Site icon వసుంధర అక్షరజాలం

పాడుతా తీయగా స్వరసంగ్రామం సెప్టెంబర్ 27- అక్టోబర్ 18, 2010

ప్రతి సోమవారం రాత్రి 9.30-10.30 వస్తున్న ఈ కార్యక్రమం తొలి 20 భాగాల గురించీ ఇంతవరకూ చర్చించాం. ఇది స్వరసంగ్రామంగా అభివర్ణించబడి- సెప్టెంబర్ 27అక్టోబర్ 4, 11, 18 (2010) లలో నాలుగు భాగాలుగా వచ్చిన తుది ఘట్టంపై సమీక్ష.
వేదిక: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కళావాణి ఆడిటోరియం
పోటీదార్లు: రాజేష్ (అనంతపురం), మల్లిక (గుంటూరు), సబీహా (కడప), లిప్సిక (ఖమ్మం)
ముఖ్య అతిథి: ప్రముఖ యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్
పోటీ తీరు: మొత్తం నాలుగు సంచికలు, ప్రతి సంచికకూ రెండు వృత్తాలు.
ఆరంభం: ‘మన విశాఖ ఘన విశాఖ’ శీర్షికలో- ప్రతి సంచికలో అంచెలంచెలుగా విశాఖపట్నం నగరం చరిత్ర, భిన్నకోణాల్లో నగర ప్రాభవ వైభవాల పూర్తి పరిచయం.
సెప్టెంబర్ 27న తొలి సంచికలో మొదటి వృత్తంలో- అభ్యర్ధులు నలుగురూ వేదికకు అలవాటు పడడానికీ,  గాత్రశుద్ధికి అనువుగానూ- కదంబహారంలా ఒకరితర్వాత ఒకరుగా పల్లవులు పాడారు. అంత్యాక్షర నియమంలేని అంత్యాక్షరిలా కొనసాగిన ఈ కార్యక్రమంలో పల్లవులు ఎక్కువై కాస్త బోర్ కొట్టింది. పాట అగిందా ఒకరి సీటు గోవిందా అన్న పాట చివరిది. ఫైనల్స్ లో ఇద్దరికే బహుమతులు కాబట్టి- చివర్లో ఒకరిది కాదు, ఇద్దరి సీట్లు గోవిందా అని బాలు చమత్కరించి- అందరికీ సమంగా తలో 80 మార్కులు పంచి ఇచ్చారు.
రెండవ వృత్తానికిగానూ పురాతన జానపద గీతాలను సూచించారు. పాటపాటకూ  మద్య జ్ఞానం, పరిజ్ఞానం, చమక్కులు వగైరాలు కార్యక్రమాన్ని రసవత్తరం చేసాయి. రాజేష్- కలసి ఉంటే కలదు సుఖం చిత్రంలోని- ‘ముద్దబంతి పూలుపెట్టి’ పాట ఆలపించగా- ఆ పాటకి ముందు వినిపించే అద్భుత ఆలాపనలో గొంతు సంగీత దర్శకుడు విశ్వనాథన్ ది అని బాలు చెప్పారు. బాగపిరివినై (తమిళం) చిత్రంలోని పాటకు అనుకరణ ఐన ఈ పాట ఆలాపన హిందీ చిత్రం సుజాతలో ఎస్డీ బర్మన్ గొంతులో వినిపించిన సునుమేరీ బంధూరే పాటకు అనుకరణగా మేము ఇంతకాలం భావించాం. కానీ సుజాత (హిందీ), బాగపిరివినై (తమిళం) చిత్రాలు రెండూ 1959లోనే వచ్సినందున ఎవరిది  ఎవరికి అనుకరణో తెలియదని బాలు అన్నారు. మార్కెట్లోకి ఏ పాట ముందొచ్చిందో మాకు తెలియదు. రెండు పాటలూ వినిపించడం  శ్రోతలకు వీనులవిందు. బాలుతో బాల్యంనుంచీ అనుబంధమున్న- దేవిశ్రీకి తన సంగీత దర్సకత్వంలో మొదటి పాట బాలు పాడాలన్నది తీరిన కోరిక. దేవిశ్రీ పుట్టిన సంవత్సరం 1979 అని ఆరంభంలో చెప్పి- ఇక్కడ 1980 అనడం చాలా చిన్న పొరపాటైనా ఎడిటింగులో సరిచేసుకునే అవకాశముంది.  పాయింట్లు: 80+87= 167
మల్లిక ఎంచుకున్న పాట  మంచి మనసులు చిత్రంలోని మామ మామా మామా. సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్ ఈ పాటతోనే మామగా ప్రసిద్ధుడయ్యాడట. ఈ పాటకు నృత్యం చేసింది నటరాజన్ అట. పాయింట్లు: 80+85= 165
సబీహా వేదికమీడకు రాగానే ఆమెను ఆట పట్టించే రివాజు కొనసాగింది. కడప జిల్లాలోని తాళ్లపాకను ప్రస్తావించి ఆ సందర్భంగా వచ్చిన అన్నమయ్య ప్రస్తావనలో ప్రముఖ సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి గారి రికార్డెడ్ ఇంటర్వ్యూ చూపారు. ఆయన బాలు అసమాన ప్రతిభను ప్రశంసించారు. అన్నమయ్య పేరు నిలబెట్టాలన్న  బాలు సూచన అనంతరం సబీహా  ఎంపిక చేసుకున్న పాట- ‘ఒకేఒక్కడు’ చిత్రంలోని ‘ఉట్టిమీద కూడు’. పాటమీద అభిప్రాయం చెప్పమన్నప్పుడు- తానీ పోటీలో పాల్గొంటే తొలి రౌండ్ లోనే పోయి ఉండేవాడి ననడంలో దేవిశ్రీ తన వినయంతోపాటు ఈ పోటీ తీరునీ విశ్లేషించారు  ఆత్మవిశ్వాసంతో పాడమన్న ఆయన సలహాతోపాటు- పాట అనుభూతి గొంతులో వినిపించడమే కాదు, వంటి కదలికల్లోనూ కనిపించాలన్న బాలు సూచన మెచ్చుకోతగ్గవి. పాయింట్లు: 80+75= 155
ఇక లిప్సిక వేదిక మీదకు రాగానే- కంచర్ల గోపన్న రామదాసు ఐనట్లు- తనూ పేరు మార్చుకుని గుడి కట్టిస్తుందా అన్న జోక్ సందర్భోచితంగా తోచలేదు.  ఆమె ‘జంటిల్‍మన్’ చిత్రంలోని ‘ముదినేపల్లి మడిచేలో’  పాటని ఆలపిస్తే- ఒరిజినల పాటలో గొంతులు అనుకరించకుండా- మగ గొంతు, ఆడ గొంతులు ఫీల్ అయి పాడడం బాగుందన్న దేవిశ్రీ పరిశీలన గాయనికి ఉత్సాహకరం. రికార్డులో ఈ పాటను పాడిన సాహుల్ హమీద్ యాక్సిడెంట్లో 4, 5  సంవత్సరాల క్రితం పోయిన విషాద వార్త మనసు కలుక్కుమనిపించింది. డబ్బింగు పాట వ్రాయడంలో రాజశ్రీ ప్రతిభని ప్రస్తావించడం బాలు సాహిత్యానికిచ్చే విలువకు నిదర్శనం. పాయింట్లు: 80+88= 168.
ఈ సంచిక అనంతరం రాజేష్ 167, మల్లిక 165, సబీహా 155, లిప్సిక 168 పాయింట్లతో కొనసాగుతున్నారు.
అక్టోబర్ 4న మలి సంచికలో మొదటి వృత్తంలో పరభాషా సినీగీతాలు, రెండవ వృత్తంలో ఈనాటి హుషారైన పాటలు. గాయనీగాయకులు ఎంపిక చేసుకుని పాడిన పాటలివి.
మల్లిక: తాల్‍సె తాల్ మిలా (తాల్), చూడొద్దంటున్నా (పోకిరి). పాయింట్లు 85+80= 168
సబీహా: సత్యం శివం సుందరమ్ (సత్యం శివం సుందరం), పట్టు పట్టు చెయ్యి పట్టు (శంకర్‍దాదా ఎంబీబిఎస్). పాయింట్లు 84+80= 164
లిప్సిక: ముఝే రంగ్ దే రంగ్ దే (తక్షక్), ఓం నమస్తే బోలో బోలో (రెడీ). పాయింట్లు 86+86= 172
రాజేష్: మేరే నైనా సావన్ బాదోం (మెహబూబా), చెలియ చెలియా (ఘర్షణ). పాయింట్లు 86+80= 166
జ్ఞానం: తాల్‌సె తాల్ మిలా అన్న రెహమాన్  పాట లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వరసలా అనిపించేది మాకు. బాలు కూడా అదే విషయం చెప్పి- అందుకు కారణం సింధుభైరవి/భైరవి రాగం కావచ్చునన్నారు. నిర్మాత- దర్శకుడు సుభాష్ ఘాయ్ అభిరుచి కూడా ఒక కారణం కావచ్చునని స్వాభిప్రాయం. సంగీత దర్శకుడు విశ్వనాథన్ కి కవి అక్షరాలు చూడగానే వరస తడుతుందిట. దేవిశ్రీదీ అదే పద్ధతిట. ఆయన తండ్రి సత్యమూర్తి సృజనాత్మకతకోసం ఏ పాటకైనా వరస కాస్త మార్చి పాడేవాట్ట. రాగాలని విభిన్న అనుభూతులకి ఉపయోగించడానికి ఉదాహరణ: మేరే నైనా సావన్ బాదోం, శేషశైలావాస- పాటల రాగాలు ఒకటే. పాట వింటుంటేనే అక్షరాలు తెలియాలని ఎవియం చెట్టియార్ అనేవారుట- నేటి గాయనీగాయకులూ- వింటున్నారా? సబీహా చిరునామా ప్రేక్షకులకు అతి సర్వత్ర వర్జయేత్ అనిపించేటంత ప్రహసనమైనా- ఆమె సహనం అభినందించతగ్గది అన్నారు దేవిశ్రీ.
పరిజ్ఞానం: వర్షం సినిమాలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అన్న పాటలో నీళ్ల శబ్దం ఎలా వచ్చిందో వివరణ. ఓం నమస్తే బోలో బోలో పాట స్టైల్ ఆఫ్ సింగింగ్ ని- భాషని వక్రీకరించడంగా భావించకూడదు.
చమత్కారం: మన్మథుడు అంటే తనే పాడాలని బాలు. తక్షకుడంటే బుల్లెట్ అంది లిప్సిక.  వందేమాతరం వ్రాసింది బంకించంద్రుడని వేదికపై ఉన్నవారిలో బాలుకి మాత్రమే తెలుసు. పాటని ఫీలౌతూ పాడడంలో ఎనర్జీకీ మచ్చు అనిపించింది దేవిశ్రీ ఉదయించే సూర్యుడినడిగా- ప్రదర్శన.  తనకీ అలా చేయాలనున్నా ఆకారం సహకరించదన్నారు బాలు.
ఈ సంచిక అనంతరం మల్లిక 333, సబీహా 319, లిప్సిక 340, రాజేష్ 333 పాయింట్లతో కొనసాగుతున్నారు.
అక్టోబర్ 11 సంచికలో వినిపించినవి మాధుర్యప్రధానమైన గీతాలు- మొదటి వృత్తంలో పాత సినిమాల్లోవి,  రెండవ వృత్తంలో కొత్త సినిమాల్లోవి. .
సబీహా: సిరిమల్లె పూవా (పదహారేళ్ల వయసు), ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను (నువ్వులేక నేను లేను). పాయింట్లు 85+85= 170
లిప్సిక: ఝుమ్మంది నాదం (సిరిసిరిమువ్వ), భరత వేగముగ (పౌర్ణమి). పాయింట్లు 86+77= 163
రాజేష్: ప్రియతమా (ప్రేమ), రాజేష్: అంతర్యామీ అలసితి సొలసితి (అన్నమయ్య). పాయింట్లు 84+90= 174
మల్లిక: వేణువై వచ్చాను (మాతృదేవోభవ), నువ్వేనా (ఆనంద్).  పాయింట్లు 84+86= 170
కొన్ని మెరుపులు: పాడేవారికి సంగీత దర్శకుడి పేరు తెలియలేదని నొచ్చుకున్న బాలు- చాలా ఎపిసోడ్సువరకూ పాట మినహా మిగతా వివరాలను అందించడాన్ని తనూ పట్టించుకోలేదు. పాడేటప్పుడు పుస్తకం చూడకపోవడంవల్ల ప్రయోజనమన్నది ఔత్సాహికులకు గమనార్హం. కవితలెద అన్న పదం- కవితలు, ఎద- కలిసిన సమాసమని తెలియకపోతే- ఎద, లెదగా మారి భావప్రకటనకు భంగం వాటిల్లుతుందని- భాషపరంగా యువ గాయనీగాయకులకు కలిగిస్తున్న అవగాహన అవసరం, ప్రశంసనీయం. మయూరి చిత్రంలో వేటూరి చేత స్వరానికి ఏకాక్షరమిచ్చి పాట వ్రాయించుకున్నారట బాలు. మిలియన్ పాటల గురించి దేవిశ్రీ సమయస్ఫూర్తి బాలు స్థాయి చేరుకోవడం విశేషం. ఈ ఇరువురూ గాయనీగాయకులకు పనికొచ్చే ప్రేక్షకులకు ఆసక్తికరమైన ఎన్నో విషయాలు ముచ్చటించారు.
ఈ సంచిక అనంతరం సబీహా 484, లిప్సిక 503, రాజేష్ 507, మల్లిక 500 పాయింట్లతో కొనసాగుతున్నారు
అక్టోబర్ 18న స్వరసంగ్రామం తుది ఘట్టంలో చివరి సంచిక. ఇందులో గాయనీగాయకులు మొదటి వృత్తంలో కరావోకే పద్ధతిలో ట్రాక్ కి పాటలు పాడారు. రెండవ వృత్తంలో శాస్త్రీయ సినీ గీతాలు పాడారు. ఆ వివరాలివి.
లిప్సిక: నువ్వే మాయ చేసావొ కానీ (ఒక్కడు), బ్రోచేవారెవరురా (శంకరాభరణం). పాయింట్లు 87+65= 152
మల్లిక: అందంగా లేనా (గోదావరి), ఓం మహాప్రాణ దీపం (శ్రీ మంజునాథ)   పాయింట్లు 84+65= 149
సబీహా:  నువ్వే నా శ్వాస (ఒకరికి ఒకరు), ఆనతినీయరా (స్వాతికిరణం). పాయింట్లు 82+78= 160
రాజేష్: నీ హృదయం (ఏ మాయ చేసావె), శివశంకరీ (జగదేకవీరుని కథ). పాయింట్లు 78+87= 165
కొన్ని మెరుపులు: ఒక పాటకు స్పందిస్తూ- కష్టమైన పాటని ఓ మాదిరిగా పాడడంకంటే, సులభమైన పాటని అద్భుతంగా పాడడం అభిలషణీయమన్న- దేవిశ్రీ చురక ఔత్సాహికులకు హెచ్చరిక.  40 వారాలకు తెరదించిన పాట ‘శివశంకరీ’ కావడం విశేషం. అది మొదలు కావడానికి ముందు కొణిదెల శివశంకర వరప్రసాద్ (నటుడు చిరంజీవి) రంగప్రవేశం సమయోచితం. ఆయన్ను స్వాగతిస్తూ దేవిశ్రీ- శంకర్ దాదా ఎంబీబీఎస్– పాట పాడడం, అంతకుముందు దేవిశ్రీ ఆడుతూ పాడిన- నా ఊపిరి ఆగిపోయినా- ఇవన్నీ చూపరులకు ప్రత్యేక అనుభవాలు. మద్రాసులో సినీతారల అనుబంధం గురించిన చిరంజీవి పలుకులు హృద్యం.  బాలు తెలుగు సినీ సంగీత చరిత్రలో ఒక అధ్యాయమన్న చిరంజీవి మాట అక్షరసత్యం. ఐతే గాయనీగాయకులకు మించి బాలుకి అందిన ప్రశంసలు-  బాలు నిర్వహిస్తున్న ఈ వేదికను- బాలు అభినందన వేదికగా మార్సుసాయా అనిపించింది.
ఈ కార్యక్రమానికి ఆర్థిక వనరులందించిన సువర్ణభూమి సంస్థకు చెందిన శ్రీనివాస్, శ్రీధర్ లను పరిచయం చేయడం- వారు ముందుగా ప్రకటించిన బహుమతులకు అదనంగా చివరి ఇద్దరికీ కూడా చెరి యాబైవేల నూటపదహార్లూ ప్రకటించడం- ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి విజేతల పేర్లు ప్రకటించి కానుకలందించారు. ఆ వివరాలివి.
మొదటి బహుమతి (పది లక్షల రూపాయలు):  రాజేష్ (అనంతపురం) 80+87+86+80+84+90+78+87= 672) 84%
రెండవ బహుమతి (ఐదు లక్షల రూపాయలు): లిప్సిక (ఖమ్మం)(80+88+86+86+86+7787+65= 655) 81.9%

మూడవ బహుమతి (యాబైవేల నూటపదహారు రూపాయలు): మల్లిక

(గుంటూరు)

80+85+85+80+84+86+84+65= 649 81.1%
నాల్గవ బహుమతి (యాబైవేల నూటపదహారు రూపాయలు): సబీహా (కడప)
(80+75+84+80+85+80+82+78= 644) 80.5%
బాలు విశాఖను ప్రస్తుతిస్తూ చదివిన పద్యంతో ఈ ప్రకరణం ముగిసింది.
సింహావలోకనం: ఒక పాటల పోటీ ఇంత భారీ ఎత్తున, ఇంత ఆకర్షణీయంగా. ఆసక్తికరంగా నిర్వహించబడడం- బుల్లితెరకు తొలి అనుభవం. అందుకు సువర్ణభూమి, బాలు, ఈటివి  అభినందనార్హులు. ఈ వేడుకకు సూత్రధారిగా బాలు నిర్వహించిన పాత్రకు అభివందనాలు. ఐతే- ఈ గానసాగరమథనంలోంచి పుట్టుకొచ్చిన యువరత్నాలు ఇంకా సానబెట్టాల్సిన రత్నాలు. తగినవారి చేతబడి వారు జేజ్వల్యమానంగా ప్రకాశించగలరని ఆశిద్దాం, ఆశీర్వదిద్దాం. ఇక  అక్టోబర్  25నుంచి పాడుతా తీయగా- బాలగాంధర్వం పేరిట- బాలరత్నాలని వెలికి తీయనుంది. ఈ కార్యక్రమం బాలు అభినందన వేదికలా కాక- గానసాగర మథనానికి ప్రాధాన్యమిస్తూ భిన్నంగా కొనసాగుతుందని ఆశిద్దాం.

Exit mobile version