ఆగస్ట్ 26, 2010

పాడుతా తీయగా (ఈ టీవీ)- (పద్దెనిమిదవ భాగం)

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 3:33 ఉద. by వసుంధర

ప్రతి సోమవారం రాత్రి 9.30-10.30 వస్తున్న ఈ కార్యక్రమం తొలి 17 భాగాల గురించీ ఇంతవరకూ చర్చించాం.

ఇది ఆగస్ట్ 9, 16 (2010) లలో వచ్చిన 18 వ భాగంపై సమీక్ష.

చాలాకాలంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ఇప్పుడు ఆరుగురు అభ్యర్ధులతో సెమిఫైనల్స్  ఘట్టంలో అడుగుపెట్టింది. మొత్తం ఆరింటిలో రెండేసి సెమిఫినల్స్ కి ఒకరు చొప్పున తొలగి ఫైనల్స్ కి ముగ్గురు అభ్యర్థులు మిగులుతారు.

విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో  ఆరంభమైన ఈ కార్యక్రమంలో తొలుత విజయవాడ నగర పరిచయ వాక్యాలు రమణీయంగా అనిపించాయి. నిర్వాహకుల పరిభాషలో ఆగస్ట్  9 కార్యక్రమం తొలి సంచిక. ఆగస్ట్ 16 కార్యక్రమం మలిసంచిక. ప్రతి సంచికకూ రెండు వృత్తాలు. ఈ రెండు సంచికలకూ- ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, అసమాన సినీ సంగీత దర్శకుడు ఐన సాలూరి రాజేశ్వరరావు తనయుడు- సాలూరి కోటేశ్వరరావు ముఖ్య అతిథి. ‘కోటి’ పేరుతొ సుప్రసిద్ధులైన  ఆయన పరిచయం తనకు మాత్రమే సాధ్యమైన హృద్యమైన తీరులో చేశారు బాలు.  తొలి సంచిక మొదటి  వృత్తంలో సాలూరి రాజేశ్వరరావు పాటలు. రెండవ వృత్తంలో  కోటి, రాజ్ కోటిలు సమకూర్చిన పాటలు.  మలి సంచిక మొదటి  వృత్తంలో- అలనాటి ప్రముఖ సంగీత దర్శకులు-  ఘంటసాల, రాజేశ్వరరావు,  ఆదినారాయణరావు, దక్షిణామూర్తి,  మహదేవన్, టివి రాజు, రమేష్ నాయుడు- సమకూర్చిన పాటలు. రెండవ వృత్తంలో  మళ్ళీ కోటి, రాజ్ కోటిలు సమకూర్చిన పాటలు. ఆ ప్రకారం గాయనీ గాయకులు ఎన్నుకుని పాడిన పాటలివి.
గీత (మెదక్): పాడమని నన్నడగవలెనా, ముద్దుల జానకి పెళ్లికి ముద్దుల పల్లకి, స్వరములు ఏడైన, ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ.
మల్లిక (గుంటూరు): ఎందు దాగి ఉన్నావో బృందావిహారీ, జివ్వుమని పిల్లగాలి, ఒకసారి ఆగుమా, అంజనీ పుత్రుడా
రాజేష్ కుమార్ (అనంతపురం): నిన్న కనిపించింది, తళుకుమన్నది కులుకుల తార, ప్రతి రాత్రి వసంత రాత్రి, నా చెలియ పాదాలు
లిప్సిక (ఖమ్మం): పాడెద నీ నామమే గోపాలా, నా మనసుకేమయింది నీ మాయలో పడింది, హాయి హాయిగా ఆమని పాడె, నడక కలిసిన నవరాత్రి
మౌనిమ (తూర్పు గోదావరి): మనసున మల్లెల మాలలూగెనే, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు,  ఈనాటి ఈ హాయీ, గువ్వా  గోరింకతో
సబీహా (కడప):  నీవు రావు నిదుర రాదు, మేఘమా మరువకే, మనసు పాడింది సన్నాయి పాట, గుండెనిండా గుడిగంటలు
కార్యక్రమం మధ్యలో పదేపదే గుర్తుండిపోయే అంశాలు చాలా ఉన్నాయి:

‘కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు’ అన్న పాట పాడుతూ మౌనిమ చివర్లో ఏడ్చేసింది. అంతకు ముందు పాటకి ఆమెకి బాగా తక్కువ మార్కులు రావడం అందుకు కారణమని ప్రేక్షకులకి అనుమానం రావడం సహజం. కానీ ‘కోటి’ సమయస్ఫూర్తితో- ఆ పాట రికార్డింగు సమయంలో చివర్లో సినీ గాయని చిత్ర కూడా తన్మయత్వంతో ఏడ్చిన సందర్భం గుర్తు చేసి- గాయని ముఖంలో నవ్వు తెప్పించగలిగారు. బాలు కూడా మంచి మార్కులిచ్చి ఆ నవ్వుని మరింతసేపు నిలుపగలిగారు.

సభకు విచ్చేసిన ప్రముఖుల పరిచయం అదనపు ఆకర్షణ.

ఇక సందర్భానుసారంగా చూపిన పాటల దృశ్యాలు కనుల పండువ, వీనుల విందు. అక్కడక్కడ మధురస్వర రాజేశ్వరరావు సుగాత్రాన్ని జోడించిన రసానుభూతి. గతంలోని పాడుతా తీయగా కార్యక్రమంలో-  పలు సినీ ప్రముఖులతో రాజేశ్వరరావు వేదికమీద కనిపించిన దృశ్యాలు హృద్యం.
అప్పటితో పోల్చితే నేటి పాడుతా తీయగా కార్యక్రమం- గాయనీ గాయకుల ఎన్నిక- న్యాయనిర్ణయం- వ్యాఖ్యలు వగైరాల పరంగా అంత శ్రద్ధగా నిర్వహించబడ లేదనిపిస్తుంది.
ఉదాహరణకి-  ఆ రోజుల్లో పాటకి సంగీతం ఎక్కువ, శబ్దం తక్కువ అన్నారు బాలు. ఆ మాట కొంతవరకూ నిజమే అయినా-  శబ్దానికీ మాధుర్యానికీ అవినాభావమేర్పరచిన శంకర్ జైకిషన్ తీరుని అలనాటి ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులు కూడా ఆమోదించారు.  లయకు మాత్రమే ప్రాదాన్యమివ్వక-  పాటకు అనుగుణంగా ఉండే శంకర్ జైకిషన్, ఆర్ డి బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వగైరాల శబ్ద సంగీతాన్ని ఆనాటి సంగీతప్రియులు మెచ్చారు. ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులందరూ ఆమోదించారు. నేటి శబ్దం తీరు వేరు. అది భావాన్నీ, గీతాన్నీ, సంగీతాన్నీ మింగేస్తోంది. అది యువత అభీష్టమనలేం. వారు ఎప్పటిలాగే అన్ని రకాల పాటల్నీ సమంగా ఆదరిస్తున్నారు.  తాత్కాలిక ప్రయోజనానికి తత్కాల ప్రజ్ఞగా- అది నేటి సంగీత దర్శకుల సామర్ధ్యానికి అనుకూలం అనుకోవాలి.


ఇక మార్కులు వెయ్యడంలో ముఖ్య అతిథి పాత్ర స్పష్టం కాదు. పాట అప్పజెప్పినట్లుందని కోటి అభిప్రాయపడ్డప్పుడు- గాయనికి బాలునుంచి 80 శాతం మార్కులు వచ్చాయి.  కోటి తానైతే నూటికి నూరు మార్కులు ఇస్తానన్నప్పుడు- బాలునుంఛి కొన్ని తప్పులు ఎంచబడి- 78 శాతం మార్కులు వచ్చాయి. అలాంటి సందర్భాల్లో ప్రేక్షకులకు ఇద్దరిలో ఒకరి అంచనాపై దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అభిప్రాయ ప్రకటనకు ముందు న్యాయ నిర్ణేతలు పరస్పరం సంప్రదించుకోవడం మంచి పధ్ధతి.

అలాగే ‘జివ్వుమని పిల్లగాలి’ పాట సందర్భంగా బాలు కోటిపై ఇళయరాజా ప్రభావం ప్రస్తావన తెచ్చారు. కోటి స్పందనలో ధ్వనించిన ఇబ్బందిని  బట్టి-  ఆ విషయంలో బాలు- ప్రభావమున్నట్లు తాను సూచించకుండా- కోటిపై ఇళయరాజా ప్రభావం గురించి కోటినే చెప్పమంటే బాగుండేదనిపించింది.

ఒక సందర్భంలో కోటి- ఎంతో కష్టపడి సంగీతదర్శకులు తయారు చేసిన పాటలు కాపీ కొట్టడం ఘోరం అన్నారు. మరో సందర్భంలో ‘ప్రియరాగాలే’ పాటలో ఆర్కెస్ట్రా  బిట్స్ ఇంచుమించు యధాతథంగా ‘Deep Forest’ నుంచి సంగ్రహించానని సంతోషంగా చెప్పారు.

కోటి, బాలు ఒకరినొకరు మెచ్చుకునే కొన్ని సందర్భాలు కృతకంగా అనిపించాయి. అలాగే పోటీనుంచి తప్పుకునేవారికి తరచుగా చెప్పే- ఓటమి గురించిన ప్రోత్సాహపు మాటల్లో నవ్యత్వం లేనప్పుడు- పునరావృతం (మూస) కంటే మౌనం మెరుగు. ‘హాయిహాయిగా ఆమని పాడె’ పాటని మహమ్మద్ రఫీ ఘంటసాలలా పాడలేకపోయారనడం- ఘంటసాలపై  అభిమానాన్ని సూచిస్తుంది తప్ప- రఫీ అభిమానులకు ఆమోదం కాకపోవచ్చు. ఎవరి పద్ధతిలో వారు గొప్పగా పాడారు.

అలాగే ‘ప్రతి రాత్రి వసంత రాత్రి’ పాట పాడడానికి ఘంటసాల పడ్డ ఇబ్బంది చెప్పినప్పుడు- ఆ మహానుభావుడు ఘంటసాల ఔదార్యం గురించి చెప్పడానికి- చివరి దశలో పాటలు పాడడానికి పడిన ఇబ్బందులు తప్ప- ఇతరాలు లేవా అనిపిస్తుంది.

ఇంతవరకూ ఈ కార్యక్రమం కొనసాగిన తీరునుబట్టి- ఇది పాటల పోటీలా కాక ఔత్సాహిక గాయనీగాయకుల పాటల కచేరీలా అనిపించింది.

17  భాగాలు అధిగమించి ఇంతవరకూ వచ్చిన అభ్యర్ధులపై బాలు సూచనల ప్రభావం అంతగా ఉన్నట్లు కనిపించదు: ఉదాహరణకు లిప్సిక ‘చ’  ఉచ్ఛారణ దోషం, మైకులో మౌనిమ ఊపిరి శబ్దం. భాష రాని గాయకుల ఉచ్ఛారణ దోషం గురించిన బాలు ఆవేదన భాషాభిమానులందరిదీ. భాష వచ్చినట్లు భ్రమిస్తున్న వారి ఉచ్ఛారణ దోషాలకు టీవీల ద్వారా అలవాటు పడిపోతున్న వారికి ఈ ఉచ్ఛారణ దోషాలు తెలుస్తాయో లేదో! పాడుతా తీయగా ప్రసారం చేస్తున్న ఈటీవీ వారైనా తమ కార్యక్రమాల్లో తెలుగు  ఉచ్ఛారణ దోషాల విషయంలో మున్ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఒకొక్కరు నాలుగేసి పాటల చొప్పున పాడిన ఈ పాటల కచేరీలో అనంతరం- గాయనీ గాయకులకు లభించిన సగటు మార్కులు ఇలా ఉన్నాయి:
మౌనిమ 73.75    రాజేష్ 77.5    మల్లిక 77.25
లిప్సిక 79.25       గీత 73            సబీహా  79.౨౫
అందరికంటే తక్కువ మార్కులు వచ్చిన గీత (మెదక్) తప్పుకోగా తదుపరి సెమిఫైనల్స్ కి 5గురు అభ్యర్ధులు మిగిలారు.

ఈ కార్యక్రమం గురించి ఒక అసంతృప్తి ఉంది.

1990లలో పాడుతా తీయగా నిర్వహించినప్పుడు ఎస్పీబీ- పాడేముందు తామెన్నుకున్న పాటకు రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు పేర్లను చెప్పకపోతే గాయనీ గాయకుల్నితప్పు పట్టేవారు.  ఈ కార్య్క్రమం మొదలై నెలలు గడిచిపోయినా- ప్రేక్షకులకు ఆ సమాచారం అందకపోవడం సమంజసం కాదు. అడపాతడపా మాటల్లో కొన్ని పాటలకు కొంత సమాచారం  అందజేసినంత మాత్రాన ఆయా కళాకారులకు న్యాయం జరుగదు.

2 వ్యాఖ్యలు »

  1. Srinivas said,

    మీ పరిశీలన బావుంది.
    చాలామంది చేసే పొరబాటు మీరు కూడా చేస్తున్నారు. ఉచ్చారణకు బదులు ఉచ్ఛారణ వాడుతున్నారు. నమ్మకం కలగదు కనక ఫర్వాలేదు, నిఘంటువులో వెతకండి. 🙂

    • ముందుగా మీ పరిశీలనకు ధన్యవాదాలు. నిఘంటువులో వెదుకనవసరం లేదు. మీ ఉచ్చారణ సరైనదే. మున్ముందు మా ఉచ్చారణకు ‘ఉచ్ఛారణ దోషం’ పట్టకుండా జాగ్రత్తపడగలం.


Leave a Reply

%d bloggers like this: