సెప్టెంబర్ 7, 2010

పాడుతా తీయగా (ఈ టీవీ)- (పంతొమ్మిదవ భాగం)

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 3:16 ఉద. by వసుంధర

ప్రతి సోమవారం రాత్రి 9.30-10.30 వస్తున్న ఈ కార్యక్రమం తొలి 18 భాగాల గురించీ ఇంతవరకూ చర్చించాం.
ఇది ఆగస్ట్ 23, 30 (2010) లలో వచ్చిన 19 వ భాగంపై సమీక్ష.
ఐదుగురు అభ్యర్ధులతో ఈ మూడవ సెమిఫైనల్స్ విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో  కొనసాగింది. ఆగస్ట్  23న  తొలి సంచిక. ఆగస్ట్ 30న మలిసంచిక. ప్రతి సంచికకూ రెండు వృత్తాలు. ఈ రెండు సంచికలకూ- మౌనంగానే ఎదుగుతూ ఎదిగినకొద్దీ ఒదుగుతూ అక్షరాలతో అఖిలాంద్రుల్ని అలరిస్తున్న  ప్రముఖ సినీకవి, చంద్రబోస్ ముఖ్య అతిథి. ఎప్పటిలాగే ఆయన పరిచయం హృద్యమైన తీరులో చేశారు బాలు.  తొలి సంచిక మొదటి  వృత్తంలో 1991-2000 మధ్య కాలంలో వచ్చిన మధుర గీతాలు, మూడవ వృత్తంలో అదే కాలంలో వచ్చిన హుషారైన పాటలు.  పోటీకి గాయనీ గాయకులు ఎంపిక చేసుకున్న పాటల వివరాలు:
మౌనిమ (తూర్పు గోదావరి)- మరల తెలుపనా ప్రియా (స్వయంవరం); యమహో (జగదేకవీరుడు అతిలోకసుందరి)
రాజేష్ (అనంతపురం)- హాయి హాయి హాయి (తారకరాముడు); బంగారు కోడిపెట్ట (ఘరానా మొగుడు)
మల్లిక (గుంటూరు)- నెలరాజా ఇటు చూడరా (సూర్య ఐపియస్); చలి చంపుతున్న (క్షణక్షణం)
సబీహా (కడప)- పూసింది పూసింది పున్నాగ (సీతారామయ్యగారి మనవరాలు); సండే అననురా (గ్యాంగ్ లీడర్)
లిప్సిక (ఖమ్మం )- పలికే గోరింకా (ప్రియురాలు పిలిచింది); ఇంటిలోకి వెల్కమంటు (మేష్టారు)
ఈ సంచిక రెండవ వృత్తంలో శృతి, నాల్గవ వృత్తంలో తాళం మార్చి పాడించడం  ద్వారా- ఈ పోటీలో మూస తప్పి కొంత పస వచ్చింది. అందుకు గాయనీగాయకులు ఎంపిక చేసుకున్న పాటలివి:
మౌనిమ– మనసా తుళ్ళిపడకే; పరువం దాచగా
రాజేష్– నిగమ నిగమాంత; మామా చందమామా
మల్లిక– ఘల్లుఘల్లున; జోరుమీదున్నావు తుమ్మెదా
సబీహా– రోజావే చిన్ని రోజావే; నరుడా ఓ నరుడా
లిప్సిక– ఆకాశం ఏనాటిదో; రోజాలో లేత వన్నెలే
కొన్ని మెరుగులు: పాటకు ముందు చిత్రం, లేఖనం, సంగీతం, గాత్రం వగైరాలకు సంబందించిన  వివరాలు  చెప్పడం.  పోటీలో శృతి, తాళం కూడా అంశం కావడం.
కొన్ని మెరుపులు: 23న విజయవాడ నగర పరిచయంలో- 1921 మార్చి 31న  పింగళి వెంకయ్య తాను రూపొందించిన జాతీయ పతాకాన్ని మహాత్ముడికి అందింఛిన విశేషం,    అప్పటి అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు విచ్చేసిన ప్రముఖుల సంస్మరణ, 30న విజయవాడను వాణీనిలయం చేసిన మహామహుల ప్రస్తావన- సముచితంగా ఉన్నాయి. తొలిసంచిక ఆరంభంలో బాలు ఆలపించిన చంద్రబోస్ సినీగీతం సంగీత సాహిత్య గాన పరంగా అలరించింది. ఝుమ్మంది నాదం చిత్రంలోని ఈ పాట ‘దేశమంటే మతం కాదోయ్’ అంటూ ఆరంభమై- దేశమంటే ఏమి కాదో చెప్పడానికి సమకాలీన భారతాన్ని దృష్టాంతంగా తీసుకున్న తీరు అద్భుతం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్- అంటూ గురజాడ ముత్యాలసరంతో ముగించడం మహాద్భుతం. చంద్రబొస్ కి అభివందనాలు.
గాయనీ గాయకుల్ని మెచ్చినా, గిచ్సినా- ప్రయోజనాత్మకం. విశ్లేషణలో కొన్ని పాటల విశిష్టత వివరణ. ఉచ్చారణతో పాటు సినీ గీతాలకి స్వరం వ్రాసే అభ్యాసం ప్రాధాన్యం,  భాషరాని గాయనీగాయకుల ప్రస్తావన.  ఇరగదీయడం, గొట్టం, తొక్క వంటి పదాల ప్రాశస్త్యం నేపధ్యంలో కళాతపస్వి ‘అర్థం చేసుకోరూ’, ‘అట్టా సూడమాకయ్యా’ ల సదృశ్యం.  విశ్వనాథ్ కి అభివందనాలు.
స్వోత్కర్షలా  అనిపించే కొన్ని నిజాలను బాలు నిస్సంకోచంగా చెప్పడం అభినందనీయం. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు పెండ్యాల  నాగేశ్వరరావు ‘ఇండస్ట్రీ నీకెంతో ఋణపడి ఉంటుందని’ బాలు గురించి అన్నమాట అక్షరసత్యమనడంలో తెలుగువారందరిదీ  ఏకగ్రీవం. బాలు కి అభివందనాలు. ఈ తరహా మరిన్ని విశేషాలకి ఈ కార్యక్రమంలో చోటు కల్పిస్తే అభిమానులకు  మనోరంజనం, ఔత్సాహికులకు ప్రయోజనం.
సభకు విచ్చేసిన ప్రముఖుల పరిచయం అదనపు ఆకర్షణ.
సందర్భానుసారంగా చూపిన పాటల దృశ్యాలు కనుల పండువ, వీనుల విందు.
కొన్ని చమక్కులు: ‘నాకంటే అదనపు సంగతి వేశావ్’,  ‘నా లావుకి రెడీమేడ్ బట్టలు దొరకవు- కానీ విదేశీయుల పక్కన అమితాబ్ బచ్చన్ లా ఉంటాను’, ‘మనమిద్దరం ఒకే పడవలో పయనిస్తున్నాం. ఇద్దరమూ లావే’, రహస్య సంగీతాలాపన, కీరవాణి ‘బంగారు కోడిపెట్ట’ కీర్తన.
కొంత పరిజ్ఞానం: మలయాళంలో న 3 రకాలుగా ఉంటుంది.  క్షణక్షణం చిత్రంలో శ్రావణ వీణా పాటలో  జుంబారే జుజుంబరే’ పదోచ్చారణ చేసిన వ్యక్తి  ఎవరు?  పోటీలో పాటలు వ్రాతప్రతి చూడకుండా పాడితే సంతోషం. చూసి పాడితే మార్కు లు తగ్గవు.

కొన్ని సంకటాలు: వందేమాతరం శ్రీనివాసరావు సంగీతం సమకూర్చిన పాటల్లో- తనకి బాగా నచ్చిన రెండింటిలో  మరల తెలుపనా- ఒకటన్నారు బాలు. దానికీ  పాత పాట ‘ఎంత ఘాటు ప్రేమయో’ కీ ఉన్న దగ్గిర పోలిక ఎత్తి చూపారు.  అంటే ఇష్టానికి అదే కారణమనుకోవాలా?
‘బంగారు కోడిపెట్ట’ వ్రాసిన భువనచంద్ర  ‘మరల తెలుపనా’ వ్రాయడం ఆయన వైవిధ్యానికి మచ్చుగా చెప్పారు చంద్రబొస్. ఐతే ఎందరో సినీకవులకి అది సామాన్యం. మచ్చుకి వేటూరి, ఆరుద్ర, స్వయానా చంద్రబొస్. భువనచంద్ర ప్రత్యేకతకు సాహిత్యపరంగా విశిష్టతను చెప్పాల్సిందేమో.
మాయాబజార్లో పింగళి వీరతాడు అన్న రాక్షస సమాసాన్ని ప్రయోగించారు. తెరమీద వాడింది రాక్షసులే కావడం అందులో చమత్కారం. కానీ చంద్రబొస్ ‘అథర కాగితం’ అన్న రాక్షస సమాసం వాడారట. పెదవి కాగితం అంటే సొగసుగా కూడా ఉండేదని స్వాభిప్రాయం. ఆ పదం వాడాలని వాడారా, లేక గూడార్థముందా?
సభకు కళాతపస్వి రాక అదృష్టమని ప్రత్యేకంగా చెప్పారు బాలు. సువర్ణభూమి డెవలపర్స్ సమర్పిస్తున్న కార్యక్రమమిది. ఆ సంస్థకు ప్రచారకులు విశ్వనాథ్. ఆయన రాకకు ప్రత్యేకత  ఉన్నదని మాకు తోచలేదు. అలాగే తాను తీసే చిత్రాలు ముగ్గురికోసమేననడానికి వివరణ ఇస్తూ- ‘ఆ ముగ్గురూ నిర్మాత, ప్రేక్షకుడు, కొనుగోలు చేసినవాడు’ అన్నారు విశ్వనాథ్. ఆ ముగ్గురికోసం తీయడమే సర్వసాధారణం కదా- ఆయన ప్రత్యేకంగా చెప్పడంలో అంతరార్థం?
ఎన్నో విదేశీ స్వదేశీ పాటల్ని యధాతథంగా తెలుగులో అనుసరిస్తున్నాం. అంటే ట్యూనుకి పాట వ్రాయడం తెలుగు సినీ కవులకి సాధారణం. ‘ఇంటిలోకి వెల్కమంటు’ పాటని ట్యూనుకి వ్రాయడం ప్రత్యేకంగా మెచ్చాల్సిన అంశమా?
వేదికమీద ఉన్న వ్యక్తులు ఉత్తమ మధ్యమ పురుష స్తోత్రాలకంటే ప్రథమ పురుష స్తోత్రాలకు ప్రాధాన్యమివ్వడం మెరుగేమో!
గాయనీగాయకులు ఏ  దశలోనూ జిల్లాకి ఒక్కరు అనిపించే స్థాయిలో లేరు. మద్యపానంలాంటి  కొత్త పాటల్లో తూలుతూ రాణించినా- నిత్యవసంతాలనతగ్గ పాత పాటల్లో తేలిపోయారు. మున్ముందు పోటీల్లో ఎంపిక విషయంలో మరింత శ్రద్ధ అవసరమేమో!

18  భాగాలు అధిగమించి ఇంతవరకూ వచ్చిన అభ్యర్ధులపై బాలు సూచనల ప్రభావం అంతగా ఉన్నట్లు కనిపించదు: లిప్సిక ‘చ’  ఉచ్చారణ దోషం, మైకులో మౌనిమ ఊపిరి శబ్దం కొనసాగుతున్నాయి.

ఫలితం: చివరగా గాయనీ గాయకులకు లభించిన సగటు మార్కులు ఇలా ఉన్నాయి:
మౌనిమ 70.75    రాజేష్ 80.25    మల్లిక 86.75
లిప్సిక 89.5          సబీహా  82.0
అందరికంటే తక్కువ మార్కులు వచ్చిన మౌనిమ (తూర్పు గోదావరి) తప్పుకోగా తదుపరి సెమిఫైనల్స్ కి 4గురు అభ్యర్ధులు మిగిలారు.

1 వ్యాఖ్య »

  1. bonagiri said,

    టి వీ లో చూస్తుంటే ఈ కార్యక్రమం విజయవాడలో జరిగినట్లు అనిపించలేదు.
    స్టూడియోలో తీసి మిక్స్ చేసినట్లు ఉంది.
    మీ అభిప్రాయం ఏమిటి?
    ఎవరైనా విజయవాడలో హాజరయినవాళ్ళు confirm చేస్తారా?


Leave a Reply

%d bloggers like this: