వసుంధర అక్షరజాలం

తోడొకరుండిన….

మనిషికి అన్ని వయసుల్లోనూ తోడు కావాలి. వాటిలో కౌమార యౌవనాలు స్వయంసాయక శక్తివల్ల తోడు లేకపోయినా ప్రమోదకరమైనవి. బాల్యం, వృద్ధాప్యం అసహాయ దశవల్ల తోడు లేక ప్రమాదకరమైనవి. మొదటి మూడు దశల్లోనూ ఎదుగుదల ఉండడంవల్ల ఇబ్బందుల్ని వెన్నంటే ఆశ కూడా ఉంటుంది. వృద్ధాప్యం క్షీణదశ. ఈ దశకు పుష్టినిచ్చేది తోడు మాత్రమే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండడంవల్ల ఏ దశలోనూ తోడు సమస్యగా ఉండేది కాదు. కాలం మారింది. పెద్దలొకచోట, పిల్లలొకచోట. దూరాలు కూడా సప్తసముద్రాలు దాటవలసినంత.  ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉన్నా తోడు లేక పండుటాకులు ఎండుటాకులైపోతున్న దురవస్థ.
వృద్ధుల అనుభవం, పరిణతి- సమాజపు ప్రగతికి అత్యావశ్యకం. అలాంటివారికి ఇప్పుడు తోడు కరువైంది. ముసలితనంలో జీవిత భాగస్వామిని కోల్పోవడమంత దౌర్భాగ్యం మరొకటుండదు. మరో వివాహానికి అనువు కాని ఆ వయసులో సహజీవనమే వారి సౌభాగ్యం. ఆ దృష్టికోణంలో ఆలోచించి- ‘తోడు-నీడ’ కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీమతి రాజేశ్వరి. గతంలో ఇచ్చిన ఆ వివరాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఆమె ఆలోచన ఇప్పటికి ఒక రూపు దిద్దుకుంది. ఆ ప్రకారం వృద్ధులు తమ అభిరుచులకు అనుగుణంగా మిత్రులనెన్నుకుని సహజీవనం చెయ్యొచ్చు. ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఆ వయసులోనూ తోడు కోసం ఆడా మగా వివాహం చేసుకోవచ్చు, లేదా సహజీవనమూ చెయ్యొచ్చు. ఇది విప్లవాత్మకంగా తోచవచ్చు కానీ- కాస్త ఆలోచిస్తే రగులుతున్న గొప్ప సమస్యకు అతి సులభ పరిష్కారంగా తోస్తుంది. భూమి గుండ్రంగా ఉన్నదని నమ్మడానికి తటపటాయించినవారికి లాగే- నేటి మన సమాజమూ- ఈ సత్యాన్ని త్వరలో ఆమోదిస్తుంది.
ఆరంభంలో చిక్కులు ఎదురైనా వీగిపోని ధైర్యంతో ముందడుగేసిన శ్రీమతి రాజేశ్వరికి క్రమంగా అనూహ్య స్పందన, సహకారం లభించి- ఈ కార్యక్రమం క్రమంగా ప్రయోజనకరమైన ప్రజా ఉద్యమంగా మారుతోందనడానికి సూచనగా ఈ క్రింది లింకులు చూడగలరు.
తోడు-నీడ ప్రచారం
తోడుకోసం అడుగు
మలిసంధ్యలో కొత్త వెలుగులు
ఒంటరి వృద్ధులకు తోడు నీడ
మలి వయసులో మేలి మలుపు
ఒంటరితనాన్ని తోడెయ్యండి
తోడు నీడ ఈ వయసులో
శ్రీమతి రాజేశ్వరికి అక్షరజాలం అభివందనాలు.

Exit mobile version