అక్టోబర్ 9, 2010

ఏ మాయ చేసావె

Posted in వెండి తెర ముచ్చట్లు at 2:06 ఉద. by వసుంధర

ఇంతవరకూ వచ్చిన చిత్ర సమీక్షలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

ముందుమాట: మన సినీ ప్రేక్షకులు మూడు రకాలు. చదువుకోనివారు, చదువుకున్నవారు, చదువు కొన్నవారు. అందరికీ సినిమా అంటే వినోదం. వినోదం అంటే ప్రేమ లేదా హింస. హీరోలంటే అభిమాన నటులు లేదా వారి వారసులు. హీరోయిన్లంటే తెరమీద అందంగా అగుపిస్తూ మాట తమది కాని అన్యభాషా భామలు. కాస్త అటూ ఇటూగా ఈ మూసలో ఇమిడితేనే- ఏ చిత్రానికైనా విడుదల భాగ్యం. వాటిలో పెక్కింటికి ఫ్లాప్ యోగం, కొన్నింటికే బాక్సాఫీసు భోగం. అందరూ ఒకే సూత్రాన్ననుసరించినా కొందరికే జయమాల లభించడం గురించి మన సినీ నిర్మాతలు ఆలోచించరు. ఆలోచిస్తే సృజనాత్మకతకు ప్రాధాన్యమివ్వాలి. ఆదాయానికి సారాను నమ్ముకున్న దేశం మనది. సారాను వినోదంగా భావిస్తారన్న నమ్మకంతో- వారికి సినిమానే సారాగా ఇస్తారు మన సినీ నిర్మాతలు- తరచుగా పాతసీసాల్లో, అప్పుడప్పుడు కొత్త సీసాలో. సీసా ఏదైనా సారా మాత్రం పాతదే. అన్నట్లు పాతబడినకొద్దీ సారా ఇచ్చే కిక్ ఎక్కువటగా-
అలా ఓ కొత్త సీసాలో పాత సారాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న విడుదలైంది ‘ఏ మాయ చేసావె’.
టైటిల్స్ లో కథ గౌతమ్ వాసుదేవమీనన్‍ది అని వేసారు కాబట్టి ఈ చిత్రానికి కథ ఉందనుకోవాలి. సినీ దర్శకుల కథలు చిన్న దారంతో (ఆంగ్లంలో థ్రెడ్) మొదలై సన్నివేశాల పూలను జత చేసుకుంటాయి. చూడ్డానికి మాల కావచ్చు కానీ చెబుతుంటే వినడానికి మాత్రం దారమే కనిపిస్తుంది. కాస్త విపులంగా చెబితే పాత సారా అనిపిస్తుంది. దారమనుకున్నా పాత సారా అనుకున్నా కథ ఇది:
కథ: ఇంజనీరింగ్ చదువుతున్న కార్తీక్‍కి సినీ దర్శకుడు కావాలని కోరిక. అంతకంటే ముందు జెస్సీ ప్రేమను గెలవాలని కోరిక. అతడు హిందువు, ఆమె క్రిస్టియన్. అతడు విద్యార్ధి, ఆమె ఉద్యోగిని. వయసులో ఆమె అతడికంటే రెండేళ్లు పెద్ద. ఐనా ‘ఏ మాయ చేసావె’ అంటూ ఆమెనే స్మరిస్తూంటాడు. ఆమె తిరస్కరిస్తే నిరాశ పడడు. అప్పటికి సినీహీరోగా స్థిరపడ్డ తన మిత్రుడు కృష్ణ సాయంతో ఆమెను వెంటాడి వేధించి చివరికి ప్రేమను సాధిస్తాడు. పాత కథల మూసలోనే కొన్ని అపార్ధాలు, కొన్ని మలుపులు. చివరికి హీరో హీరోయిన్లు ఒకటౌతారు.
సీసాలో కొత్తదనం ఏమిటో తెలుసుకుందుకు ఈ కింది అంశాలు పరిశీలిద్దాం.
హీరో: ఏయన్నార్‍ని అభిమానించేవారందరూ నాగార్జున అభిమానులు. నాగార్జునని అభిమానించేవారందరూ నాగచైతన్య తొలిచిత్రం ‘జోష్’ అతణ్ణి సూపర్ స్టార్ చెయ్యలేకపోయినందుకు దిగులుపడ్డారు. వారు పులకించేలా- ఈ చిత్రంలో కార్తీక్ పాత్రకి నాగచైతన్య అతికినట్లు సరిపోయాడు. ఖుషీలో పవన్ కళ్యాణ్ నటనలా విలక్షణంగా ఉంది. అన్ని చిత్రాలకూ ఇదే నటన నప్పదని గ్రహిస్తే అతడికి నటుడిగా గొప్ప భవిష్యత్తు ఉంది.
హీరోయిన్: జెస్సీ పాత్రలో అలవోకగా ఇమిడిపోయిన సమంతా- ప్రతిభావంతమైన సహజ నటనతో చిత్రంలో జీవం నింపింది.
ఇతర నటీనటులు: ప్రతి ఒక్కరూ తమతమ పాత్రలకు న్యాయం చేసారు. అందరిలోకీ కృష్ణ పాత్రధారి కృష్ణుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నటుడిగా నానాటికీ ఎదిగిపోతున్న ఈ నటుణ్ణి హీరో మిత్రుడైన సినీహీరోగా ఎన్నుకోవడం విలక్షణం.
సంగీతం: ఆస్కార్ అవార్డు పొందాలంటే సంగీతంలో పాశ్చాత్య పోకడలు అవసరం. మన యువతకు కావాల్సింది పాశ్చాత్య పోకడలున్న సంగీతమేనని సుమారైన సినీ సంగీత దర్శకులు అనుకోవచ్చు. కానీ  తెలుగులో రోజా, బొంబాయి, ఇద్దరు- హిందీలో రంగీలా, తాల్, లగాన్ వంటి చిత్రాలకు మరపురాని పాటలందించిన రెహమాన్ నుంచి- తెలుగు చిత్రానికి తెలుగు పోకడ ఆశించడం సహజం. ఈ చిత్రంలోని ఏడు పాటల్లో ఆరు పాటల్లో తెలుగు తెలుగులా వినిపించదు. వినిపించిన ఆ ఒక్క పాటా ‘వింటున్నావా‘ అని హిందీ గాయని శ్రేయా గోశాల్ గొంతులో పలికింది. భాషకు పాట వరస ఎంత ముఖ్యమో మాటవరస కూడా అంత ముఖ్యమని గ్రహించాలి కానీ-  రెహమాన్ ప్రతిభకు భాష సమస్య కాదని స్వాభిప్రాయం. మనమేమనుకుంటేనేం- ఇందులోని పాటలన్నీ పెద్ద హిట్. వినడానికి మాకూ బాగున్నాయని ఒప్పుకోక తప్పదు.
దర్శకత్వం: ఏ మాత్రం కొత్తదనంలేని కథని- ఆరంభంనుంచి అంతందాకా ఊహకందని కొత్త కథనంతో-  ఈ చిత్రాన్ని ఇలా తీయడం తనకు మాత్రమే సాధ్యమనిపించేల నడిపించాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్. ఆయన దర్శకత్వ ప్రతిభకు అభివందనాలు. చిత్రంలో ప్రతి పాత్రనీ ఆయన మలచిన తీరు, ఆయా పాత్రలకు ఎన్నుకున్న నటీనటులు- ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇంతటి ప్రతిభ కేవలం కాలక్షేపానికి మాత్రమే పనికొచ్చే ఓ రొటీన్ కథకు వినియోగించబడడం బాధగా అనిపించవచ్చు. కానీ ఈ చిత్రం నిర్మాతకు లాభాలార్జించి పెట్టింది. ఓ హీరోకి సుస్థిర స్థానం కల్పించింది. ప్రేక్షకుల మెప్పు పొందింది.
సినిమా అంటే సన్నివేశాల సమాహారం అని నమ్మే దర్శకులు- వారందించినవే సినిమాలని సరిపెట్టుకునే ప్రేక్షకులు మారనంతకాలం- తెలుగు సినిమాల్లో- హిట్లు, ఫ్లాపులు ఉండొచ్చు కానీ మంచి చిత్రాలుండవు.
ఆశావాదం: కుటుంబ సమేతంగా చూడ్డానికి అనువైన చిత్రాన్ని, మసాలాలు లేకుండా, సూపర్ స్టార్ లక్ష్యమున్న కొత్త నటుడితో తీయడం సాహసం. నిర్మాతగానే కాక నటుడిగా రాణించడం అరుదైన విశేషం. ఈ చిత్ర నిర్మాత సంజయ్ స్వరూప్ అభిరుచి, సాహసం, సంస్కారం, ప్రతిభ అభినందనీయం. మున్ముందు ఆయన నుంచి మంచి హిట్ చిత్రాలని ఆశిద్దాం.

ఆన్ లైన్లో ఈ చిత్రం
ఆన్ లైన్లో పాటలు

1 వ్యాఖ్య »

  1. Siva Cheruvu said,

    బాగారాసారు. ముందు పాత సారా అన్నారు కదా..నెగటివ్ గా రాస్తారేమో అని చూసా. నాకు చూడ్డానికి సమంతా, వినడానికి వింటున్నావా పాటలు తప్ప .. బాలన్సు సినిమా తట్టుకోవడం కొంచెం కష్టమే అనిపించింది. కాని కధనం మాత్రం అభినందనీయం. ఇదే కధా వస్తువు ‘సీతా కోక చిలక ‘, ‘ప్రేమ’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఎప్పుడో వచ్చేసింది. అయితే ఈ సినిమాలో డైలాగులు కూడా మెచ్చుకోదగ్గవి. సహజంగా ఉంటాయి. అయితే ఇదే దర్శకుని నుండి వచ్చిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ నాకు చాల బాగా నచ్చింది. నచ్చింది కనుక అనడం కాదుకానీ .నా ఉద్దేశంలో అది మంచి సినిమా. కాని ఆడలేదు.


Leave a Reply

%d bloggers like this: