ఆగస్ట్ 3, 2010

హిమశకలం

Posted in కవితాజాలం at 3:47 ఉద. by వసుంధర

రచన: న్యాయపతి వెంకటమణి

కేతుమాల దేశంలో కూతురింట కూర్చొని
కంప్యూటర్ సాయంతో కౌముదిలో కథలు చదువుతున్నా
బావున్నావా నేస్తం అని పలకరింపు వినిపిస్తే
ఆశ్చర్యంతో అటు తలతిప్పి చూస్తే
కిటికీ దగ్గర గిరికీలు కొడుతూ కనుపించిందొక మంచు తునక
దూదిపింజల్లా తేలిన వేల వేల మంచుతునకలు
నేలతల్లిపై వాలాలని తాపత్రయపడుతుంటే
ఇది మాత్రం ఆగి ఆగి నాతో మాట్లాడాలని తపన పడుతోంది
ప్రకృతే పలకరించినట్లై పొంగిన ఆనందం ఉడిగిన చేస్టలు నాకు
అలా చూడకు నేస్తం అంటూ కొనసాగిందా హిమశకలం
కంప్యూటర్ గంతలతో విశ్వాన్నెంత దర్శిస్తావు
తలుపులు తెరుచుకొనిరా
చూపిస్తా విశ్వంలో విశ్వేశ్వర విన్యాసాలు
పిల్లగాలులు మోసే కన్నె పూలపరిమళాలు
వెచ్చని సూర్యోదయాలు చల్లని చంద్రోదయాలు
ఇంకా ఇంకా ఎన్నో కొన్నైనా అనుభవించు
ఎండలో ఎండిపో వానలో తడిసిపో చలికి గడ్డ కట్టుకుపో
భయమంటావా- మరి
నీ గుండె నీళ్ళన్నీ కార్చి కార్చి ఎప్పుడో ఎండిపోయింది
నీ మనసు మౌనంగా ఏడ్చి ఏడ్చి ఏనాడో తడిసిపోయింది
నీ తనువు వెచ్చని స్పర్శకై వేచి వేచి ఇప్పటికే గడ్డకట్టింది
ఇంకా నువ్వు భయమంటే అది ఆశ్చర్యం నాకు
ఇంతచెప్పినా నీ కర్థం కాలేదా సరే
సంకెళ్ళు తెంచుకున్ననాడు నన్ను పిలు
ఈలోగా నేనేమో
అవని తల్లి వడిని చేరి హాయిగా సేదతీరి
ఆపైన ఆవిరినై మబ్బునై వానచినుకు ధారనై
నీ చూరునుండి జారి నీ పూలకుండి  చేరి
ఓ తెల్ల గులాబిగా నీ పెరటి మొక్కనలంకరిస్తా
ప్రతి ఉదయం గతితప్పక మళ్లీ మళ్లీ నిన్ను పలకరిస్తా

1 వ్యాఖ్య »

  1. madhavaraopabbaraju said,

    శ్రీ న్యాయపతి గారికి, నమస్కారములు.

    కవితా అతి మధురంగా, అతి సుందరంగా వున్నది. ” ఆ తెల్ల గులాబీ ” ని నేనే కావాలని వుంది.

    భవదీయుడు,
    మాధవరావు.


Leave a Reply

%d bloggers like this: