జూలై 25, 2010

ముఖాముఖీ జూలై 25, 2010

Posted in ముఖాముఖీ at 6:05 ఉద. by వసుంధర

మనిషికి స్పందన అవసరం. చెడుకి పురికొల్పే స్పందనని అణచివేసే, మంచిని ప్రోత్సహించే స్పందనను ప్రోత్సహించే- ఆలోచన కూడా అవసరం.
ఆస్ట్రేలియాలో, అమెరికాలో, మరో ఇతర దేశంలోనైనా- మనవాళ్లని హింసించినా, చంపినా- జాతివివక్ష అంటూ తీవ్రంగా స్పందిస్తాం. భారతీయులుగా అది మన కనీసధర్మం. మరి భారతీయులుగా మన దేశంలో మన కనీసధర్మమేమిటి?
నా చిన్నప్పట్నించీ వింటున్నాను– భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరని. నాకు మాత్రం ఏకత్వం ఊహలోనూ, భిన్నత్వం- ఆనుక్షణమూ స్ఫురించడం చిన్నప్పట్నించీ స్వానుభవం. సాటి మనిషిని చూడగానే సాటి పౌరుడిగా కాక- మతం, కులం, భాష, యాస వగైరాలతో గుర్తించడం మనకు సర్వసాధారణం. సామాన్యుడికి- చట్టం, న్యాయం, ధర్మం, నియమం ప్రజాస్వామ్యం వగైరాలన్నీ ఎంత అందుబాటులో ఉన్నాయో- ఏకత్వమూ అంతే అందుబాటులో ఉంది. మన దేశంలో సాటిపౌరులు ఎందరో- వివక్ష కారణంగా హత్యలకూ, హింసలకూ గురౌతున్నారు. ఇతర దేశాల్లో వివక్ష గురించి మాట్ల్లాడే అర్హత మనకున్నదా?
ఒక గొప్ప ఆశయానికై పోరాడుతున్నారని నక్సలైట్లంటే మేధావి వర్గంలో సానుభూతి ఉన్నమాట నిజం. పోరాటానికి హింసా మార్గాన్నెన్నుకున్న నక్సలైట్ల్లు- తాము ప్రాణత్యాగం చేస్తూ- సామాన్యులు, సామాన్యులైన పోలీసుల చావులకు కారణభూతులౌతున్న మాట కూడా నిజం. సానుభూతి ఇరుపక్షాలపట్లా అవసరం. కానీ కొందరు మేధావుల సానుభూతి ఏకపక్షంగా ఉండడం సమంజసమా?
మనం మెచ్చిన నేత కోసమో, సినీ ప్రముఖులకోసమో- సాంఘిక జీవనానికి ప్రతిష్ఠంబన కలిగించగలం, ఆత్మత్యాగానికి కూడా సిద్ధపడగలం-  అందువల్ల సమాజానికేవిధమైన ప్రయోజనమూ లేదని తెలిసి కూడా! వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే టీవీల్లో- తలలు, కాళ్లు నరుక్కునే భయంకర దృశ్యాలు ప్రతిరోజూ వస్తుంటే- యధాలాపంగా చూసి ఊరుకుంటే- యువత, జనత రక్తపాతానికి ఉన్ముఖులు కారా? 14 ఏళ్ల అన్న 12 ఏళ్ల తమ్ముణ్ణి మొబైల్‌కోసం తల నరికేసే వార్తలకు మన ఉపేక్షాభావం కూడా ఒక కారణం కాదా?
దేశవిదేశాల్లో మనకు సాంస్కృతిక సంస్థలున్నాయి. అవి ఎన్నో మంచి పనులు చేసినా- వాటి మనుగడలో కులం, మతం వగైరాల వివక్ష ఉన్నదనడానికి ఉదాహరణలెన్నో. ఐతే వాటి ఉనికి కొందరు యశోధరలకు మనుగడనిస్తే- మన స్పందన ఎటు మొగ్గాలి? సాంస్కృతిక సంస్థలు ఉపకారానికి విచక్షణ చూపవచ్చునేమో కానీ- అవి చేసేది ఉపకారమేనన్నది కూడా నిజం.
మంచికి సానుకూలంగా, చెడుకి ప్రతికూలంగా స్పందించగలిగిననాడే ఏ జాతి ఐనా, సమస్కృతి ఐనా ప్రగతిమార్గంలో పయనించగలదు. గతం-భావి, ఇది-అది అన్న వర్గీకరణ లేకుండా ప్రయోజనమేమిటన్న అనుమానానికి తావివ్వకుండా స్పందన అలవర్చుకుందాం. అక్షరజాలం మీ స్పందనలకు వేదికగా ఉంటుంది. రామాయణంలో ఉడుత భక్తి స్వామికార్యానికి ఎంతవరకూ సహకరించిందో చెప్పలేం కానీ- ఉడుత స్వామికి కార్యం సిద్ధించిందని మాత్రం అందరికీ తెలుసు. మనదీ అదే ఆశ. అదే ఆశయం.
మళ్లీ కలుద్దాం.
వసుంధర

Leave a Reply

%d bloggers like this: