Site icon వసుంధర అక్షరజాలం

హైదరాబాదులో తానా చైతన్య స్రవంతి

డిసెంబర్ 19, 2010 ఆదివారం- ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్యస్రవంతి తెలుగు వైభవం ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీమతి ఎ. అన్నపూర్ణ తమ అనుభవాల్నీ, అనుభూతుల్నీ (ఇది సమగ్ర నివేదిక కాదని మనవి) అక్షరజాలంలో పంచుకుంటున్నారు. వారికి ధన్యవాదాలర్పిస్తూ ఆ విశేషాల్ని వారి మాటల్లో తెలుసుకుందాం.
ఈ ఉత్సవాలు తెలుగు భాష గొప్పతనం, సంప్రదాయాల ప్రతీకగా ప్రారంభమయ్యాయి. కర్ణాటక రాష్ట్రం మాజీ గవర్నర్ ముఖ్య అతిథిగా వేదిక నలంకరించారు. తానా అధ్యక్షులు కోమటి జయరాం, ఉపాధ్యక్షులు తోటకూర ప్రసాద్- ౨౦మంది రచయితలను చర్చా కార్యక్రమానికి ఆహ్వానించారు. తానా సంస్థను ప్రారంభించిన కాకర్ల సుబ్బారావు గారు అప్పటి విషయాలను వివరించారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అమెరికాలోని భారతీయులకు తానా సంస్థ అందిస్తున్న సహాయ సహకారాల గురించి తెలియజేశారు. కొన్ని కవితలను, పద్యాలను మధురాతిమధురంగా వినిపించారు.
తర్వాత రెండు గంటల పాటు  కొనసాగిన రచయిత్రుల సమావేశంలో- అబ్బూరి ఛాయాదేవి, డి. కామేశ్వరి, మృణాళిని, కె.బి. లక్ష్మి, పొత్తూరి విజయలక్ష్మి, ఎం. సుజాతారెడ్డి, శారదా అశోకవర్ధన్, అత్తలూరి విజయలక్ష్మి, శ్రీలత, బలభద్రపాత్రుని రమణి ప్రభృతులు పాల్గొన్నారు. తెలుగు భాషను పునరుద్ధరించడంలో అమెరికా ఆంధ్రులు ముందున్నారని కొందరన్నారు. చాలామంది తెలుగు భాష వాడకంలోని పొరపాట్లు, పిల్లలకు తెలుగు నేర్పించని తలిదండ్రుల తీరు, ప్రాచీన తెలుగు వైభవం- వగైరాలను ప్రస్తావించి- ఆవేదన చెందారు. దానికి బదులుగా- తెలుగు భాష అనుకున్నంత అధోగతిలో లేదని చురక వేశారు. నాకూ అలాగే అనిపించింది. జీ టివిలో నువ్వా నేనా, ఈటివిలో పాడుతా తీయగా- వగైరా కార్యక్రమాల్లో పిల్లలను చూస్తే- తెలుగుకు భావి లేదని అనగలమా? దేశంలో ఉపాధికి, అమెరికా వెళ్లడానికి అనువనీ- చాలామంది తమ పిల్లల్లకి ఇంగ్లీషు మాత్రమే నేర్పించడానికి కారణం కావచ్చు.
మనలో మన మాట- తీరి కూర్చునో, సన్మానాలు చేయించుకోడానికో, సత్కారాలు అందుకోడానికో- కొందరు ఇలాంటి వివాదాలకు కొంత కారణం అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. పాపం శమించు కాక!
ముప్పై సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడిన విజయ ఆసూరి- తానా గురించీ, ఆ సంస్థ  మూడు నగరాల్లో (హైదరాబాద్, తిరుపతి, విజయవాడ) జరిపే కార్యక్రమాల గురించీ- స్పష్టమైన చక్కటి తెలుగులో ఆకట్టుకునే విధంగా ప్రసంగించడం ముచ్చట గొలిపింది. సహాయం అర్ధించినవారికి అందించడం ఒక వంతు. అమెరికాకి కొత్తగా వచ్చిన తెలుగువారు ఏ యాక్సిడెంటులోనో అకాలమరణం చెందినప్పుడు-  ఆ సంస్థ వారు మేమున్నామంటూ- స్వదేశంలో ఉన్నవారికి ధైర్యం చెప్పి- మృతదేహం పంపే ఏర్పాట్లు కూడా చెయ్యడం అరుదైన విశేషం. తెలుగువారికి ఏ సాయం అవసరమైనా- కులమతవర్గ భేదాలే కాదు- వారు తమ సంస్థ సభ్యులా అన్నది కూడా పట్టించుకోరు.     ఇలాంటి ఎన్నో విశేషాలతో- చాలా కాలానికి మంచి కార్యక్రమాన్ని చూసిన సంతోషాన్నివ్వడం ఈ సభ విశిష్టత.
ఇక అసంతృప్తి కలిగించిన విషయాలివి:
ఏదో ఆశించి మొదట్లో జరిగిన (పురుష) రచయితల కార్యక్రమానికి హాలు నిండుగానే ఉన్నా- ఆ కార్యక్రమం ముగిసిన గంటకే చాలావరకూ హాలు ఖాళీ. ముఖ్యులకు (విఐపిలు) మాత్రమే భోజనాలు ఏర్పాటు చెయ్యడం ఓ కారణం కావచ్చు.
కొందరు రచయితలు, వారి తరఫు వారు, ఆడియో విడియోలతో పత్రికా విలేకరులు తప్పితే రచయిత్రుల సమావేశానికి అదనపు ప్రేక్షకులు లేరు. తానా వారి పరిచయస్థులు, కార్యక్రమ నిర్వాహకులు- తమ తమ ఇష్టం ప్రకారం రచయిత(త్రు)లను ఎంపిక చేసి ఉండడం ఓ కారణం కావచ్చు (ఇదేం కొత్త విషయం కాదు).
ఏదేమైనా ఈ కార్యక్రమాలు వంగూరి ఫౌండేషన్ కార్యక్రమాలకంటే పకడ్బందీగా నిర్వహించబడ్డాయి. రవీంద్రభారతిలో నిర్వహించడమే తానా ప్రత్యేకత కదా!

Exit mobile version