Site icon వసుంధర అక్షరజాలం

ముఖాముఖీ జూన్ 30, 2010

మనం గొర్రెల మంద అని తరచుగా అనిపిస్తుంది.
నెహ్రూమీద అభిమానంతో ఆయన్ను రాజుగా భావించవచ్చు. ఇది ప్రజాస్వామ్యమే ఐనా  ఆయన వారసులకే నాయకత్వమివ్వాలనుకోవచ్చు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయి, పి,వి. నరసింహారావు, అతల్ బిహారీ వాజ్‌పాయి, మన్‌మోహన్‌సింగ్ వంటి వారిని స్మరించాలని కూడా అనుకోకుండా- రాజీవ్, సోనియా, ప్రియాంక, రాహుల్ పేర్లకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాం. పివి వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే పుస్తక సమీక్షకు లింకు ఇస్తున్నాం.
ఒకప్పుడు హాకీ మన జాతీయ క్రీడ. 1928నుంచి 1956 వరకూ ఒలింపిక్స్‌లో హాకీ స్వర్ణపతకం ఇండియా గుత్తాధిపత్యంలో ఉంది.  1960లో రజతం మాత్రమే దక్కినా 1964లో తిరిగి స్వర్ణపతకం కైవసం చేసుకున్నాం. అప్పట్నించి ఇప్పటిదాకా మరొక్కసారి మాత్రమే మనకు స్వర్ణం దక్కి ఉండొచ్చు. హాకీలో గత వైభవాన్ని పున్రుద్ధరించాలన్న ఆలోచనే మనకు లేదు. క్రికెట్ తప్ప మరో ఆటపై మన దృష్టి పడడంలేదు. చదరంగంలో విశ్వనాధన్ ఆనంద్, టెన్నిస్‌లో రామనాధన్ కృష్ణన్, షూటింగ్‌లో అభినవ్ బింద్రా, బాడ్మింటన్లో ప్రకాష్ పడుకోనే వగైరాలెందరో సాధించిన అపూర్వ విజయాలు- క్రికెట్‌లో సాధారణ ప్రతిభ పాటి గుర్తింపును ప్రజల్లో పొందలేకపోవడం గమనార్హం. ఇటీవలే బాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ సాధించిన ఘన విజయాలు ఈ సందర్భంలో ప్రస్తావించాలి. ఇరవైఏళ్ల ఈ తెలుగు బాలిక- రెండువారాల వ్యవధిలో- ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రి, సింగపూర్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్- వరుసగా నెగ్గి అపురూపమైన హ్యాట్ ట్రిక్ సాధించింది. ఈ సంవత్సరం ప్రభుత్వమామెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించినప్పుడు- ఎవరీ సైనా అనుకున్నవారున్నారు. హైదరాబాదుకు చెందిన ఆమె మాతృభాష తెలుగు కాదు కాబట్టి- ఆమెను తెలుగు బాల అనవచ్చా అన్న మీమాంసకు గురయ్యే సంకుచితాన్ని పక్కన పెట్టి- ఆమె హ్యాట్ ట్రిక్‌కి హ్యాట్సాఫ్ చెబుదాం.
ప్రజాసేవలో సంతోషముంది. ప్రజాసేవకై ఎందరో నాయకులు ధనమానప్రాణాలొడ్డి పోటీ పడడం వారి గొప్పతనమౌనో కాదో తెలియదు. ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన ఓ సీనియర్ రాజకీయ నాయకుడు ఆనందోత్సాహాలు పట్టలేక- పెద్ద వయసులో కూడా పదిమందిలో నాట్యవిన్యాసాలు చేయడం- ఆశ్చర్యానికి బదులు ఆనందాన్ని కలుగజేయాలని చాలామంది అభిప్రాయపడ్డారు. మరి ఆయన ఆనందానికి కారణం ప్రజాసేవ చేసే అవకాశమేనని నమ్మాలని కూడా మంది సూచన.
నిజమే మరి- మనం గొర్రెల మంద అని తరచుగా అనిపిస్తుంది.
మళ్లీ కలుద్దాం.
వసుంధర

Exit mobile version