అక్టోబర్ 7, 2010

భారతంలో లక్ష్మణ్ రేఖలు

Posted in క్రీడారంగం at 2:58 ఉద. by వసుంధర

అచ్చ తెనుగు పేర్లతో స్వతంత్ర భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించినవారు తక్కువ. గవాస్కర్ నాయకత్వంలో ఎమ్వీ నరసింహారావు జట్టుకి ఎన్నికై ఆడినప్పుడు అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఆ తర్వాత వెంకటపతిరాజు అతడికంటే మెరుగ్గానే కొంతకాలం రాణించాడు. అసలుసిసలు తెలుగు పేరుతో 1996లో జట్టుకి ఎన్నికై ఇప్పటికీ కొనసాగుతున్న మేటి ఆటగాడు వంగీపురపు వెంకటసాయి లక్ష్మణ్. మారుమూల గ్రామాల్లో కూడా పేర్లలో ఆధునికత సంతరించుకుంటున్న ఈ రోజుల్లో పేరులో తెలుగుతనం గురించిన తాపత్రయం సంకుచితమని తీసి పారేయలేం. అత్యాధునికమైన బొంబాయి  ముంబైగా, కలకత్తా కోల్‍కటాగా, మద్రాసు చెన్నైగా మారడం సంకుచితమా? అలా భారత జట్టులో అతడి ఎంపిక పేరుకి లక్ష్మణ్ రేఖ.
ఒకప్పుడు జెమిని టివిలో లబ్దప్రతిష్ఠులనేకాక విలక్షణత ఉన్న విశిష్ఠవ్యక్తుల్ని కూడా పరిచయం చేయడానికి ‘శుభోదయం’ అనే చక్కటి కార్యక్రమం వచ్చేది. అందులో ఒకసారి ఉద్యోగరీత్యా తెలుగునాడు చేరిన ఓ పంజాబీ మహిళను పరిచయం చేస్తే- ఆమె పూర్తిగా ‘నేర్చుకున్న’ తెలుగులోనే మాట్లాడింది. ఆ తర్వాత కొద్ది రోజులకే క్రికెటర్ వంగీపురపు వెంకటసాయి లక్ష్మణ్‍ని పరిచయం చేస్తే- అతడు పూర్తిగా ఆంగ్లంలో మాట్లాడాడు. యాంకర్ అతణ్ణి  తెలుగొచ్చా అనడిగితే వచ్చునని బదులిచ్చి ఆంగ్లంలో కొనసాగించాడు. తెలుగు ప్రేక్షకులకి తెలుగు గడ్డలో పుట్టి పెరిగిన తెలుగువాడు తననుతాను ఆంగ్లంలో పరిచయం చేసుకున్నప్పుడు- ‘అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కారని’ తెలుగుతల్లి వాపోతే- అది ఆరంభమూ కాదు, అంతమూ కాబోదు, అందుకని అది భాషకు లక్ష్మణ్ రేఖగా మేము భావించాం. ఎందుకంటే తెలుగువాడు- ముఖ్యంగా తెలుగు ప్రముఖుడు తెలుగే మాట్లాడాలని అనుకోవడం నిస్సందేహంగా సంకుచితమే. ఉదాహరణకు క్రికెట్లో అవతారపురుషుడి స్థాయికి చేరుకుని జాతిచే ఆరాధించబడుతున్న సచిన్ తెండూల్కర్‍ని తీసుకుందాం. అతడు హిందీలోనో ఆంగ్లంలోనో కాక మరాఠీలో మాట్లాడితే భారతీయుడనిపిస్తుందా? అలా భారతీయుడుగా అది లక్ష్మణ్ భాషకు గీసిన లక్ష్మణ్ రేఖ.
మన స్వరాజ్యం కోసం ఎందరో కృషి చేశారు. కానీ చటుక్కున స్ఫురించే పేర్లు గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్.  మన క్రికెట్ కోసం ఎందరో ఆటగాళ్ళు కృషి చేశారు. కానీ చటుక్కున స్ఫురించే పేర్లు గవాస్కర్, కపిల్, సచిన్.  ఇంకా సమకాలీనంగా  బోలర్ల గుండెల్లో దడ పుట్టిస్తూ, ప్రేక్షకుల ఉత్సాహం ఉరకలు వేయిస్తున్న సెహ్వాగ్, జట్టుకి ఎడతెరిపి లేకుండా విజయాలు సాధిస్తున్న నాయకుడిగా ధోనీ చాలామందికి స్ఫురించవచ్చు. కానీ జట్టుని ఎన్నో విపత్కర సమయాల్లో అనన్యసామాన్యమైన  ఆటతో ఆదుకుని-  ఊహకందని విజయాలకు బాట వేసిన లక్ష్మణ్ ని గుర్తుంచుకునేవారు తక్కువ. బాగా ఆడినప్పుడు మాత్రం నామస్తోత్రం అందుకుని- మరుక్షణం మరపుకి గురయ్యే సమకాలీనుల్లో ప్రథముడు –  లక్ష్మణ్.  తెలుగు గడ్డ మీద పుట్టిన ఈ తెలుగు బిడ్డ క్రికెట్లో సాధించిన విజయాలు– మనం స్మరించినా స్మరించకపోయినా – క్రికెట్లో మొన్నమొన్నటిదాకా మకుటమున్న మహారాజుగా శోభించిన   ఆస్ట్రేలియా ఎన్న్నటికీ మరువదు. కొన్ని దశాబ్దాల వారి విజయపరంపరలకు మొదటిసారిగా బ్రేకులు పడింది కొత్త శతాబ్దంలో. వేసిన దేశం ఇండియా. ఆ ఘనత చాలావరకూ లక్ష్మణ్ ది. 2000-1లో కలకత్తాలో అతడా దేశంపై  చేసిన 281 పరుగులు- మనని ఓటమి అంచులనుంచి విజయపథంవైపు దూసుకుపోయేలా చేసాయి.  ఆ పరుగులకి ‘ఈ శతాబ్దపు ఇన్నింగ్సు‘ గా  అంతర్జాతీయమైన గుర్తింపు కూడా వచ్చింది. అయినా జాతీయ జట్టులో లక్ష్మణ్ స్థానం ఎప్పటికప్పుడు  అనుమానాస్పదంగా ఉంటోందంటే అది- మన క్రికెట్ బోర్డు గీసిన లక్ష్మణ్ రేఖ.
114 టెస్టు మ్యాచిలలో 16 శతకాలు, 46 అర్థ శతకాలు సాధించిన లక్ష్మణ్ తనకు తనే గీసిన రేఖలు ఎన్నో ఎన్నెన్నో. ఆడితే సొగసు చూడతరమా అని అన్ని దేశాలవారూ ముచ్చటపడే తీరు అతడిది. ఇటీవల మొహాలీలో జరిగిన టెస్ట్ మ్యాచిలో-  అదే సొగసుతో అపూర్వంగా ఆడి- అపజయాన్ని ఉహకందని విధంగా విజయంగా మలచాడు లక్ష్మణ్. ఇది మరపురాని మరో లక్ష్మణ్ రేఖ.
లక్ష్మణ్ రేఖలకి- జాతి స్పందన  రేఖామాత్రం కాకూడదని ఆశిద్దాం.
లక్ష్మణ్ వివరాలు
లక్ష్మణ్ సవివరాలు
లక్ష్మణ్ 281
లక్ష్మణ్?
లక్ష్మణ్ మొహాలీ

5 వ్యాఖ్యలు »

  1. ఎందుకంటే తెలుగువాడు- ముఖ్యంగా తెలుగు ప్రముఖుడు తెలుగే మాట్లాడాలని అనుకోవడం నిస్సందేహంగా సంకుచితమే. ఉదాహరణకు క్రికెట్లో అవతారపురుషుడి స్థాయికి చేరుకుని జాతిచే ఆరాధించబడుతున్న సచిన్ తెండూల్కర్‍ని తీసుకుందాం. అతడు హిందీలోనో ఆంగ్లంలోనో కాక మరాఠీలో మాట్లాడితే భారతీయుడనిపిస్తుందా? అలా భారతీయుడుగా అది లక్ష్మణ్ భాషకు గీసిన లక్ష్మణ్ రేఖ.

    మ్యాచ్ ఇంటర్వ్యూల్లో, జాతీయ ఛానెల్లో తెలుగు మాట్లాడాలని కోరుకోవటం సంకుచితమవ్వచ్చుగానీ, తెలుగుకార్యక్రమంలో పరిచయకర్త అడిగాక కూడా ఇంగ్లీషులో బదులిస్తే అది ఖండనార్హం. అందులో గొప్పదనమేంటో, లక్ష్మణరేఖలేంటో నాకర్థంకాలేదు.

    మిగతా వ్యాసమంతా నచ్చిందండి.

    • రామాయణంలో లక్ష్మణరేఖని మంచికీ చెడ్డకీ కూడా ఉదహరించవచ్చు. భాషకు లక్ష్మణ్ రేఖ అనడం ప్రశంస కాదు. ఈ విషయంలో మీ అభిప్రాయమే మా అభిప్రాయమని గుర్తించగలరు.


Leave a Reply

%d bloggers like this: