జూలై 10, 2010

జర్మనీ-FIFA-2010

Posted in క్రీడారంగం at 8:31 సా. by వసుంధర

ఫుట్‌బాల్ ఆటకి ప్రపంచకప్ పోటీలు జరుగుతాయని నాకు తెలిసింది 1974లో. అప్పుడు నేను డెప్యుటేషన్ మీద జర్మనీకి వెళ్లి ముందుగా gothe institute లో జర్మన్ భాష నేర్చుకుంటున్నా. ఆ శీతల దేశాన్ని వేడెక్కించిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ (ఆది 10వదట) నాకు ఆరంభంలో అమితాశ్చర్యాన్ని కలిగించినా క్రమంగా ఆ ప్రవాహంలో పడి నేనూ వేడెక్కడం విశేషం. ఆప్పుడు రెండు జర్మనీలున్నాయి. కాపిటలిజాన్ని  అనుసరిస్తూ వైభవోపేతంగా వెలిగిపోతున్న పశ్చిమ జర్మనీలో నేనున్నాను. కమ్యూనిజాన్ని అనుసరిస్తూ తూర్పు జర్మనీ వెనుకబడిపోతోందనీ, జర్మనులందరూ స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఒక్కటై వైభవాన్ని సమంగా అనుభవించాలనీ అప్పటి పశ్చిమ జర్మన్ పౌరుల గాఢాభిలాష.  అక్కడి జనస్రవంతిలో కలిసిపోయిన నాకు పశ్చిమ జర్మనీ సాధించిన ఘన విజయాలు ఉత్సాహాన్నిచ్చేవి. బెకెన్‌బావర్ సారధ్యం, మ్యుల్లర్ అసమాన ప్రతిభ కలర్ టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారంగా చూడ్డం అప్పట్లో అపూర్వానుభవం. ఫైనల్స్‌కి చేరేలోగా ఎన్నో టీముల్ని అలవోకగా మట్టి కరిపించినా తూర్పు జర్మనీ మీద 0-1తో ఓడిపోయినప్పుడు ఆ దేశప్రజల మనస్తాపం మర్చిపోలేనిది. ఫైనల్సులో హాలండ్‌ని ఓడించి ప్రపంచకప్ కైవసం చేసుకున్న విజయోత్సాహమే వారినా సంతాపంనుంచి బయటపడేయగలిగింది.
అంతకుముందు 1954లోనూ ఆ తర్వాత 1990లోనూ పశ్చిమ జర్మనీ FIFA విజేత. చిత్రమేమిటంటే విడిపోకముందూ, విడిపోయి కలిసింతర్వాతా కూడా జర్మనీ FIFA విజేత కాలేకపోయింది. ఇప్పుడు 2010లో నేడు 3వస్థానం కోసం ఉరుగ్వేతో తలపడనుంది కాబట్టి అగ్రస్థానానికి 2014 వరకూ ఎదురు చూడక తప్పదు.
మనమిప్పుడు కొత్త శతాబ్దంలో కొత్త దశకాన్ని ప్రారంభిస్తున్నా- ఇంకా టెక్నాలజీ సహకారాన్ని తీసుకోకూడదన్న FIFA నిర్ణయం దురదృష్టకరమేమో!   దక్షిణాఫ్రికాలో జతుగుతున్న ఈ పోటీల్లో జర్మనీమీద ఇంగ్లండు కొట్టిన గోల్ ఇవ్వకపోవడం, మెక్సికోమీద అర్జెంటీనా కొట్టిన గోల్ ఇవ్వడం ఫుట్‌బాల్ పండితులు చాలాకాలం చర్చించనున్నారు. ఇక ఈ పోటీలకు వాడుతున్న Adidas Jabulani బంతి పట్ల ఆటగాళ్లు అసంతృప్తిని ప్రకటించడం- వారి అసంతృప్తిలో న్యాయముందంటూనే ఈ పోటీలకు ఆ బంతిని కొనసాగించడం కూడా వివాదాస్పద అంశం.
ఇక విడ్డూరాలకి వస్తే– జర్మనీకి సంబంధించిన అన్ని పోటీ ఫలితాలనూ ఆ దేశంలో పాల్ అనే ఓ ఆక్టపస్ ముందే చెప్పగలగడం ఓ విశేషం. సెర్బియామీద జర్మనీ ఓడిపోయినప్పుడు ఆట ఇంకా తొలి రౌండ్ల దశలోనే ఉండడంవల్ల ఆ దేశస్థులంతగా పట్టించుకోలేదు కానీ సెమీస్‌లో స్పెయిన్‌మీద ఓడినప్పుడు- జర్మన్సు స్పెయిన్‌ని క్షమించారు కానీ పాల్ మీద చంపి నరికి ఉడకబెట్టి వేయించి కూరొండుకు తినేయాలన్నంత కోపం తెచ్చుకోవడం మనమే శతాబ్దంలో ఉన్నామా అన్న అనుమానాన్ని కలిగిస్తుంది. అది చాలదన్నట్లు సింగపూర్‌లో ఓ చిలక, ఆస్ట్రేలియాలో ఓ మొసలి ఈ జ్యోతిషంలో పాల్‌తో పోటీ పడనున్నాయి. మరి టెక్నాలజీ ఉపయోగించనందుకు FIFAని తప్పు పట్టగలమా?  పాల్ జ్యోతిషం ప్రకారం జర్మనీ అతి కష్టంమీద ఉరుగ్వేని ఓడించి 3వ స్థానం దక్కించుకుంటుంది. స్పెయిన్ ఫైనల్లో నెదర్లాండ్‌ని ఓడించి  ప్రథమస్థానాన్ని దక్కించుకుంటుంది. పాల్‌తో మొసలి ఏకీభవించినా చిలక మాత్రం నెదర్లాండ్ విజేత అంటోంది.  పోటీ ఇప్పుడు జట్ల మధ్య కాదు- జ్యోతిష్కుల మధ్య!

Leave a Reply

%d bloggers like this: