ఆగస్ట్ 4, 2010

ఈటీవీ సీరియల్ “అభిషేకం”

Posted in టీవీ సీరియల్స్ at 2:21 ఉద. by వసుంధర

ఈ రోజుతో 474వ ఎపిసోడ్‌కి చేరుకుంటున్న “అభిషేకం” సీరియల్ గురించి- అక్షరజాలంలో ఆగస్టు 21, 2009న తొలిసారిగా  ప్రస్తావించాం. క్రమంగా ఈ సీరియల్ సంతరించుకున్న ప్రాధాన్యం దృష్ట్యా- ఫిబ్రవరి 23, 2010న అక్షరజాలంలో విస్తృత విశ్లేషణ అందించాం.
ఇక ప్రస్తుతానికి వస్తే– ఈ సీరియల్ కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో కొన “సాగుతోంది”.
దుర్మార్గుడైన కిరణ్– తను కూర్చున్న చెట్టుకొమ్మనే నరుక్కునేటంత పరమ మూర్ఖుడు. పబ్లిగ్గా నేరాలు, ఘోరాలు చేసాడు. పదవి లేదు, డబ్బు లేదు, ఆలోచన లేదు. అతడి ప్రత్యర్ధులకి అన్నింటితోపాటు తెలివి కూడా ఉంది. ఐనా అడుగడుగునా విజయం కిరణ్‌నే వరించడం కేవలం దర్శకుడి నిర్ణయం అనిపిస్తుంది.  ఉదాహరణకి కిరణ్ స్వాతి గురించి బయట మంచిగా చెబుతూ- ఆమె దగ్గిర మాత్రం కారుకూతలు కూస్తుంటాడు. వాటిని ఆడియో, విడియో రికార్డులు చేసి ఉపయోగించవచ్చునని- విద్యాధికురాలు, కోటీశ్వరురాలు- ఐన స్వాతికి స్పురించదు. మంచివాళ్లు ఒకే మనిషిచేత ఒకే తరహాలో పలుమార్లు మోసపోతూండడం విసుగనిపిస్తుంది. ఆ కారణంగా- అతి చెడ్డ కిరణ్, అతి మంచి స్వాతి ల నటన అతి బోర్.
ఆడవాళ్లు పెళ్లిళ్లలో చీరలు మార్చుకోవడం మామూలే. గుడికి వెళ్లిన అమ్మాయి చీర- గుడినుంచి వచ్చేటప్పటికి మారిపోయిందంటే- “అబ్బా ఈ సీరియల్ని కూడా మరీ అంత శ్రద్ధగా చూడకండి” అని నిర్మాత-దర్శకులే విసుక్కుంటారేమోననిపించేలా ఉన్నాయి ఎన్నో సన్నివేశాలు, మలుపులు. ఉదాహరణకి- సాక్ష్యాధారమైన సిడి ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు- కాపీ తీసి ఉంచుకోవాలని పొలీసు అధికారికే తోచకపోవడం.
గోడకు సున్నం అభిషేకం, పొయ్యికి గిన్నె అభిషేకం- అంటూ ఎగతాళి చేసుకునే రీతిలో ఉన్న టైటిల్ సాంగ్ వల్ల సీరియల్ ఆరంభమే అపహాస్యానికి గురౌతోంది. మారిస్తే బాగుంటుంది.
ఈ లోపాలు చెప్పేక– ఈ సీరియల్ ఎందుకు చూస్తున్నట్లూ అనుకోవచ్చు. వారానికి 6 రోజుల్లో ఐదు రోజులైనా-  ఉత్కంఠభరితంగా ఉండడం ఒక కారణం. అప్పుడప్పుడు పులకరింత కలిగేటంత గొప్ప సంభాషణలు. మూర్ఖత్వానికి పరాకాష్ఠగా సృష్టించిన రేఖ పాత్రచిత్రణలోనూ, ఆ పాత్రధారి మౌనిక నటనలోనూ అర్థవంతమైన సహజత్వం, ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు కమల్ పాత్రధారి అద్భుత నటన- మిగతా పాత్రలకు అభినందనీయంగా జీవం పోస్తున్న అనేకమంది నటీనటులు- దృశ్యాల చిత్రీకరణలో దర్శకత్వ ప్రతిభ- ప్రేక్షకులని ఈ సీరియల్ పట్ల ఆకర్షితుల్ని చేస్తూండవచ్చు. వారి ఆదరణకు న్యాయం చేకూర్చగల సత్తా ఉన్న కథ, తారాగణం, సాంకేతికబృందం- సామూహికంగా చర్చించుకుని- ఆచరణలో తమ ప్రతిభకు న్యాయం చేకూర్చడానికి తగిన శ్రద్ధ చూపాల్సి ఉంది.
ఏది ఏమైనా- ప్రతిభ ఉన్న నటీనటులకీ, సాంకేతిక నిపుణులకీ- అవకాశం, ఉపాధి కల్పిస్తున్నందుకు ఈటీవీ, దాసరి అభినందనీయులు. ఖర్చు లేకుండా రొటీన్ సినిమా కంటే మెరుగైన అనుభూతినిస్తోంది కాబట్టి మరికొంతకాలం ప్రోత్సహించతగ్గ సీరియల్ ఇది.

Leave a Reply

%d bloggers like this: