సెప్టెంబర్ 21, 2010

ఈటీవీ గేమ్ షోలు- ఒక పరిశీలన

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 3:21 ఉద. by వసుంధర

ప్రేక్షకులకు వినోదాన్నందించడానికి గేమ్ షోల ద్వారా  ఈ టీవీ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. మాకు పరిచయమున్న కొన్నింటినిక్కడ పరిశీలిద్దాం.
ఢీ: ఒకప్పడు మనచే దొమ్మరాటగా నిరసించబడ్డ విద్యకు పాశ్చాత్యులు జిమ్నాస్టిక్స్ పేరిట ఒలింపిక్ గౌరవమిచ్చారు. మైకేల్ జాక్సన్ దాన్ని నాట్యంగా  మలచాడు. ఇప్పుడు మనకూ అది నాట్యమైంది. ఆ తరహా నాట్య ప్రదర్శనకు ప్రాముఖ్యమిచ్చే గేమ్ షో డీ. ఉదయభాను యాంకరింగ్, సినీ నాట్య ప్రముఖుల న్యాయనిర్ణయాలు, షోని రక్తి కట్టించే డ్రామా-సెంటిమెంటు సమకూర్చడంలో చాతుర్యం- ఈ షోని అగ్రస్థానంలో నిలబెట్టాయి. పోటీలో పాల్గొంటున్నవారి అసమాన ప్రతిభ కూడా ఈ షో విలువను పెంచింది. కొన్ని లాస్యాలు- చూసినా నమ్మశక్యం కాని అద్భుతాలు. నేటి నాట్యప్రియులకిది రసవత్తరం.
కామెడీ గాంగ్: ఎవిఎస్ వంటి అగ్రశ్రేణి హాస్యనటుడి నిర్వహణలో నడిచిన ఈ కార్యక్రమంలో కొండవలసవంటి ప్రతిభావంతులు పోటీ పడ్డారు. హాస్యపరంగా నటీనటులకు  కొదవ లేకపోయినా- ప్రహసనాల సృజనాత్మకత కొరత లోపం కారణంగా ఈ కార్యక్రమం నవ్వించలేక నవ్వులపాలైంది.
ఝుమ్మంది నాదం: సినీ సంగీత ప్రముఖులను పరిచయం చేయాలనుకున్న ఆశయం మంచిదైనా- సమయస్ఫూర్తి, సంభాషణాచాతుర్యం, వైవిధ్యం ఉన్న యాంకర్‌ని ఎన్నుకుని ఉంటే షో రసమయమయ్యేది. సునీత యాంకర్‌గా కాక యాంకర్‌కీ అతిథికీ మధ్యవర్తిగా ఉంటే అద్భుతమైన ఆమె గొంతు షోకి అదనపు అలంకారమయ్యేది.
స్టార్ మహిళ: వారానికి 6 రోజులు వచ్చే ఈ కార్యక్రమం ఎప్పుడు ఎక్కణ్ణించి చూసినా విసుగనిపించదు. అప్పుడప్పుడు మాత్రమే  పేరున్నవారు పాల్గొనే ఈ కార్యక్రమంలో సరదా నింపుతున్నది సాధారణ మహిళలే. 600 షోలు దాటిపోయిన ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపొందిస్తున్నవారు అభినందనీయులు. యాంకర్ సుమ ప్రతిభకు ఈ షో ఒక మచ్చుతునక.
వావ్: యాంకర్‌గా సాయికుమార్‌ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఈ షో ఇప్పుడు వారానికి రెండు రోజులకు బదులు ఒక రోజే వస్తోంది. షోలో ఒళ్లంత థ్రిల్లింత, వదల బొమ్మాళీ వదల విభాగాలు పేలవంగా తయారయ్యాయి. ప్రస్తుతం ఈ షో సాయికుమార్‌పై కాక- పాల్గొనేవారి పేరు ప్రతిష్ఠలపై  ఆధారపడి నడుస్తోంది. రూపకర్తలు మార్పులు తీసుకురాకపోతే- కార్యక్రమం మూతబడొచ్చు.
యమహో: సూపర్-డూప్‌ర్ గా ప్రారంభమైనప్పుడు రికార్డింగ్ డాన్సులు ఆసక్తికరంగా అనిపించాయి. పరిచయాల్లో పాల్గొన్నవారి తక్కువతనాన్ని ఎత్తిచూపినట్లు అనిపించి మనసు చివుక్కుమనేది.  అభినయకృష్ణ యాంకరింగ్ ప్రత్యేక ఆకర్షణ. అదే షో మహా మహా మాస్ గా మళ్లీ మొదలైనప్పుడు ఆ లోపం సవరించబడింది. మురళీమొహన్, అభినయశ్రీల న్యాయనిర్ణయం- అభినయకృష్ణ, అలేఖ్యల యాంకరింగ్- ఆసక్తిని బ్రతికించాయి. పాల్గొన్నవారిలో ప్రతిభ ఆశ్చర్యాన్ని కలిగించేలా షోని రక్తి కట్టించినా.- రికార్డింగు డాన్సుల్ని పదేపదే చూడ్డం కష్టమనిపించింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మొదలైన కొత్త షో యమహో. అభినయకృష్ణ, మురళీమొహన్, అభినయశ్రీ లు తమతమ స్థానాల్లో కొనసాగుతున్నారు. రికార్డింగు డాన్సులు తరచుగా చూడగలవారికి ఇది ఆసక్తికరంగా ఉండగలదని భావిస్తున్నాం.
సై ఆట: ఎందరో కొత్త గాయనీగాయకుల్ని పరిచయం చేసినందుకు ఈ షోకి ధన్యవాదాలు. షో రూపకల్పన, యాంకరింగు- మొదట్నించీ అసంతృప్తికరంగా అనిపించింది.  ప్రస్తుతం ఈ షో రావడం లేదు.
రాజు-రాణి-జగపతి: సై ఆట స్థానంలో మొదలైన ఈ షో ఆ స్థాయిలోనే ఉంది. జగపతిబాబు మీద అభిమానం కూడా ఈ షో పట్ల ఆసక్తిని పుట్టించడం లేదు.
ఈటివి@15: ఈటివి 16వ జన్మదిన సందర్భంగా సమర్ధవంతంగా రూపొందించబడిన ఈ కార్యక్రమం- ఈటివి ప్రస్థానాన్ని ప్రముఖుల నోట వినిపించింది. పాటలు, వినోద కార్యక్రమాలు ఉత్తమ స్థాయిలో ఉన్నాయి. ఝాన్సీ, సుమల జంట యాంకరింగు- కార్యక్రమానికి అదనపు ఆకర్షణ. ప్రతి ఒక్కరూ చూడతగ్గ ఈ కార్యక్రమం ఆగస్ట్ 27న వచ్చింది. మళ్లీ మళ్లీ వచ్చే అవకాశముంది.

5 వ్యాఖ్యలు »

  1. satyaji said,

    stanika paalana patrika deepaavali kathala poti prakatinchindani mitrula dwaaraa telisindi. last date : 01 october.
    meeku a vivaraalu elaa pampali. (email?)

    • ముందుగా మీకు ధన్యవాదాలు. వివరాలు లేఖినిలో టైపు చేసి vasumdhara@gmail.comకి పంపండి.


Leave a Reply

%d bloggers like this: