Site icon వసుంధర అక్షరజాలం

పాడుతా తీయగా (ఈ టీవీ)- (పదిహేడవ భాగం)

ప్రతి సోమవారం రాత్రి 9.30-10.30 వస్తున్న ఈ కార్యక్రమం తొలి 16 భాగాల గురించీ ఇంతవరకూ చర్చించాం.  ఇది జులై 26, ఆగస్ట్ 2 (2010) లలో వచ్చిన 17 వ భాగంపై సమీక్ష. మా లెక్క ప్రకారం ఇది ఆరవ క్వార్టర్ ఫైనల్స్. కానీ ఆరంభంలో దీన్ని ఎనిమిదవ క్వార్టర్ ఫైనల్ అన్నారు. రెండు ఎపిసోడ్ల తర్వాత ఒక అభ్యర్ధి తప్పుకోవాలి కాబట్టి- రెండూ కలిపి ఒక క్వార్టర్ ఫైనల్ అనుకోవాలి. కానీ ప్రస్తుతం లెక్కనిబట్టి రెండేసి క్వార్టర్ ఫైనల్స్ కి  ఒక అభ్యర్ధి తప్పుకుంటారనుకోవాలి.  మరి క్వార్టర్ ఫైనల్ కి నిర్వాహకులిచ్సు నిర్వచనం తెలియదు. ఈ నామకరణం ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఊరుకుంటే చాలు.

ఆ ప్రకారం 7 , 8 భాగాలు రెండింటికీ న్యాయనిర్ణేత  ఒక్కరే. వారు సామాన్యులు కారు. అంబ కటాక్షమున్న అసమాన ప్రతిభాశాలి. తల్లి భారతి కాటుక కంట-  నీరు రానివ్వని ఆదర్శ కవి. సినీ గీతాలకు సాహిత్యపు విలువలనాపాదించిన కొందరిలో ఒకడిగా వందనాలందుకుంటున్న మహానుభావుడు. ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని సముచితంగా పరిచయం చేసి వేదికపైకి ఆహ్వానించడంలో ఎస్పీబీ తీరు ఎప్పటిలాగే ప్రశంసనీయం.  పోటీకి వారి గీతాల్ని ఎన్నుకోవడంవల్ల కార్యక్రమం మరింత రసమయమైంది.  నానాటికీ మెరుగు పడుతున్న అభ్యర్ధుల పాత్ర కూడా ఆ రసమయ వాతావరణంలో గమనార్హం. పాటలతోపాటు ఎన్నో కుతూహల విశేషాలు కూడా ఈ కార్యక్రమంలో బయటపడ్డాయి.


సిరివెన్నెల అంతటివారి పదాలను పట్టుబట్టి మార్పించే చిత్రనిర్మాతల గురించి తెలిసింది. ఆ కారణంగా ప్రేక్షకుల్ని చేరలేకపోయిన- అద్భుత పదాప్రయోగా
లు స్వయానా కవి నోటనే వినే అదృష్టం కలిగింది. తన పాటల్ని కొత్త గొంతుల్లో విని పరవశించే రసహృదయాన్నీ, కవిలోని కమనీయ గాయకుణ్ణీ చూడగలగడం అసాధారణ అనుభవం. తన అమెరికా యాత్రలో- వంటి బిగువులు కనిపించేలా దుస్తులు  ధరించి- కలిసి నృత్యం చేసిన లేత ప్రాయపు అన్నాచెల్లెళ్ల ప్రసక్తి తీసుకొచ్చారు శాస్త్రి. “అలాంటి దుస్తుల్లోని పసిపాపని- మగాడి దృష్టితో కాకుండా తండ్రి దృష్టితో చూడగలవారు మీలో ఉన్నారా” అని అప్పటి ప్రేక్షకులకి ఆయన వేసిన సూటి ప్రశ్న- చర్చనీయాంశం. ఇది సంస్కారానికి సంబంధించిన విషయం కాదు. సంప్రదాయానికీ ఆధునికతకీ మధ్య నడుస్తున్న వివాదం. ఈ అంశాన్ని మరో వేదికపై చర్చిద్దాం. ప్రస్తుతానికి శ్రీ శాస్త్రిని అభినందిద్దాం.

తన గీతాల ప్రసక్తి వచ్చినప్పుడు- అహంకారానికీ అతిశయానికీ తావు లేకుండా- నిజాయితీకి లోటు రాకుండా- వినయం ఉట్టిపడేలా ఆయన స్పందించిన తీరు ఎందరికో అనుసరణీయం. ఆయన ఉనికి అటు అభ్యర్ధుల్నీ, ఇటు ప్రేక్షకుల్నీ సమంగా ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. ఎప్పటిలాగే గాయనీ గాయకుల్ని ఎస్పీబీ సమీక్షిస్తున్న తీరు అభినందనీయం. ఈ కార్యక్రమం అనంతరం ఒక అభ్యర్ధి తప్పుకోగా ఆరుగురు మిగిలారు.
ఈ కార్యక్రమం గురించి ఒక అసంతృప్తి ఉంది. 1990లలో పాడుతా తీయగా నిర్వహించినప్పుడు ఎస్పీబీ- పాడేముందు తామెన్నుకున్న పాటకు రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు పేర్లను చెప్పకపోతే
గాయనీ గాయకుల్నితప్పు పట్టేవారు.  ఈ కార్య్క్రమం మొదలై నెలలు గడిచిపోయినా- ప్రేక్షకులకు ఆ సమాచారం అందకపోవడం సమంజసం కాదు. అడపాతడపా మాటల్లో కొన్ని పాటలకు కొంత సమాచారం  అందజేసినంత మాత్రాన ఆయా కళాకారులకు న్యాయం జరుగదు.

Exit mobile version