అక్టోబర్ 20, 2010

‘కొన’ సాగుతున్న మూడు ఈటివి సీరియల్స్

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 4:10 ఉద. by వసుంధర

అక్షరజాలంలో ముచ్చటిస్తున్న మూడు డెయిలీ సీరియల్స్: అభిషేకం, తూర్పువెళ్ళే రైలు, చంద్రముఖి.
సాంఘికంగా ఆరోగ్యపరిస్థితులు మెరుగై మనుషుల ఆయుఃప్రమాణం క్రమంగా పెరుగుతున్నట్లే- కళాత్మకంగా అనారోగ్య పరిస్థితులు పెరిగిపోతే బుల్లితెరపై డెయిలీ సీరియల్స్ ఆయుఃప్రమాణానికి అదుపు లేకుండా పోతుంది. అంతం లేకున్నా ఆది ఉంది కాబట్టి ఈ సీరియల్స్‍కి ఆద్యంతాలు తెలియని దైవత్వాన్ని ఆపాదించలేం. కళ్లిచ్చి చూసేవాళ్లు, డబ్బిచ్చి కాసేవాళ్లు, ఛానెలిచ్చి మోసేవాళ్లు, వీళ్లకోసం తీసేవాళ్లు, వాళ్లకోసం రాసేవాళ్లు- వలయమై అమృతాన్ని విషం చేయగల ప్రజ్ఞతో కళాభిజ్ఞతకు విషవలయంగా మారుతున్నారు. ”కొన’ సాగడమే ధ్యేయమైన ఈ సీరియల్స్‍పై చర్చను కూడా ‘కొన’ సాగించకపోవడం విజ్ఞత. అక్షరజాలం వీక్షకులు ఈ వ్యాసాన్ని ఈ చర్చకు కొసమెరుపుగా గ్రహించగలరు.
అభిషేకం: కథలో, దర్శకత్వంలో చాలా లోపాలున్నా నటీనటుల సామర్ధ్యం ఈ సీరియల్ని ఆసక్తికరం చేసింది. ఆ మధ్య ప్రవేశపెట్టిన యోగి పాత్ర కథకి కొత్త ఊపునివ్వడమేకాక అంతం సమీపించిందన్న భ్రమ కలిగించింది. కథనంలో వేగం పెరిగి చూపరుల ఉత్సాహం పెంచింది. నటుడి గంభీరస్వరం యోగి పాత్ర విలువ పెంచితే, రేఖ పాత్రలో మౌనిక జీవించిన తీరు అలనాటి మహానటీమణులను స్ఫురణకు తెచ్చింది. ఆమె పాత్ర, పాత్రత హృదయాల్ని కదిలించేలా ఉన్నాయి. రేఖ చావుతో సీరియల్‍కి మంగళం పాడడానికి వీలొచ్చింది. కానీ శరత్ నవల దేవదాసునే ‘దేవదాసు మళ్లీ పుట్టాడు’ గా కొన సాగించిన వారి కథ ఇది. అదీ డెయిలీ సీరియల్ కథ. రేఖ మళ్లీ పుట్టడానికి అన్ని సన్నాహాలూ పూర్తవుతుంటే- ఆమెకు తల్లి పాత్రలో కనిపించాలన్న భయంతోనో ఏమో స్వాతి పాత్ర ముగిసింది. ఐదేళ్ల వయసులో విచక్షణకూ, విజ్ఞతకూ, సదవగాహనకూ మారురూపంగా పరిచయమైన కమల్ పాత్రధారి- పగ, ద్వేషం నింపుకున్న యాంగ్రీ యంగ్‍మాన్‍గా మారిపోవడం కొన సాగింపు. ప్రేక్షకులు అంతం కాదిది ఆరంభమని అర్థం చేసుకోగలిగితే కథ కూసింత కాలక్షేపాన్నీ, నటీనటులు వళ్లంత థ్రిల్లింత హావభావాల్నీ ఇవ్వగలగడం తథ్యం. ఐతే ఇంతవరకూ సాఫీగా నడుస్తోందనుకున్న ఈ సీరియల్‍లో ఇటీవలే ఫాక్షనిస్టు మణెమ్మ పాత్ర చేరింది. ఆ పాత్ర కుట్రలకూ, కుతంత్రాలకూ మాత్రమే పరిమితమౌతుందనీ- బుల్లి తెరపై అనవరత రక్తపాతాన్ని చిందించదని ఆశిద్దాం.
తూర్పు వెళ్లే రైలు: భరతావనిలో రైళ్లకి పట్టాలు తప్పడం మామూలేగా- టైటిల్‍కి న్యాయం చేకూర్చడానికి ఈ సీరియల్ ఎప్పుడో పట్టాలు తప్పింది. కథకు మూలమైన రాధ, ఆమె చుట్టూ తిరిగే ఇతర పాత్రలు ముఖం చాటేసి కొన్ని నెలలయింది. అందుకు ప్రేక్షకులు హాయిగా ఊపిరి పీల్చుకునేలా కొన సాగింది ఆమె కథ. రాధకు సమానాంతరమైన సంధ్య కథ కూడా ముఖం చాటేయాల్సిన దిశలో పయనిస్తుంటే- ఆపద్ధర్మంగా జయంతి పాత్రని ప్రవేశపెట్టారు. ఐనా ఇంకా నమ్మకం చాలక మొదటి రెండు కథలతోనూ ఏ మాత్రం సంబంధంలేని ఓ మాధవి పాత్రని ప్రవేశపెట్టారు. ఇతివృత్తం ‘న్యాయం కావాలి’ అంత పాతదైనా- అంత ఉత్కంఠనీ కలిగించే కథనం అభినందనీయం. మాధవి, ఆమె చుట్టూ తిరిగే పాత్రలకు ఎంపిక చేసుకున్న నటీనటులు అద్భుతం. ఇది ‘న్యాయం కావాలి’ అనే కొత్త సీరియల్ (అంతకుముందు పేరూ సినిమాదే కదా) అనుకుంటే ఈ సీరియల్ ఆసక్తికరంగా ఉన్నదనే చెప్పాలి. మధ్యమధ్య వచ్చే సంధ్య కథని అదనపు అడ్వర్టయిజ్‍మెంట్సుగా సరిపెట్టుకోవాలి.
చంద్రముఖి: తెలివైన ఓ శాడిస్టు యశోధర, తెలివితక్కువతనంతో బోలెడుమంది బాధితులు. ఇంతే ఈ కథ. దర్శక ప్రతిభతో కొన్నేళ్లుగా ఈ సీరియల్ని ఏ రోజుకారోజు ఆసక్తికరంగా రూపొందించగలిగారు. కానీ ఉత్త దాగుడుమూతలతో కథ ఎంతకాలం నడుస్తుంది? యశోధర నటన విసుగు తెప్పించేలా ఉందని ఆమె కూతురు పూజని కూడా మరో శాడిస్టుని చేసారు. వీళ్లిద్దరి కౄరత్వం ఏ స్థాయిదంటే- వాళ్లు స్వయంగా మనుషుల్ని కత్తులతో పొడుస్తారు. కాళ్లు, తలలు కూడా నరికేస్తారు. వళ్లు జలదరించేలా రక్తం చిమ్ముతుంటే వికటాట్టహాసాలు చేస్తారు. చిత్రమేమిటంటే దుష్టపురుష పాత్రలు కూడా కౄరత్వంలో ఆ తల్లీకూతుళ్లకు సాటిరావు. ఉదాహరణకు ఆది పాత్ర. ఇతరులను బాధించలేని ఆది అమాయకుల్ని మోసగించడంకోసం- ఒకటికి రెండుసార్లు తననితాను కాళ్లు విరిగేలా, తల పగిలేలా కొట్టుకోగలడు.  ఈ పాత్రలతో ప్రేక్షకులు విసిగిపోగలరన్న అనుమానంతోనేమో ఇటీవల బాలా త్రిపురసుందరి అనే మంచి ఫాక్షనిస్టు పాత్రని ప్రవేశపెట్టారు. ఆమె ఆకారం, మాట, నటన- ఆ పాత్రకు హుందాతనాన్నిచ్చాయి. ఐతే బలమేతప్ప తెలివి ఉన్నట్లు తోచని ఆమె ఇంత బలమైన స్థానానికి ఎలా చేరుకుందోనని సందేహం కలుగుతుంది. ప్రేక్షకులు జారిపోతారేమోనని- మధ్యలో 2-3 వారాలు మర్యాద రామన్నగా సునీల్‍ని ప్రవేశపెట్టారు. వచ్చిన సమస్య- టైటిల్ పాత్ర (తొణకని బెణకని వెనకడుగెరగని ధీరవనిత) పోషిస్తున్న చంద్రముఖి- పిరికితనం మూర్తీభవించిన ఏడుపుగొట్టు పాత్ర. ఆమెను ప్రేమించిన కార్తీక్ కింకర్తవ్యవిమూడుడు, చేతకానివాడు. వీరికి బాసటగా నిల్చినవారందరూ వీరిరువురికీ తీసికట్టు. కథ సంగతలా ఉంచి ఈ సీరియల్‍లో రక్తపాతం, హింస పెద్దవాళ్లకి కూడా భయానకం. ఒక వారంక్రితం చంద్రముఖిని నిలువునా సజీవంగా పాతిపెట్టే దృశ్యం, ఆ దృశ్యానికి యశోధర వినోదించిన తీరు- నేర మనస్తత్వాలకి ప్రేరణ కాగల ప్రమాదముంది. ఈ సీరియల్‍లో ఇప్పటికే ప్రేక్షకులు ప్రతిఘటించాల్సిన ఎన్నో అభ్యంతరకర దృశ్యాలొచ్చాయి. ఎన్నో చక్కటి కార్యక్రమాలనందిస్తున్న ఈటివి ఈ తరహా కథనానికి స్వస్తి చెప్పి- చెడుపై మంచి సాధించిన విజయాలపై దృష్టి మళ్లించాలని మనవి.

1 వ్యాఖ్య »

  1. SanSh said,

    Good analysis 🙂


Leave a Reply

%d bloggers like this: