ఆగస్ట్ 28, 2010

ఈ టీవీ గేమ్ షో- ‘రాజు-రాణి- జగపతి’

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 4:57 ఉద. by వసుంధర

ఈ ఆగస్ట్ 17న  ఆరంభమైన ఈ కార్యక్రమం గురించి సుమారు నెలరోజులముందు మొదలైన ప్రచారం సృజనాత్మకతకు మచ్చుగా, చాలా చాలా గొప్పగా ఉంది.  తెలుగు టివి చరిత్రలో మొట్టమొదటి సారిగా సినీ హీరోల్లో ఓ సూపర్ స్టార్- యాంకరింగ్ చేస్తారన్న ఆ ప్రచారంలో- ఆ సూపర్ స్టార్ ఎవరన్నది సస్పెన్స్.
ఆరంభంలో ఫరవాలేదనిపించి క్రమంగా మహిళలు మెచ్చిన కథానాయకుడై కొంతకాలంగా మహానటుడిగా తన ప్రతిభను ప్రదర్శిస్తున్న జగపతిబాబుని సూపర్ స్టార్ అనడం సబబు కాదని అనలేము కానీ- సూపర్ స్టార్ అనగానే చాలామందికి ఆయన పేరు స్ఫురించకపోతే ఆశ్చర్యం లేదు.  అందువల్ల ఆ సూపర్ స్టార్ జగపతి బాబు అనీ, గేమ్ షో పేరు రాజు-రాణి-జగపతి అనీ సస్పెన్స్ విడిపోగానే- ఉత్సాహం కొంత తేలిపోతేనూ ఆశ్చర్యం లేదు.
జగపతిబాబు నటనలో హుందాతనముంది.  గేమ్ షోకి ఎన్నుకున్న టైటిల్ సాంగ్ లో ఆ హుందాతనం లేదు. ప్రచారంలో ఉన్న సృజనాత్మకత- గేమ్ షో రూపకల్పనలో కనిపించదు. కూర్చిన ఆటల్లో ఆసక్తి పుట్టించే అంశాలు లేవు.
ఈ షోలో నాలుగు (దంపతుల) జంటలు పాల్గొంటాయి. నాలుగు రౌండ్లలో మొదటిది నాలుగు స్తంభాలాట. ఒకో జంటకి ఐదేసి ప్రశ్నలు. టాపిక్ లాటరీ పద్ధతిలో ఒకరికి పురాణాలు, ఒకరికి రాజకీయాలు, ఒకరికి సినిమాలు, ఒకరికి లోకజ్ఞానం. అన్ని ప్రశ్నలకీ బడులివ్వగలిగితే బహుమతి 10 లక్షలు. ఆ సంఖ్యలోంచీ ఒకో తప్పు సమాధానానికి ఒక సున్నా చొప్పున తొలగిపోతుంది. అంటే ఐదూ తప్పు చెప్పినవారికి పది రూపాయలు మాత్రమే దక్కుతుంది. ఈ రౌండ్లో అందరికంటే తక్కువ మార్కులు వచ్చిన జంట తప్పుకోగా 3 జంటలు మిగులుతాయి. తప్పుకున్న జంట ‘జూ   లకటక’ పేరిట గుళ్లబోర్డు లాటరీలో సున్నా నుంచి పదివేల రూపాయలవరకూ దక్కించుకుని వెళ్ళవచ్చు. ప్రశ్నలు ఆసక్తికరంగానే నే ఉన్నా షో ఉత్కంఠ  కలిగించదు.
మిగిలిన 3 జంటలకీ రెండవ రౌండ్ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’. ఇందులో ప్రతి జంటకూ దంపతులకు వ్యక్తిగతమైన ఐదు ప్రశ్నలు.  ఒకే ప్రశ్నకు విడివిడిగా వారిచ్చే సమాధానాలు ప్రేక్షకులకి వినోదానిస్తాయి. బహుమతి మొత్తం 20 లక్షలు. మొదటి రౌండ్ తీరులోనే అన్ని సమాధానాలూ తప్పే ఐతే దక్కేది 20 రూపాయలు.  తప్పుకున్న జంటకి జూ లకటక. ఇలాంటివి ఇదివరలో కొన్ని గేమ్ షోలలో ఇప్పటికే వచ్చి ఉండడంవల్ల ఈ రౌండ్ కి పేరులో తప్ప కొత్తదనం లేదు.
మూడవది మిగిలిన రెండు జంటలకూ 30 లక్షల రూపాయల బహుమతితో ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’.  ఇద్దరూ విడివిడిగా షాపింగుకి వెడతారు. భార్య ఎంచుకున్న మూడు వస్తువులూ భర్త ఎన్నికతోనూ, భర్త ఎంచుకున్న మూడు వస్తువులూ భార్య ఎంపికతోనూ సరిపోవాలి. తప్పు సమాధానాలకు మిగతా రౌండ్లలోలాగే బహుమతి మొత్తం తగ్గిపోతుంది, తప్పుకున్న జంటకి- జూ   లకటక.
చివరి రౌండ్ జాక్‌పాట్ ‘జంబలకిడి పంబ’. మిగిలిన ఒక్క జంటా అంతవరకూ గెల్చుకున్న మొత్తంతో తృప్తిపడి వెళ్లిపోవచ్చు. లేదా ఒకే ఒక్క ప్రశ్నకి సరైన బదులిచ్చి గెల్చుకున్న మొత్తం సంఖ్యకి ఓ సున్నా జతపర్సుకుని పది రెట్లు చేసుకోవచ్చు.  తప్పు సమాధానానికి ఓ సున్నా తగ్గి- బహుమతి మొత్తం పదోవంతుకి తగ్గిపోతుంది. ఈ రౌండ్ ఇంతవరకూ ఉత్కంఠని కలిగించలేదు.
ఒక సినీ హీరో ఇమేజ్ ని పెంచే స్థాయిలో షో రూపొందించబడలేదు. ఏ స్థాయి షోనైనా తమ చేష్టలతో మెప్పించగల యాంకర్స్ ఉండొచ్చు. జగపతిబాబు యాంకరింగ్‌లో- ప్రత్యేకత ఏమాత్రమూ అగుపించలేదు.
ప్రస్తుతానికి ఈ కార్యక్రమం పేలవంగా ఉంది. నటనలో త్వరితగతిని ఎన్నో మెట్లెక్కిన (అ)సామాన్యుడు జగపతిబాబు యాంకరింగ్  మున్ముందు ఈ గేమ్ షోని గట్టెక్కించగలదని ఆశించవచ్చు.

2 వ్యాఖ్యలు »

  1. Sravya Vattikuti said,

    ఆసలు అన్నిటికన్నా ముందు ఆ వచ్చే జంటలు కొద్ది గానన్న లోకజ్ఞానం పెంచుకు రావాలి సింపుల్ ప్రశ్నలకి కూడా చెప్పే సమాధానాలు చెప్పే మరీ దారుణం గా ఉన్నాయి .

    • మీరన్నది నిజం. బుల్లితెరపై కనిపించాలన్న తాపత్రయంలో- చాలామంది తమ పరిజ్ఞాన లోపం పదిమందికీ తెలియడాన్ని చిన్నతనంగా భావించకపోవడం దురదృష్టం.


Leave a Reply

%d bloggers like this: