నవంబర్ 9, 2010

పాడుతా తీయగా- బాలగాంధర్వం

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి" at 4:07 ఉద. by వసుంధర

గద్యమైనా, పద్యమైనా, నేపధ్యమైనా పలకడంలో సుస్వరం. పాత్రనైనా, పాటనైనా ఒప్పించడంలో మనోహరం. తానెంతటివాడైనా తనంతవారి నిరతాన్వేషణలో సూత్రధారం. శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగా సుప్రసిద్ధులైన ఆయన్ని పెద్దా చిన్నా అంతా ముద్దుగా అభిమానంగా బాలు అంటారు. వినయానికి మారుపేరు కాబట్టి ఆయనకు బాలు అనిపించుకొనడమే ఇష్టం కావచ్చు. కానీ- వివిధరంగాల్లో ఆయన హోదాకీ ప్రతిభకీ తగినదనేకాక- ఆయన పేరుకి తగిన సంక్షిప్తం కూడా కాబట్టి ఆయన్ని బాసు అనడం సబబని స్వాభిప్రాయం.
మన బాసు పాడుతా తీయగా కార్యక్రమాన్ని ప్రారంభించి దశాబ్దం దాటిపోయింది. ఎందరో ఆయన పంథా అనుసరించినా- నాటికీ నేటికీ పాడుతా తీయగా ఆ తరహా కార్యక్రమాలన్నింటికీ బాసు.
ఇటీవలే అక్టోబరు 18న బాసు యువతకు నిర్వహించిన స్వరసంగ్రామం ముగిసింది. పాల్గొన్న గాయనీగాయకుల స్థాయి ఎలా ఉన్నా- ఆ సంగ్రామం 40 వారాలకు పైగా తెలుగునాట సంగీతప్రియులను బుల్లితెరకు కట్టిపారేసేలా ఆకట్టుకుంది (వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి).
ఆ పోటీ సినీ సంగీతపరంగా వర్తమానంపట్ల కొంత నిరుత్సాహాన్ని కలిగించే అవకాశాన్ని బాసు పసికట్టే ఉండాలి. భావిపట్ల ఉత్సుకత కలిగించడానికి ఆయన వెంటనే 8-14 వయసు మధ్యలోని భావి భారత గాయనీ గాయకులని అన్వేషించే మహత్తర కార్యానికి క్రమించి- ఆ కార్యక్రమాన్ని పాడుతా తీయగా బాలగాంధర్వంగా గత అక్టోబర్ 25న ఉపక్రమించి తెర తీసారు.
చిరంజీవి లక్ష్మీమేఘన ఆలపించిన శ్రీ గణనాధం పాట- ఈ కార్యక్రమానికి శ్రీకారమై- మున్ముందు ఆకరంకానున్న స్వరఝరుల్ని స్ఫురింపజేసింది.
ఈ కార్యక్రమంలో మొత్తం 52మంది లేత వయసు చిన్నారులు పాల్గొని రెండు వారాలపాటు శ్రోతల్ని అలరించారు. నవంబర్ 1న ముగిసిన ఈ తెరతీతక్రమంలో- వడపోత అనంతరం 34గురు ముందుకు కొనసాగడానికి ఎంపికయ్యారు. గొంతు పరిపక్వతనిబట్టి ఈ చిన్నారులను రెండు పక్షాలుగా విభజించదం ముదావహం. మరీ లేత గొంతుల్లో పద్దెనిమిదీ, కాస్త పక్వమైన గొంతుల్లో పదహారూ కొన్ని వారాలపాటు శ్రోతలకు వీనులవిందు చెయ్యనున్నాయి. నవంబరు 8నుంచి ఈ పోటీ ముందుగా లేత గొంతులమధ్య జరుగుతుంది.
భావిపట్ల అపారమైన నమ్మకం కలిగించే స్థాయి గొంతుల్నీ, ప్రతిభనీ ఎన్నిక చేసిన బాసుకి అభినందనలు. చిన్నారులకు శుభాశ్శీసులు, శుభాకాంక్షలు.
ఏ కార్యక్రమానికైనా ఉపోద్ఘాతంలో వినబడాల్సింది ప్రస్తుతాంశ ప్రస్తుతి. కానీ పిల్లల తలిదండ్రులనుద్దేశించిన మందలింపు వాక్యాలు వినిపించడం అపశృతి. నిర్వాహకులకి ఎదురయ్యే ఈ తరహా ఇబ్బందులు అందరికీ తెలిసినవే. వాటి ప్రస్తావన చిన్న విషయానికి అనవసరమైన గుర్తింపు ఇవ్వడమే. అలాగే పాట వివరాలను విడిగా చెప్పడానికి సమయాభావమైతే- వినిపిస్తున్నప్పుడు స్లైడ్‌గానైనా వెయ్యకపోతే- వ్రాసినవారికి, పాడినవారికి, వరస కూర్చినవారికి అన్యాయం చెయ్యడమేనన్న విషయం పదేపదే చెప్పనవసరం లేదు.
గత కార్యక్రమంలా ఈ కార్యక్రమంపై క్రమబద్ధమైన విశ్లేషణ అందించే ఉద్దేశ్యం లేదు. ప్రేక్షకులకు శుభాకాంక్షలు.

Leave a Reply

%d bloggers like this: