Site icon వసుంధర అక్షరజాలం

ఇజం మతం కులం మనం

భరతవర్షంలో ప్రతి మనిషీ- కవి, పండితుడు, జ్జాని, వేదాంతిల సమ్మేళనం. అందుకే సర్వేజనాస్సుఖినోభవంతు అన్నది మన సంప్రదాయ నినాదం.
నిజమైన కవులు, రచయితలు సర్వమానవ సమానత్వాన్ని కాంక్షిస్తారు కాబట్టి వారు కమ్యూనిజాన్ని అభిమానిస్తారు. స్వేచ్ఛని అభిలషిస్తారు కాబట్టి కాపిటలిజాన్ని అభిమానిస్తారు. ఇజం ఏదైనా మనిషికి మంచిదే- మతంలాగే. మతం గురించిన హెచ్చరిక గతంలో ఇలా వినిపించి ఉన్నాం.
మతం-మనం

మతం గతం ప్రజాహితం
మతం హితం స్వయంకృతం

మతం పేరు చెప్పుకుని
మనం మనం భుజం కలిపి
లక్ష్యాలను సాధిస్తే
అదే మతం అభిమతం

మతం పేరు చెప్పుకుని
జనం బలం పెంచుకుని
సమరభీతి తొలగిస్తే
మతం నీకు స్వాగతం

మతం పేరు చెప్పుకుని
మనం మనం కత్తి దూయ
ప్రవహించే నెత్తుటేర్లో
మతం మనం గతం గత:

కట్టుబడే ప్రధానమనుకుంటే ఇజం మతమంత ప్రమాదకరమైనది. ఇజం గురించిన హెచ్చరిక గతంలో ఇలా వినిపించి ఉన్నాం.

ఇజం-నిజం

ఇజం రూపు నీవు ధ్వజంలోన చూడకు
ఇజం పేర నీవు భేషజం చూపకు
ఇజం మనం భుజం భుజం కలపడానికి
ఇజం మనకు బ్రతుకు నిజం తెలుపడానికి

స్వేచ్ఛని అణగద్రొక్కాలనుకున్న చోట ఏ ఇజమూ వర్ధిల్లదు. బలవంతమైన రష్యాలో కమ్యూనిజం బలహీనపడడానికి కారణమదే! కమ్యూనిజంతో వర్ధిల్లుతున్న చైనా ప్రగతి- కాపిటలిస్టు దేశాలకు మెరుగైన సేవల్ని సరసమైన ధరలకు అందించడంలోనే ఉన్నది.
మన దేశ ప్రగతికి కమ్యూనిజం అవసరం ఎంతైనా ఉన్నదని మేము నమ్ముతాం. కమ్యూనిజం వల్ల దేశంలో అవినీతి కొంత తగ్గింది. పేదలు, శ్రామికులు, ఉద్యోగులు చెప్పుకోతగ్గ ప్రయోజనం పొందారు, పొందుతున్నారు. కానీ మన కమ్యూనిస్టుల్లో కొందరు హింసను సాధనం చేసుకున్నారు. కొందరు అమెరికాను ద్వేషించడమే కమ్యూనిజం అనుకుంటారు. కొందరు చైనాలో ఒప్పే తప్ప తప్పు లేదని నమ్ముతారు. వారికి కమ్యూనిజం ఇజం కాదు, మతం! ఇజం మతమైతే ఆది కులమంత చెడ్డది.
కులవ్యవస్థ పోవాలని అంతా అంటారు. దరఖాస్తు పత్రాలలో కులం ప్రసక్తి ఉండకూడదని ఘోషిస్తారు. 1970లలో కులం ఊసెత్తడానికి సిగ్గుపడుతూ- మరో పదేళ్లలో కులం మాట వినిపించదని ఆశించాం. కానీ ఇరవయ్యొకటో శతాబ్దంలో కులం విశ్వరూపంతో విజృంభిస్తుంటే ఆసంతృప్తితో కూడిన ఆశ్చర్యం కలుగుతోంది. ఇప్పుడు బాగా వెనుకబడ్డవారితోసహా అందరూ తమ పేర్లకు కులాన్ని కూడా జత చేస్తున్నారు. 2010 చివర్లో తెలుగునాడుకి కొత్త ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి ఎంపికయ్యారు. ఆ ఎంపికకు కారణం కులం. ఆయన యువకుడు కావడం ఆశలు రేపితే- ఆయన ఎంపిక చేసిన మంత్రుల జాబితాలో ప్రతి ఒక్కరి కులమూ స్పష్టంగా మీడియాకు అందజేయబడింది. అది చాలా మామూలు విషయమైనట్లు బహిరంగచర్చలు జరిగాయి. కులం గురించిన మా ఆవేదన ఇటీవల ఇలా వినిపించాం.

మథనం

బార్బర్ అనవచ్చు కాని మంగలి అనకూడదు
వాషర్‌మన్ అనగలరు కాని చాకలి అనలేరు
వడ్రంగిని కార్పెంటర్ అనకుంటే తప్పు
కంసాలిని గోల్డ్‌స్మ్తిత్ అనుకుంటే ఒప్పు

కులవృత్తుల కుల గరళం
గళాన నింపుకున్న పరమశివులం
వృత్తి అమృతాన్ని
ఆంగ్లానికి అమ్ముకున్న మహానుభావులం

కులవ్యవస్థను తొలగించగల శక్తి ప్రస్తుతం కమ్యూనిజానికి మాత్రమే ఉన్నది. కానీ వారు అమెరికాని వ్యతిరేకించినంతగా కులవ్యవస్థని వ్యతిరేకించరు. మన కమ్యూనిస్టుల తరహాని ఇటెవల ఇలా విశ్లేషించి ఉన్నాం.

పేద వ్యాసుడు

నా మిత్రుడు కాపిటలిస్టు
అతడికి తరగని నిధి- పేదలకు ఉపాధి
అతడి కొడుకు స్టూడెంటు
పేదలపై వ్యాసమతడి టేస్టూ టాలెంటు

పేదవాడి నౌకర్లూ కారు తోలు చాఫర్లూ
పేదవాడి ట్రేడింగుకి స్టాక్ మార్కెట్ బ్రోకర్లూ
పేదవాడి తోటలకి నీళ్లట్టిన మాలీలూ
పేదవాడి మేడలకి రాళ్లెత్తిన కూలీలూ
వాళ్లంతా పేదలు నిరుపేదలంటు
పేదవ్యాసమొకటి వ్రాసి చూసుకుని మురిసాడు

నా మిత్రుడు కమ్యూనిస్టు
అతడికి కరిగిన మది- పేదలకు పెన్నిధి
అతడి బ్రతుకు మార్క్సిజం
పేదలె వ్యాసంగమతడి బోధలె కమ్యూనిజం

అతడి పనికి నౌకర్లూ కారు తోలు చాఫర్లూ
అతడి షేర్ల ట్రేడింగుకి స్టాక్ మార్కెట్ బ్రోకర్లూ
అతడు కొన్న తోటలకి నీళ్లట్టిన మాలీలూ
అతడికున్న మేడలకి రాళ్లెత్తిన కూలీలూ
వాళ్లంతా మార్క్సిస్టులు వాళ్లే కమ్యూనిస్టులు
వాళ్లే వైతాళికులని ఘోషపెట్టి మురిసాడు

అతడు నిరసించే సంప్రదాయం వేదవ్యాసుడిది
అనుసరించే సంప్రదాయం పేదవ్యాసుడిది

అమెరికా ఆర్థికంగా, సాంఘికంగా, వైజ్జానికంగా ప్రగతి సాధించి ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం. కులవ్యవస్థ లేని ఆ దేశంలో జాతి వివక్ష లేదనడం కష్టమైనా- ఏ హోదాలో తప్పులు చేసినా తప్పించుకోలేని స్వేచ్ఛావ్యవస్థ అక్కడ ఉంది. ఆ దేశాన్ని గుడ్డిగా అనుసరించకపోయినా గుడ్డిగా ద్వేషించకూడదని హెచ్చరించే- ‘పార్టీ మనిషా కాడా?’ అన్న కథ (రచన నవంబర్ 2010) ప్రతి ఒక్కరూ చదువతగ్గది.
ఇక నిజమైన కమ్యూనిస్టులు ఎలా ఉంటారో, ఉండాలో తెలుసుకుందుకు ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు గురించి తెలుసుకోవాలి. ఈనాడు (అక్టోబర్ 30) దినపత్రికలో వచ్చిన ఆయన వివరాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Exit mobile version