూ పాడడం అర్థవంతమైన వింత ప్రయోగం. రెండవ విభాగాన్ని వాన పాటలకు కేటాయించడం- రాధాక్రిష్ణన్ స్వరకల్పనలో బహుళ ప్రాచుర్యం పొందిన “వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా” పాట కూడా కారణమయుండొచ్చు. న్యాయనిర్ణేతగా ఆయన ఇచ్చిన సూచనలు సూటిగా, ముక్తసరిగా, అర్థవంతంగా ఉన్నాయి. పోటీ అనంతరం ఒకరిని తప్పించగా 10మంది అభ్యర్ధులు మిగిలారు.
పదునాల్గవ భాగం: ఇది మూడవ క్వార్టర్ ఫైనల్స్. రెండు విభాగాలూ జానపద గేయాలకే కేటాయించారు. కారణం- ‘”గాజువాక పిల్ల” పాటతో తెలుగునాడులో సంచలనాన్ని సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ న్యాయనిర్ణేత కావడం అనుకోవచ్చు. ఔత్సాహిక గాయకులకూ, సంగీతకారులకూ ఓటమి-గెలుపుల అవగాహనకు పట్నాయక్ రాధాక్రిష్ణన్ కంటే ఎక్కువ ప్రేరణ అనొచ్చు. ఎందుకంటే- వీరు పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆడిషన్ దగ్గిరే ఆగిపోయిన విషయం ఆయనే చెప్పారు. పోటీల్లో ప్రతిభావంతులందరికీ అవకాశం లభించకపోవచ్చనీ, ప్రతిభావంతులు పోటీల మీదనే ఆధారపడాల్సిన అవసరం లేదనీ- ఆత్మవిశ్వాసంతో కూడిన ఆయన మాటలు, పాడుతా తీయగా ద్వారా గుర్తింపు పొందిన గాయకులకు ఆయన ఇచ్చిన అవకాశాలు నిదర్శనం. ఈ భాగంలో గాయనీ గాయకులు చక్కని పాటలు వినిపించడమే కాక పాడడంలో మునుపటికి మించిన ప్రతిభను సంతరించుకున్నట్లు తోచింది. పాడేటప్పుడు ముఖంలో నవ్వు ప్రాధాన్యతను పదేపదే గాయనీ గాయకులందరికీ వివరించిన పట్నాయక్ కార్యక్రమం చివర్లో తను పాడినప్పుడు ముఖంలో నవ్వు చూపించే అవకాశమున్న పాట ఎంచుకుంటే బాగుండుననిపించింది. పాట కూడా అయన స్థాయిలో పాడినట్లు అనిపించలేదు. ఈ కార్యక్రమం మధ్యలో సంగీత శిక్షణలేని ఔత్సాహిక గాయనీ గాయకులకు ప్రేరణ కలిగించే గొప్ప విశేషాల్ని ఎస్పీబీ తెలియబర్చారు. ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు రమేష్ నాయుడుకీ- హిందీ సినీసంగీత దర్శకుడు మదన్ మోహన్‌కీ వరుసల్లో సామ్యం తెస్తూ- ఆయన ఇద్దరికీ సంగీతశిక్షణ, స్వరజ్ఞానం లేదని చెప్పారు. తూర్పు-పడమర చిత్రంలో శివరంజని, స్వరములు ఏడైన అన్న పాటలు, మేఘసందేశం చిత్రంలో రాధికాకృష్ణా వగైరా పాటలు గుర్తొచ్చి ఆ మాటలకి ఆశ్చర్యం కలిగింది. ఎస్పీబీ ఉద్దేశ్యంలో స్వరజ్ఞానమంటే సంగీత శిక్షణ అయుండాలి. సంగీతశిక్షణ లేని సుప్రసిద్ధుల్లో ఎస్పీబీ, ఎస్. జానకి కూడా ఉన్నారని వినికిడి. మా అభిప్రాయంలో వారందరికీ స్వరజ్ఞానం సహజంగా అబ్బింది. ఇక రమేష్ నాయుడి ప్రసక్తి తెస్తూ ఎస్పీబీ- అమ్మ మాట చిత్రం లోని మాయదారి చిన్నోడు పాట రమేష్ నాయుడు తరహాది కాదన్నారు. 1950ల లోని స్వయంప్రభ కాలంనుంచీ ఆయన సంగీతాన్ని ఫాలో అవుతున్నవారికి 1970ల్లోని మసక మసక చీకటిలో (దేవుడు చేసిన మనుషులు) స్ఫురించినవారికి రమేష్ నాయుడు ఒక తరహా పాటలకే ప్రాధాన్యమివ్వలేదనిపిస్తుంది. మా అభిప్రాయంలో రమేష్ నాయుడు స్వరకల్పనలో బహుముఖ ప్రజ్ఞాశాలి. పట్నాయక్-ఎస్పీబీల అద్భుత సమ్మేళనంతో- ఈ భాగం ముగిసేక- 9గురు అభ్యర్ధులు మిగిలారు.
సూచన: గాయకులు పాడే ప్రతి పాటకూ- చిత్రం, సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు పేర్లను- వీలునుబట్టీ, మాటల సందర్భంలోనూ కాక- విధిగా ప్రకటించాలి. ఒకోసారి మాటలు సరిగ్గా వినబడ్డంలేదు కాబట్టి అక్షరాల్లో వ్యాఖ్యగా చూపితే మరింత సౌకర్యం. ఆరంభంలో ఎస్పీబీ అందరికీ తెలిసిన సినీ గీతాలకు బదులు- ఓ కొత్త పాటను ఎన్నుకుని పాడితే ఆసక్తికరంగానూ, విలక్షణంగానూ ఉంటుంది.

2 వ్యాఖ్యలు »

  1. కమల్ said,

    జానకి గారు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారండి..! ఆవిడ మేనమామగారి ఇంట్లో..

    • చిన్నప్పుడు పైడిస్వామి అనే మృదంగ విద్వాంసుడివద్ద 3 నెలలు నేర్చుకున్నారుట. అంతే! అది సంగీతశిక్షణగా పరిగణించలేం క్ద. ఈటీవీ ఝుమ్మందినాదం కార్యక్రమంలో తనకి శాస్త్రీయ సంగీతంలో తగిన శిక్షణ లేదని ఆమే అన్నారు. ఆమెకు తగిన సంగీతశిక్షణ లేదన్న ప్రసక్తి ఉన్న మరో వ్యాసానికి లింకు: http://www.dhool.com/phpBB2/viewtopic.php?t=5983. ఆమె మేనమామగారింట్లో సంగీతం నేర్చుకుందని మీరు వ్రాసింది నిజమైనా కాకపోయినా- ఆమె సహజ సంగీత ప్రతిభ నిర్వివాదాంశం. మీరందించిన సమాచారానికి ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: