అక్టోబర్ 5, 2010

ఈటివి గేమ్ షో “జీన్స్”

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 4:39 ఉద. by వసుంధర

బుల్లితెర బొమ్మలు మనకంటే చిన్నవి. వెండితెరపై బొమ్మలు మనకంటే పెద్దవి. ఐమాక్స్ బొమ్మలు మననీ తమతో కలుపుకుంటాయి. అందుకే ఐమాక్స్ షో సినిమా షోలకే రారాజు అనిపించుకుంది.
టివిల్లో గేమ్ షోలు కొన్ని కేవలం  కాలక్షేపానికి. కొన్ని చూసి ఆనందించడానికి. కొన్ని మననీ ఆ షోలో భాగం చేసుకోగల్గుతాయి. ఈ మూడో తరగతికి చెందడం వల్లనేమో- ఈటివి సెప్టెంబరు 11నుంచి కొత్తగా ప్రారంభించిన జీన్స్ గేమ్ షోని అన్ని షోలకీ రారాజుగా ప్రకటించింది.
షోలో పాల్గొనే అభ్యర్ధికి ముందుగా 50 వేల రూపాయలు ఇస్తారు. అప్పట్నించి మొదలై కొనసాగే నాలుగు వృత్తాల అనంతరం పది లక్షల వరకూ ఆ మొత్తాన్ని పెంచుకునే అవకాశముంది.
మొదటి వృత్తం “సేమ్ టు సేమ్” లో ఒకపక్క నలుగురు పెద్దలు, మరోపక్క ఆరుగురు పిల్లలు ఉంటారు. అభ్యర్ధి వరుసగా ఒకో పెద్దని- వారి సంతానంతో సరిపోల్చాలి. పోలిక సరిగా ఉంటే పది వేలు నజరానా. పోలికలో పొరబడితే పది వేలు జరిమానా.
రెండవ వృత్తం “సెలబ్రిటీ రౌండ్” ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించినది. ఆ వ్యక్తిని చిన్నప్పటి ఫొటోతో కానీ, తలిదండ్రుల ఫొటోలతో కానీ సరిపోల్చాలి. సరికి 20 వేలు నజరానా. పొరపాటుకు పది వేలు జరిమానా.
మూడవ వృత్తం “బొమ్మరిల్లు కుటుంబం” లో తాతలనుంచి మునిసంతానం దాకా ఓ పెద్ద కుటుంబాన్ని అభ్యర్ధికి తెలియకుండా ప్రేక్షకులకు పరిచయం చేసి- అందులో ఇద్దరిని ఎన్నుకుంటారు. అప్పుడు అభ్యర్ధి వచ్చి ఆ ఇద్దరి బంధుత్వం ఏమిటో చెప్పాలి. అది తెలుసుకుందుకు అభ్యర్ధి యాంకర్ని పరోక్షమైన ప్రశ్నలు వెయ్యొచ్చు.  ఐతే ప్రశ్నకు ఐదు వేలు మూల్యం చెల్లించాలి. బంధుత్వం సరిగ్గా చెప్పగలిగితే లక్ష రూపాయలు నజరానా. ప్రశ్నలకిచ్చుకున్నది జరిమానా.
నాల్గవ వృత్తం “జాక్‌పాట్ రౌండ్” లో విడిగా ఉన్న ఐదుగురు పెద్దల్నీ ఐదుగురు పిల్లల్నీ అతి తక్కువ వ్యవధిలో సరిగ్గా కలపాలి. తీసుకున్న వ్యవధినిబట్టి అంతవరకూ గెల్చుకున్న మొత్తాన్ని మూడింతలదాకా పెంచుకోవచ్చు. పొరబడితే అంతవరకూ గెల్చిన మొత్తంలో సగం జరిమానాగా ఇచ్చుకోవాలి.
వీటిలో మొదటి మూడు వృత్తాలకూ కాలవ్యవధి లేదు. 1, 2, 4 వృత్తాల్లో ప్రేక్షకులు కూడా తామూ అభ్యర్ధులై షోలో తామూ భాగమైపోతారు. మూడవ భాగంలో అభ్యర్ధి వేసే ప్రశ్నలకు ఆలోచనతో కూడిన అవగాహన అవసరం. ఆడేవారికే కాక చూసేవారికీ మనోరంజకంగా మెదడు పదునెక్కే భాగమిది.
షో మొత్తం ఆలోచనకు సంబధించినదైతే- మనోరంజన ఎంత అర్థవంతమో తెలుసుకుందుకు ఈ షో తప్పక చూడాలి.
ఈ షోకి యాంకర్- యాంకర్లలో సూపర్ స్టార్ హోదా చేరుకున్న సుమ. కౌన్ బనేగా కరోర్‌పతీకి అమితాబ్ బచ్చన్‌లా ఘనతనిచ్చిందనలేము కానీ- యాంకర్ మరొకరైతే బాగుండునని ఏ క్షణమూ అనిపించదు.
ఈ షోకి అదనపు
ఆకర్షణ అభ్యర్డులు. సెప్టెంబరు 11నుంచి అక్టోబరు 2 వరకూ జరిగిన షోలలో వచ్చినవారు:  మగధీర రాజమౌళి, జస్ట్ యెల్లో గున్నం గంగరాజు (ఆయన కుమారుడు), యమలీల అలీ (ఆయన సోదరుడు), ఢీ శ్రీను వైట్ల.

మున్ముందు గేమ్ షోలకి జీన్స్ ఒరవడి కాగలదని ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: