సెప్టెంబర్ 26, 2010

పాడుతా తీయగా (ఈ టీవీ)- సెప్టెంబర్ 6-20, 2010

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 12:39 ఉద. by వసుంధర

ప్రతి సోమవారం రాత్రి 9.30-10.30 వస్తున్న ఈ కార్యక్రమం తొలి 19 భాగాల గురించీ ఇంతవరకూ చర్చించాం. ఇది సెప్టెంబర్ 6, 13, 20 (2010) లలో వచ్చిన భాగాలపై సమీక్ష.
నలుగురు అభ్యర్ధులతో చివరి సెమిఫైనల్స్ తొలి, మలి సంచికలు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో  సెప్టెంబర్ 6, 13లలో కొనసాగాయి.  ప్రతి సంచికకూ మూడు వృత్తాలు. ఈ రెండు సంచికలకూ- మంచి కాఫీ లాంటి “ఆనంద్”నీ, ఉప్పొంగే “గోదావరి”నీ , మరపురాని “హాపీ డేస్”నీ, ఆదర్శప్రాయమైన “లీడర్”నీ- మంచి అభిరుచినీ ఉత్తమ సంస్కారాన్నీ కలగలిపి, పాత తరం మెచ్చేలా కొత్త తరానికి నచ్చేలా అందజేసిన ప్రముఖ సినీదర్శకుడు శేఖర్ కమ్ముల  ముఖ్య అతిథి.
సెప్టెంబర్ 6న తొలి సంచిక ఆరంభంలో- ఆయన చిత్రంలోని “ఉప్పొంగెలే గోదావరి” పాటను శ్రోతలు ఉప్పొంగేలా గానంచేసి- అనంతరం సముచితంగా తనదైన తీరులో ఆయనను  పరిచయం చేశారు బాలు.  తొలి సంచిక మొదటి  వృత్తంలో 1991-2000 మధ్య కాలంలో వచ్చిన మధుర గీతాల ఆలాపనకు గాయనీ గాయకులు ఎంపిక చేసుకున్న పాటలివి.
సబీహా (కడప)- నువ్వక్కడుంటే నేనిక్కడుంటే  (గోపి గోపిక గోదావరి)
లిప్సిక (ఖమ్మం )- కొంటెచూపుతో (అనంతపురం 1986)
రాజేష్ (అనంతపురం)- ఈ పాదం పుణ్యపాదం (శ్రీ మంజునాథ)
మల్లిక (గుంటూరు)- మనసావాచా  (గోదావరి)
రెండవ వృత్తంలో యుగళాల ఆలాపనకు గాయనీగాయకులు ఎంపిక చేసుకున్న పాటలివి:
లిప్సిక & సబీహా: వినుడు వినుడు రామాయణ గాధ (లవకుశ)
రాజేష్ & మల్లికా: భద్రాచలం కొండ (గ్యాంగ్ లీడర్)
మూడవ వృత్తంలో- గాయనీగాయకులు పాడుతూండగా- పల్లవి అనంతరం వాద్యం నిశ్శబ్దమౌతుంది. ఐనా  అదే శృతిలో పాట కొనసాగించి తిరిగి వాద్యబృందంతో కలవగలగడం పరీక్ష. అందుకు గాయనీగాయకులు ఎంపిక చేసుకున్న పాటలివి:
సబీహా- తలచి తలచి చూస్తే (76 బృందావన్ కాలనీ)
లిప్సిక- ఒక్కసారి చెప్పలేవా (నువ్వు నాకు నచ్చావ్)
రాజేష్- ఆలయాన వెలసిన (దేవత)
మల్లిక- ఇది మల్లెల వేళయనీ (సుఖదు:ఖాలు)
సెప్టెంబర్ 13న మలిసంచిక మొదటి వృత్తంలో 1991-2000 మధ్య కాలంలో వచ్చిన హుషారైన పాటలుగా  పోటీకి గాయనీ గాయకులు ఎంపిక చేసుకున్న పాటల వివరాలు:
మల్లిక: పిలిచినా రానంటావా (అతడు)
లిప్సిక: మిలమిల (సూపర్)
రాజేష్: సరిగమపదనిసా (జల్సా)
సబీహా: లంచికొస్తావా (అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి)
రెండవ వృత్తంలో యుగళాల ఆలాపనకు గాయనీగాయకులు ఎంపిక చేసుకున్న పాటలివి:
మల్లిక & లిప్సిక: స్వాగతం సుస్వాగతం (శ్రీకృష్ణపాండవీయం)
రాజేష్ & సబీహా: రా రమ్మని రారా రమ్మని (ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు)
మూడవ వృత్తంలో పరీక్షకు- తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైన పద్యాల ఆలాపన.  అందుకు గాయనీగాయకులు ఎంపిక చేసుకున్నవివి:
మల్లిక: మందార మకరంద (భక్తప్రహ్లాద)
లిప్సిక: అపరాధ దూషితయైన (లవకుశ)
రాజేష్: జెండాపై కపిరాజు, సంతోషంబున సంధి సేయుదురె   (శ్రీకృష్ణసత్య)
సబీహా: జవనాశ్వంబిది (లవకుశ)
విజయవాడ గురించి: ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నారు శ్రీశ్రీ మనుషులమధ్య అంతరాలను చూసి నిరాశా నిస్పృహలతో. కానీ ఆయన శతజయంతిని జరుపుకునే ఆశావాదంలోనే జాతికి పురోగతి. పాడుతా తీయగా పేరిట బాలు విజయవాడ గురించి ఎంత చెప్పినా కొత్త విశేషాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈసారి నాటకరంగం, సాహితీక్షేత్రం, ఆకాశవాణి వగైరాలలో ఈ నగర ప్రాశస్త్యాన్ని తెలుసుకుందుకు బాలు ఎన్నో వివరాలిచ్చారు. తెలుగునాట మొదటి సినిమా థియేటర్ (మారుతి) ఈ నగరానిదట. ఆముక్తమాల్యద ఈ నగరాన్ని విజయవాటికగా ప్రస్తావించిందట. మన చరిత్ర మనకు గర్వకారణమే.
కొన్ని మెరుగులు: లిప్సికకు ఊపిరి అదుపు మెరుగైందిట. అది ఈ పోటీకి ఓ విజయంగా భావించాలి. పోటీలో పద్యాలు కూడా అంశం కావడం.
కొన్ని మెరుపులు: బాలు గాయనీ గాయకుల్ని మెచ్చినా, గిచ్సినా- ప్రయోజనాత్మకం. విశ్లేషణలో కొన్ని పాటల విశిష్టత వివరణ. ఇళయరాజాను అభిమానించే వంశీ తన చిత్రాలలో ఆయన ఒరవడికి ప్రాదాన్యమిస్తారట. గోపి గోపిక గోదావరి చిత్రంలో చక్రి పాట ఇళయరాజా పాటను పోలి ఉండడానికి అదే కారణం.  నేనిక్కడుంటే అనడానికి నేనెక్కడుంటే  అనడం, ఈ వేళ కు దీర్ఘం తీయడం (ఒరిజినల్లోనే)- కవి హృదయానికి అన్యాయమని ఎత్తి చూపడం సబబు. కొంటె చూపుతో-  అన్న పాటకూ ఘంటసాల “శేషశైలావాస” కూ రాగం ఒక్కటే కావడం సంగీతపు లోతులు తెలిపే గొప్ప విశేషం. మనసా వాచా (గోదావరి) పాటకి స్వరమూలం “వైష్ణవజనతో”. తెలుగు పద్యాలు పాడడానికి ప్రత్యేక శ్రద్ధ ఎందుకు కావాలో చెప్పడానికి బాలు పాడి వినిపించడం- శ్రోతలకు మనోరంజకం, ఔత్సాహికులకు ప్రయోజకం. 1960లకే మరుగుపడుతున్న నాటకరంగంలోని పద్యాల్ని నేటి యువతరం ప్రతినిధి శేఖర్ కమ్ముల ప్రత్యేకంగా అభిమానించడం ముదావహం. నాటి షణ్ముఖి ఆంజనేయరాజు పద్యాన్ని వినిపించడం, ఘంటసాల “కురువృద్ధుల్” పద్యంతోపాటే పుష్పవిలాపమూ వినిపించడం,  కొన్ని పాటలకూ పద్యాలకూ నాటి ఎన్టీఆర్ అభినయ దృశ్యాల్ని చూపడం అపూర్వానుభూతి.  బాలుకి అభివందనాలు.
స్వోత్కర్షలా  అనిపించే కొన్ని నిజాలను బాలు నిస్సంకోచంగా చెప్పడం అభినందనీయమే కాదు, అవసరం కూడా. బాలు- నీపాదం పుణ్యపాదం- పాట పాడుతున్నప్పుడు పక్కనే ఉన్న ఎస్. జానకి- సంగీత జ్ఞానమెంత ఉన్నా ఆయనకులా మనసుపెట్టి పాడగలవారు అరుదు అన్నారట. బాలు పాడిన ఎన్నో పాటలు అందుకు సాక్ష్యం. ఈ సందర్భంగా బాలు ”మనసా వాచా” అన్న పాటకు తానైతే ఎక్కువ న్యాయం చేసి ఉండేవాడిననడం ఆయన అహంకారం కాదు. సినీ ప్రముఖులకు సంగీతప్రియుల మనవి. గోదావరి సినిమాలో ఆ పాట ప్రేమ గీతంలా కాక రోదన (గీతం కాదు) లా కనీసం మాకు అనిపించింది.  చేరుకున్న స్థాయి ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని ధైర్యంగా ప్రదర్శించిన బాలుకి మరోసారి అభివందనాలు. ఇంకా సభకు విచ్చేసిన ప్రముఖుల పరిచయం అదనపు ఆకర్షణ.
విజయవాడలో ఈ కార్యక్రమ నిర్వహణ జయప్రదం కావడానికి కారకుల్లో ముఖ్యుడైన  కృష్ణాజీని ప్రత్యేకంగా సభాముఖంగా పరిచయం చేయడం అభినందనీయం.
సందర్భానుసారంగా చూపిన సినీ సన్నివేశాలు, పాటల దృశ్యాలు కనుల పండువ, వీనుల విందు.
కొన్ని చమక్కులు: “ఈ పాదం పుణ్యపాదం- అన్న పాట- నా పాదాన్ని చూస్తూ పాడా- అదే పుణ్యపాదమైనట్లు”.  “మైక్రోఫోన్ ని గట్టిగా నలిపేస్తే దువ్వెనలా కాగలదు. శేఖర్ కమ్ములలా లావుగా ఉన్నది- నా అంత సన్నగా ఐపోగలదు”
కొంత పరిజ్ఞానం: ఉచ్చారణ దోషాలు వగైరాలు ఎత్తి చూపడమే కాదు, మార్కులు వేసినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది. .
కొన్ని సంకటాలు: సూపర్ లో పాటకు స్పందిస్తూ పదాల్ని భాష అర్థం కాని విధంగా పాడే పద్ధతిని నిరసిస్తూ వాపోయారు బాలు. కానీ 1970ల దాకా పాట విని స్క్రిప్టు రాసుకోవడం కష్టమన్న భావన డబ్బింగు పాటలకే పరిమితం. వాటిని ఒరిజినల్ తెలుగు చిత్రాలకు విస్తరింపజేసింది బాలు గారేనన్న విమర్శా ఉంది. అది యువత ఆమోదించారాణి సరిపెట్టుకున్నప్పుడు-  మిలమిలమిలమిల పాట మిలమిలల్ని నేటి అభిరుచిగా భావించి సహించక తప్పదు.  ఇంతకీ ఆ పాట మాకు వినడానికి వైవిధ్యంగా పోటీ నియమాలకు అనుగుణంగా బాగానే అనిపించింది.  ఇతరుల కథలు తీస్తారా అనడిగినప్పుడు శేఖర్ కమ్ముల- తనకి కథ చెప్పేవారు కామెడీ-సాంగ్స్-ఫైట్స్ కలగలిపి మూసలో పోస్తున్నారనీ- వెరైటీగా చెప్పగలిగితే తప్పక తీస్తాననీ అన్నారు. దీన్నిబట్టి ఉత్తమాభిరుచి ఉన్న మన సినీ దర్శకులు కూడా కథలు వినడమే తప్ప చదవాలనుకోరని అర్థమౌతోంది. విదేశీ భాషలతో సహా పరభాషల సరుకుని ఎన్నుకుని మన సీసాల్లో పోసి అమ్మడంవల్ల మన సినిమాలు జాతి నాడిని పట్టుకోలేకపోతున్నాయి. తెలుగుతనాన్ని ప్రతిబింబించాలంటే తెలుగు సాహిత్యపఠనం ఆవశ్యమనీ-  కథలు విని చెప్పడం కాక చదివి చెప్పడం దర్శకుల విధి అనీ తెలుగు సినీరంగం గుర్తించే రోజు దగ్గిరలో ఉన్నదనిపించదు.
ఇప్పటికీ గాయనీగాయకులు జిల్లాకి ఒక్కరు అనిపించే స్థాయిలో లేరు. మద్యపానంలాంటి  కొత్త పాటల్లో తూలుతూ కొంత రాణించినా- నిత్యవసంతాలనతగ్గ పాత పాటల్లోనూ, జాతి వారసత్వమనతగ్గ పద్యాల్లోనూ కొంత తేలిపోయారు. మున్ముందు పోటీల్లో ఎంపిక విషయంలో మరింత శ్రద్ధ అవసరమేమో!
ఫలితం: చివరగా గాయనీ గాయకులకు లభించిన సగటు మార్కుల ప్రకారం లిప్సిక అగ్రస్థానంలోనూ, రాజేష్ ద్వితీయ స్థానంలోనూ ఉన్నారు. సరిసమమైన మార్కులతో మల్లిక, సబీహాలు తృతీయ స్థానంలో ఉన్నారు. అందుకని ఈసారికి ఏ  ఒక్కర్నీ మినహాయించకుండా  నలుగుర్నీ ఫైనల్స్ కి ఎంపిక చేయడంలో నిర్వాహకుల ఔదార్యం సముచితం.
సెప్టెంబరు 20న ప్రసారమైన కార్యక్రమంలో
తుదిఘట్టం పోటీదార్లని- గురు మాతాపిత బంధుమిత్ర శ్రేయోభిలాష సమేతంగా పరిచయం చేయడం చాలా బాగుంది. మచ్చుకి వినిపించిన గతంలోని వారి పాటలు కొంత అసంతృప్తిని కలిగించినా- కార్యక్రమాన్ని రక్తి కట్టించిన కొన్ని సన్నివేశాలు గిలిగింతలు పెట్టాయి. సబీహా తన అన్న అకాలమరణాన్ని స్మృతి చేసుకోవడం హృదయాల్ని కదిలించింది. మొత్తంమీద పరిచయాలతో ఆరంభమై శుభాకాంక్షలతో ముగిసిన ఈ కార్యక్రమాన్ని రూపొందించిన తీరు గొప్పగా ఉంది.  తుది ఘట్టం కోసం ఆశగా, ఆత్రుతగా ఎదురు చూద్దాం.

3 వ్యాఖ్యలు »

  1. sujata said,

    I felt so bad abt sabiha’s tragedy. The song sung by Sabiha and her Brother was fantastic. Thats my fav song. He left a wonderful memory behind.


Leave a Reply to sujata Cancel reply

%d bloggers like this: