ఆగస్ట్ 23, 2010

అందేనా ఈ చేతులకందేనా

Posted in సాహితీ సమాచారం at 5:21 ఉద. by వసుంధర

‘అందేనా ఈ చేతుల కందేనా, చందమామ ఈ కనులకు విందేనా’ అన్న పాట పూజాఫలము చిత్రం లోనిది. మాన్యులు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఏ ఉద్దేశ్యంతో ఈ పాట వ్రాసినా అది చందమామ పత్రికకూ వర్తిస్తుంది.
చందమామ ఎన్నో తరాలను ప్రభావితం చేసిన గొప్ప పిల్లల పత్రిక. అందులో ప్రారంభమైన ప్రతి శీర్షికా అందరి మెప్పునూ పొందింది. కాలానుగుణంగా కొత్త శీర్షికలు ప్రారంభమై పాత శీర్షికలు తప్పుకోవాల్సివస్తే పాఠకుల్లో పెద్దగా సంచలనం. ఇప్పటికీ దేశవిదేశాల్లోని తెలుగువారు చందమామను శ్రద్ధగా చదువుతున్నారు.  ఎప్పటికప్పుడు తమ స్పందనలను చందమామకు తెలియజేస్తున్నారు. ఏ పత్రికకైనా అలాంటి స్పందన ఎంతో ప్రయోజనకరం. చందమామ సంపాదకులు రాజశేఖరరాజు ఆ స్పందనలకు ప్రాచుర్యమిస్తున్నారు.  ప్రాధాన్యమిస్తున్నారు. అది వ్యక్తిగతంగా ప్రశంసనీయం.  పత్రిక పరంగా ప్రయోజనకరం. వారికి మా అభినందనలు.
శ్రీ రాజు- చందమామకు దేశవిదేశాలనుంఛి- స్పందనలే కాక- బేతాళ కథలతో సహా అన్ని తరహా రచనలనూ ఆహ్వానిస్తున్నారు. చందమామ రచయితల సంఖ్యను విస్తృతం చేయాలనుకుంటున్న వారి ఈ ప్రయత్నం ముదావహం, అభిలషణీయం, అభినందనీయం.
గతంలో మీకు చందమామ అపురూప పాఠకుడు  శ్రీ టార్జాన్ రాజు పరిచయం అందజేసాం. ఇటీవలే అమెరికా వాస్తవ్యులు, చందమామ అభిమాని శ్రీ చక్రవర్తి- చందమామ సంపాదకులు శ్రీ రాజశేఖర రాజుకి ఒక లేఖ వ్రాసారు. దానికి శ్రీ రాజు సవివరంగా బదులిచ్చారు. ఎన్నో విషయాలపై చందమామ గురించిన ఎన్నో సందేహాలకు ఈ రెండు ఉత్తరాలలోనూ సమాధానాలు లభిస్తాయి.

1 వ్యాఖ్య »

 1. శ్రీ వసుంధర గారికి,
  కృతజ్ఞతాంజలి.
  ముందుగా అందేనా ఈ చేతుల కందేనా వంటి హృదయంగమ పాటకు స్థానమిచ్చిన పూజాఫలం సినిమాను గుర్తుచేసినందుకు. నిజం చెప్పాలంటే.. ఈ సినిమాను అప్పుడే కాదు.. ఇప్పుడు చూసినా పిచ్చెత్తిపోతుంది నాకు. పగలే వెన్నెల పాటను, జమున, నాగేశ్వరరావు నటనను, సాలూరి రాజేశ్వరరావుగారి సంగీత ఝరిని వింటూ, చూస్తూ, కంటూ మర్చిపోగలమా.. పాతికేళ్ల క్రితం దూరదర్శన్ లో చూసినప్పుడే దీని మైకంలో పడిపోయేవాళ్లం. ఎంత మంచి సినిమాను గుర్తు చేశారు మీరు. తెలుగు సినిమా గర్వించదగిన గొప్ప సినిమాలలో ఇదీ ఒకటనుకుంటున్నాను. మనషిపై మానసిక ప్రభావాలను ఇంత గొప్పగా అప్పటివరకూ ఏ సినిమా చూపలేదేమో.

  నెల క్రితం చందమామ అపరూప పాఠకుడిని, ఇప్పుడు చక్రవర్తి గారికి చందమామకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను మీరు ప్రచురించినందుకు, ఎక్కువ మందికి వీటిని చూసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. వినమ్రపూర్వకంగా మీ దృష్టికి ఓ విషయం తీసుకువస్తున్నాను. చందమామ 60 ఏళ్ల ప్రస్థానానికి నిజమైన పునాది వేసిన పాఠకులు, అభిమానులు, రచయితల అభిప్రాయాలకు, అనుభూతులకు, స్పందనలకు స్థానం కల్పించాలని, చందమామ నిగూఢ, నిశ్సబ్ద పయనంలో ఈ మాన్యులందరికీ సముచిత గౌరవం కల్పించాలనే చిన్న కోరికతో ప్రతి పాఠకుడికి, అభిమానికి చందమామ వెబ్‌సైట్, బ్లాగులో అవకాశం ఇవ్వడం జరుగుతోంది. వారిని గౌరవించకపోతే, వారి అభిప్రాయాలను మన్నించకపోతే మనకు గౌరవం ఉండదు అనే చిన్న పాటి ఎరుకే సంవత్సర కాలంగా మమ్నల్ని నడిపిస్తోంది. ఈ చిన్న ఆకాంక్ష తప్ప చందమామ ఉద్యోగులుగా మా ఘనత ఏమీ లేదని మీరు గుర్తించ ప్రార్థన. ఈ విషయంలో మీ అందరి సహాయ సహకారాలను మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. నెలల తరబడి కథా రచయితల ఓపికకు పరీక్ష పెడుతూ కథలు ప్రచురణకు స్వీకరించారా లేదా, స్వీకరించకపోతే వెనక్కు పంపారా అనే విషయాన్ని అందజేయడంలో తీవ్రమయిన జాప్యం జరుగుతూ ఉండటం ఒక్కటే మమ్మల్ని బాగా బాధపెడుతోంది. ఈ విషయంలో ఇక్కడ అందరమూ నిస్సహాయులమే. మీ కొత్త కథల విషయంలో చందమామ ఇంకా రుణపడే ఉంది. మీరు స్వదేశం తిరిగి వచ్చాక మీతో నిత్య సంబంధాలలో ఉంటామని మాట ఇస్తున్నాను. అంతవరకు జరుగుతున్న జాప్యానికి మన్నించగలరు.
  మీ
  రాజు.


Leave a Reply

%d bloggers like this: