సెప్టెంబర్ 10, 2010

నయాగరా జలపాతం

Posted in కవితాజాలం at 1:07 ఉద. by వసుంధర

రచన: న్యాయపతి వెంకటమణి

అది జలపాతమా
ఆదిశేషుని వేయి పడగల హుంకారమా
కవులకందని కథనకుతూహల కదనమా
పొరపాటున నిటలాక్షుని జటవీడిన గంగ వీరంగమా
నిశ్శబ్దంలో నిదురించిన శబ్దతరంగమా
వేయి నదుల ఝర్ఝరీ తరంగ విస్ఫులింగమా
కోటి మృదంగముల మేటి నాదమా
జంబూద్వీప  జనిత  ఘోషారావమా
రాగద్వేషా జ్వలిత కోలాహలమా
తరంగవిహీన  హృదయాంతరంగమా
విరించి సతి మీటిన విపంచి నాదమా
ఊహకందని ఉత్తేజం
భాషకందని భావోద్వేగం
ధ్వని నిండిన మౌనభాష్యం
శబ్ధంలో నిశ్శబ్ధం
వడిలో వరవడి
తుంపరల తూణీరాలు
తనువుకు మృదురాలు
మనసుకు మధురాలు
నయనాలకు  నయగారాలు
తపోదీక్షకు అనుకూలాలు
నిలచి నిలచి చూస్తే దృష్టికి ఝరి నీలాలు
తరచి తరచి ఆలోచిస్తే మిధ్యా సృష్టికి మూలాలు

Leave a Reply

%d bloggers like this: