జనవరి 1, 2011

శుభాకాంక్షలు

Posted in Uncategorized at 12:03 సా. by వసుంధర

దేశభాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆంధ్రభోజుడు. తెలుగు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నాడు పాశ్చాత్యుడు. తేనెకన్న తియ్యనిది అని మనవాళ్లూ అంటారు, అనుకుంటారు. ‘ఆమ్మ ప్రేమకన్న కమ్మదనము లేదు, తెలుగు భాషకన్న తేనె లేదు- దేశసేవకన్న తీర్థయాత్రయె లేదు, దైవభక్తికన్న ధనము లేదు’ అన్నారు గరికపాటి. అంటూనే
ఏ బాష పోషించుటే భాగ్యమని యెంచి
కేల పల్లకినెత్తె కృష్ణవిభుడు
ఏ భాష మేల్గోరి ఇంగ్లీషు దొర బ్రౌను
తాటాకులకు గ్రంథదర్పమిచ్చె
ఏ భాషవారల కేక రాష్ట్రము కోర
పొట్టి శ్రీరాములు పుట్టిమునిగె
ఏ భాష గౌరవమినుమడింపగజేయ
రథమెక్కి చాటించె రామరావు
అట్టి మన భాష హృదయమ్ము పట్టుకొనుడు
వట్టి పరభాషపై మోజు వదలుకొనుడు
మమ్మి డాడీల మాటలు మానుడయ్య
అమ్మ నాన్నల అనురాగమందుడయ్య
అంటూ తెలుగును నిర్లక్ష్యం చేస్తున్న సాటి యువత తీరుపై ఆవేదన చెందారు.
నేడు అతి త్వరగా అంతరించనున్న భాషల్లో ఒకటిగా తెలుగును తరచుగా ప్రస్తావిస్తున్నారు.
తెలుగు భాష గొప్పతనం పలుకుబడితోపాటు సాహిత్యంలోనూ ఉంది. మన కావ్యాలు, కథలు, కవితలు, రచనలు, సంగీతం అస్వాదించడం ఎంత అదృష్టమో, వాటి అనుభూతి పొందకపోవదం అంత దురదృష్టం.
ఆంగ్లభాష తెలుగుపై ఆధిక్యాన్ని చూపడం ప్రపంచీకరణకు చాలాముందే అరంభమైంది. ఆధునికతపై మోజు అందుకు కొంత కారణమైనా ఉపాధి అవకాశాలు ముఖ్య కారణం. వాటిని త్వరలోనే తప్పక అధిగమించగలం.
మా అభిప్రాయంలో తెలుగువారు అదృష్టవంతులు. టివిల ప్రాభవం తెలుగుతనానికి భావిని సూచిస్తోంది. కొన్ని కార్యక్రమాల్లో ఉచ్చారణ దోషాలు ఎక్కువైనా- అచ్చ తెలుగును అంత అందంగానూ పలికేవారూ పెరుగుతున్నారు. పాడుతా తీయగా వంటి కార్యక్రమాల్లో చిన్నారుల తెలుగు ముచ్చట గొలుపుతూ, భావిని ఆశాజనకం చేస్తోంది.  అంతంతమాత్రంగా వినిపించే అన్నమయ్య కీర్తనలు ఆరొందల ఏళ్ల తర్వాత ఊపందుకుని ఇంటింటా వాడవాడలా ప్రపంచవ్యాప్తంగా మార్మ్రోగడం అందుకు నిదర్శనం.  తెలుగు భాష ఆచంద్రతారార్కం వర్ధిల్లుతుంది. ఎందుకంటే నేడు జాతీయంగా రాష్ట్రభాషలుగా పరిగణించబడేవి కూడా అంతర్జాతీయ హోదా పొందేందుకు అంతర్జాలం అద్భుతంగా సహకరిస్తోంది.
తెలుగు భాషాభిమానులందరికీ అక్షరజాలం నూతన సంవత్సర శుభాకాంక్షలు.

4 వ్యాఖ్యలు »

  1. పిఆర్ తమిరి said,

    ముందుగా ఆంగ్ల సంవత్సర (౨౦౧౧) శుభాకాంక్షలు….
    ఈ టపాలో తెలుగు మాధుర్యాన్ని చక్కగా చెప్పారు… చదివిన తర్వాత కలిగిన భావాలను ఈ క్రింద రాస్తున్నాను…
    తెలుగు నిజంగా తేనె కన్నా తీయనిదే… అయితే ఆ తేనెను ఇంకిపోకుండా చూసుకోవల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. తెలుగుకు ప్రాచీన హోదా ప్రకటించినప్పటికీ అదింకా మార్గంలోనే ఉంది. దాని ద్వారా అత్యవసరంగా చేయవలసిన పనులు ఉండనే ఉన్నాయి. తెలుగు మాద్యమంలో విద్యాబోధన, కళాశాల, విశ్వవిద్యాలయ కోర్సుల్లో తెలుగు ఒక పాఠ్యాంశంగా అధ్యయనం, వగైరాలు సాధించుకోకపోతే తెలుగు మనగలగడం కష్టం. విద్యాలయాల్లో తెలుగు స్థాయిని, స్థానాన్ని పెంపొందించుకోక పోతే వ్యవహారంలో తెలుగు ఎలా నిలబడగలుగుతుంది? తెలుగు అభివృద్ధికి ఒకపక్క జరుగుతున్న పావలా వంతు కృషికి ఆనందపడి మిన్నకుండిపోతే ప్రయోజనం లేదు.. మూడు పావలాల వంతు కృషి నా మాటేంచేశారంటూ ప్రశ్నార్థకంగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జరగాల్సిన పనులు జరిగితేనే తెలుగు వైభవాన్ని చూడగలం…

    • ఇలాంటి ఆరాటం చాలు- భాష మనుగడకి. ఈ రోజు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చిన మా కథ ‘సచ్‌కా సామ్‌నా- జస్ట్ ఎ ఫార్మాలిటీ’ చదివి- విశాఖపట్నం నుంచి ఓ ఎమ్‌బిఎ విద్యార్ధి ఫోన్లో తెలిపిన స్పందన- నవతరం దృష్ట్యా తెలుగుకి ఉన్న భావిపట్ల ఆశాభావానికి నిదర్శనం. నిరాశకు ఏ మాత్రం తావివ్వకుండా, నిరుత్సాహాన్ని ఏ మాత్రం దరికి రానివ్వకుండా- మన వంతు కృషి కొనసాగిద్దాం. సత్ఫలితం తప్పనిసరి.


Leave a Reply

%d bloggers like this: